స్మార్ట్‌ఫోన్ లేనిదే రోజు గడవదేమో అన్నంతగా అది మన జీవితంలో భాగమైపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ప్రీతిపాత్రమైన స్మార్ట్‌ఫోన్‌కు మెయింటనెన్స్ అవసరమే. ఎప్పటికప్పుడు క్యాచే క్లీన్ చేసుకుంటూ అవసరం లేని యాప్స్‌ను అన్ఇన్‌స్టాల్ చేసేస్తూ ర్యామ్‌మీద భారం తగ్గిస్తే ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది. ఇక ఫోన్ ఫిజికల్ కండిషన్‌ను కూడా నీట్‌గా ఉంచుకోవాలి. అంటే దాన్ని బయటవైపు కూడా క్లీన్ చేయాలి. మీ స్మార్ట్‌ఫోన్ క్లీన్ చేసేటప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పే గైడ్ మీకోసం..
ఏం చేయాలి?
1. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాటరీ బయటకు తీయండి. రిమూవబుల్ బ్యాటరీ ఉన్న ఫోన్ అయితే ఫోన్‌ను స్విచ్ ఆఫ్‌చేయండి.
2. ఫోన్ క్లీన్ చేసేటప్పుడు కుర్చీ లేదా స్టూల్ మీద కూర్చుని దాన్ని టేబుల్ మీద పెట్టి క్లీన్ చేయండి. క్లీన్ చేయడానికి పనికి వచ్చే మెటీరియల్ అంతా రడీగా టేబుల్ మీద పెట్టుకోండి.
3. ఫోన్ మీద కవర్ కేస్ ఏదైనా ఉంటే తీసేయండి.
4. ఫోన్ స్క్రీన్‌ను పొడిగా ఉన్న కాటన్ క్లాత్‌తో నెమ్మదిగా తుడవండి. ఏమైనా మరకలున్నట్లు కనిపిస్తే కొద్దిగా నొక్కండి. అంతేగానీ గట్టిగా నొక్కొద్దు.
5. అవసరమైతే తడిబట్టతో తుడవండి. అలాగని నీళ్లలో నానబెట్టిన బట్టను వాడకండి. క్లీనింగ్ లిక్విడ్‌ను క్లాత్‌మీద స్ప్రే చేసి ఆ బట్టతో ఫోన్‌ను తుడవండి.
6. ఫోన్ కార్నర్స్‌లో క్లీన్ చేయడానికి స్మూత్‌గా ఉన్న బ్రష్ వాడండి.
7. ఫోన్ బ్యాక్ సైడ్, చివరల్లో కూడా తడిబట్టతో తుడవండి.
8. ఛార్జింగ్ పాయంట్స్, స్పీకర్, ఆడియో పోర్ట్ దగ్గర సాఫ్ట్ బ్లోయర్‌తో గాలి కొట్టండి. మీ నోటితో గాలి ఊదితే ఇంకా మంచిది.
9. ఫ్రంట్, బ్యాక్ కెమెరా లెన్స్‌లను కూడా తడిబట్టతో తుడిచి వెంటనే దాన్ని పొడిగా ఉన్న క్లాత్‌తో తుడిచేయండి.
10. ఫోన్ పూర్తిగా క్లీన్ చేశాక, ఆ తడి అంతా పూర్తిగా ఆరిపోయేవరకు ఫోన్ ఆన్ చేయకండి. అంటే కనీసం ఓ అరగంటన్నా ఆఫ్ చేసే ఉంచండి.
ఏం చేయకూడదు?
1. నీళ్లలో బాగా తడిపిన క్లాత్ వాడకండి. జస్ట్ నీళ్లు చల్లిన క్లాత్ లేదా పొడి బట్టను మాత్రమే ఉపయోగించండి.
2. నీళ్లు లేదా క్లీనింగ్ లిక్విడ్‌ను స్క్రీన్ మీద డైరెక్ట్‌గా చల్లకండి. అలా చేస్తే మీ ఫోన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది.
3. ఫోన్‌ను నిలబడి క్లీన్ చేయకండి. తడికి ఫోన్‌చేతిలో నుంచి జారిపడే ప్రమాదముంది.
4. మీ ఫోన్‌లోని పోర్ట్‌లు, జాక్స్‌ను ఎలాంటి లిక్విడ్స్‌తో క్లీన్ చేయకండి. అవి మీఫోన్‌కు రిపేర్‌చేయలేని డ్యామేజ్ చేస్తాయి.
5. పదునుగా, పాయింటెడ్‌గా ఉండే వస్తువులతో క్లీన్ చేయకండి. ఫోన్లో ఉన్న సున్నితమైన భాగాలు దెబ్బతింటాయి.
6. ఫోన్ క్లీనింగ్ కోసం స్పెషల్‌గా లిక్విడ్స్ ఉంటాయి. అవే వాడండి. అంతే తప్ప మీరు సొంతంగా కెమికల్స్ కలిపి క్లీన్ చేసే ప్రయత్నాలు చేయకండి.