స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు పేలిపోవడానికి దారితీసే ప్రధాన కారణాల్లో ఒకటి నకిలీ మొబైల్ చార్జర్లు. మొబైల్ వాడకందారులు పవర్ అడాప్టర్లను గుడ్డిగా నమ్మడమన్నది తీవ్ర హాని కలిగించడంతోపాటు చివరకు మరణ కారణమయ్యే ప్రమాదం ఉంది. స్మార్ట్ ఫోన్ చార్జర్‌ను రాత్రంతా విద్యుత్ ప్లగ్‌కు తగిలించి ఉంచడంతో అది పేలిపోయి చెన్నైలో ఇటీవల 90 ఏళ్ల వ్యక్తి, ఆయన 60 ఏళ్ల కుమార్తె మరణించారు. అంతేకాకుండా చార్జర్ అసలైనది కాకపోతే బ్యాటరీ పనితీరు, విద్యుత్ నిల్వ సామర్థ్యం... మొత్తంమీద బ్యాటరీ జీవితకాలం దెబ్బతింటుంది. అందుకే నకిలీ చార్జర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో కొందరు దుకాణదారులు, కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ధనార్జనే పరమావధిగా నకిలీ చార్జర్లు అంటగడుతూ కొనుగోలుదారులను మోసగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మనం కొనే మొబైల్ చార్జర్ స్మార్ట్ ఫోన్ కంపెనీ తయారుచేసిందేనా, దానికి నకిలీయా అన్నది పసిగట్టడానికిగల మార్గాలను పరిశీలిద్దాం... సాధారణంగా శామ్‌సంగ్ బ్రాండ్ చార్జర్లలో అసలు, నకిలీ మధ్య తేడాను కనుగొనడం చాలా కష్టం. చార్జర్ మీద ముద్రించిన అక్షరాల మధ్య వ్యత్యాసాన్ని గమనించడం ఇందుకుగల మార్గాల్లో ఒకటి. దానిమీద కొన్ని వివరాలతోపాటు ‘‘A+’’ అని, ‘‘మేడ్ ఇన్ చైనా’’ (Made in China) అని ముద్రించి ఉంటే అది దాదాపు నకిలీయేనని చెప్పవచ్చు.
యాపిల్ ఐ-ఫోన్ నకిలీ చార్జర్లను కూడా మార్కెట్‌లో విస్తృతంగా అమ్ముతున్నారు. వీటిలోనూ ఏది అసలు, ఏది నకిలీ అన్నది పసిగట్టడం చాలా కష్టం. అయితే, ఒరిజినల్ బ్యాటరీమీద ‘‘డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా’’ అని ముద్రించి ఉంటుంది. అలాగే నకిలీ చార్జర్లపై యాపిల్ కంపెనీ లోగో అసాధారణ ముదురు రంగులో కనిపిస్తుంది. ఇక నకిలీ చార్జర్‌ను పసిగట్టాలంటే దాని తీగ పొడవును కొలవడం మరో మార్గం. అది 120 సెంటీమీటర్లకన్నా తక్కువగా ఉండి, అడాప్టర్ అసాధారణ రీతిలో పెద్దదిగా ఉంటే ఆ చార్జర్ నకిలీ అయ్యే అవకాశాలే అధికం.
అయితే, One Plus Dash చార్జర్లలో నకిలీని పసిగట్టడం చాలా సులభం. ఒరిజినల్ డ్యాష్ చార్జర్‌ను ప్లగ్‌కు తగిలించగానే బ్యాటరీ చార్జింగ్ గుర్తుకు బదులు చార్జర్‌పైగల చార్జింగ్ గుర్తు ఫ్లాష్ అవుతూంటుంది. అలా జరగలేదంటే అది నకిలీ చార్జరేనని తెలుసుకోవచ్చు.
హువెయి ఫోన్ చార్జర్ అసలా/నకిలీయా తెలుసుకోవాలంటే దానిపై ఉన్న బార్‌కోడ్ సమాచారాన్ని అడాప్టర్‌పై ముద్రించిన వివరాలతో పోల్చి చూడాలి. అవి రెండూ సరిపోలితే అది అసలైనదేనని నిర్ధారణకు రావచ్చు.
గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్ ఫోన్లతో ఫాస్ట్ చార్జర్లను అందిస్తుంది. దీనికి భిన్నంగా బ్యాటరీ నెమ్మదిగా చార్జ్ అవుతూ చాలా సమయం తీసుకుంటున్నట్లు కనిపిస్తే ఆ చార్జర్ బహుశా నకిలీ కావచ్చు.