ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘‘కార్డ్‌లెస్ క్రెడిట్’’ (Cardless Credit) పేరిట ఓ కొత్త పేమెంట్ ఆప్షన్‌ను ప్రకటించింది. ఆర్థిక-సాంకేతిక వ్యాపార లావాదేవీల దిశగా పయనంలో భాగంగా తాము ఈ ఏడాది జనవరినుంచే ‘Pay Later’ ఫీచర్‌ను అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తుచేసింది. మరో దిగ్గజ్ ఆన్‌లైన్ వేదిక అమెజాన్ ఇండియా ‘Pay EMI’ క్రెడిట్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టిన కొద్దిరోజులకే ఫ్లిప్‌కార్ట్ కూడా తమ ఖాతాదారులకు రూ.60,000 తక్షణ రుణ పరిమితిని ఆఫర్ చేస్తూ ముందుకు రావడం గమనార్హం. కాగా, అమెరికా చిల్లర వర్తక దిగ్గజ సంస్థ ‘‘వాల్‌మార్ట్’’కు ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే అత్యధిక శాతం వాటాలను అమ్మేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ తాజా పేమెంట్ ఆప్షన్‌ను ప్రారంభించి, దరఖాస్తు, రుణ అర్హత అంచనా ప్రక్రియలను సరళం చేసినట్లు ప్రకటించింది. కార్డ్‌లెస్ క్రెడిట్ అంటే... ‘‘తక్షణ రుణ లభ్యతను సులభం చేసే పద్ధతే’’నని ఒక ప్రకటనలో వివరించింది.
కేవలం 60 సెకన్లలో నమోదు
కార్డ్‌లెస్ క్రెడిట్ కింద రూ.60వేల రుణ పరిమితి అర్హత కోసం దరఖాస్తు, నమోదు ప్రక్రియ కేవలం 60 సెకన్లలో పూర్తవుతుందని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఖాతాదారులు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు సమర్పిస్తే సరిపోతుందని పేర్కొంటోంది. వారి రుణార్హత సమాచారం, తమ వ్యాపార వేదికపై లావాదేవీల ఆధారంగా రుణ పరిమితి మొత్తాన్ని నిర్ధారిస్తామని తెలిపింది. దీని ప్రకారం... వస్తువు కొనుగోలు చేశాక, చెల్లింపు సమయంలో ఖాతాదారులకు రెండు ఆప్షన్లు ఉంటాయి: ఒకటి... వస్తువు విలువ రూ.2వేల లోపు ఉంటే ఒన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP)తో నిమిత్తం లేకుండా చెల్లింపు; రెండోది... ‘మరుసటి నెల’ (Pay Later next month) లేదా ‘3 నుంచి 12 నెలవారీ వాయిదాల్లో చెల్లింపు’ (EMIs of 3-12 months). రెండో ఆప్షన్‌ను ఎంచుకుంటే బకాయి సొమ్మును తమ డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ వినియోగదారులకు మాత్రమే ఇది అందుబాటులో ఉండగా త్వరలోనే ఐవోఎస్ ఆధారిత మొబైల్‌లకు, డెస్క్‌టాప్ యాప్‌కు విస్తరించే అవకాశం ఉంది.
ఫ్లిప్‌కార్ట్ ఖాతాదారులలో 4.5 కోట్లమంది సులభ రుణ లభ్యతకు దూరంగా ఉన్నారని అర్థం చేసుకున్నందువల్లనే ‘‘కార్డ్‌లెస్ క్రెడిట్’’ విధానం తెచ్చామని సంస్థ సీనియర్ వైస్-ప్రెసిడెంట్, ఆర్థిక-సాంకేతిక విభాగం అధిపతి రవి గరికపాటి తెలిపారు. కొనుగోలు శక్తినిబట్టి ఖాతాదారుల మధ్య అంతరం ఉండరాదన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. విలువైన వస్తువులపై ఆసక్తి, నాణ్యత విషయంలో ఖాతాదారులందరి అభిలాష ఒకటేనని చెప్పారు. కాబట్టి తక్షణ రుణ పరిమితి అందుబాటులో లేని ఖాతాదారుల కొనుగోలు శక్తికి కార్డ్‌లెస్ క్రెడిట్ ఊతమిస్తుందని చెప్పారు.