ప్రయాణంలో ఉన్నపుడు రైల్లో, స్టేషన్లలో దొరికే పరిశుభ్రత లేని, సాదాసీదా ఆహారంతో విసిగిపోయారా? అయితే, ఇదిగో ప్రయాణానికి ముందే ఎక్కడెక్కడ ఏయే ఫుడ్ కావాలో ఆర్డర్ ఇచ్చేస్తే మీ సీటు దగ్గరకు వేడివేడిగా అందించే వెబ్‌సైట్ల జాబితా మీ కోసం...
ట్రావెల్ ఖానా
మీ ప్రయాణ అనుభవాన్ని షడ్రసోపేత రుచులతో నింపడమే తమ లక్ష్యమంటుంది ‘ట్రావెల్ ఖానా.’ కడుపు నింపే వేడివేడి తాజా ఆహారంతోపాటు కాలక్షేపానికి చిరుతిండ్లు కూడా సరఫరా చేస్తుంది. ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ రుచుల్లో శాకాహార-మాంసాహార వంటకాలను ఆర్డర్ చేసుకునే సదుపాయం మీ వేళ్లకొసల మీదే ఉంటుంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే మీకు కావాల్సిన కాంబో మీల్స్, తాలి తదితరాలను ఈ వెబ్‌సైట్‌లో ఆర్ఢర్ చేసుకోవచ్చు. అంతేకాదు... మీ ఆర్డర్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ పొందడానికి ప్రొమో కోడ్‌ను వినియోగించుకునే అవకాశం కూడా ఉంది.
రైల్‌రెస్ట్రో
రైల్వే ఆహార నాణ్యత, లభ్యత మీకు నచ్చని పక్షంలో ‘రైల్‌రెస్ట్రో’ మీకు అందుబాటులో ఉంది. మీ ప్రయాణ స్థానం నుంచి గమ్యం మధ్యలోగల ప్రదేశాల్లోని రెస్టారెంట్లతో అనుసంధానమై ఆహార సరఫరా సేవలు అందిస్తుందీ వెబ్‌సైట్. దీనిద్వారా మీకు ఆయా రెస్టారెంట్లలో నచ్చే వివిధ రకాల చైనీస్, ఇండియన్, కాంటినెంటల్ శాకాహార-మాంసాహార వంటకాలను మీ సీటువద్దకు తెప్పించుకోవచ్చు. వీటితోపాటు ఉత్తర-దక్షిణభారత, గుజరాతీ, రాజస్థానీ, మొఖలాయీ వంటి వివిధ ప్రాంతీయ భోజనాలను కూడా రుచిచూడొచ్చు. ముఖ్యంగా ప్యాంట్రీకార్ (వంట బోగీ)లేని రైళ్లలో ప్రయాణించేవారికి ఈ వెబ్‌సైట్ కమ్మని రుచులు చూపుతుంది.
కమ్‌సమ్
రైళ్లలో ఆహారం సరఫరాచేసే అగ్రశ్రేణి వెబ్‌సైట్లలో ‘కమ్‌సమ్’ ఒకటి. ఆకలి పుట్టించే పదార్థాలతోపాటు మృష్టాన్న భోజన సంతృప్తినిచ్చే వంటకాలు కావాలా... లేక పొట్ట బరువెక్కని తేలికపాటి ఆహారం కావాలా? ఏది కావాలన్నా- పరిశుభ్రంగా, వేడివేడిగా అందించడానికి కమ్‌సమ్ సిద్ధం.
రైల్‌యాత్రి
రైల్లో మీరు కూర్చున్న చోటికి ఆరోగ్యకరమైన, ఇంటి వంటలాంటి ఆహారాన్ని మీకందిస్తుంది ‘రైల్‌యాత్రి’ వెబ్‌సైట్. బహుళ వంటకాలకు వేదికైన రైల్‌యాత్రిద్వారా ప్రాంతీయ వంటకాలుసహా పిల్లల ప్రత్యేక ఆహారం, స్నాక్స్, నోరూరించే డిజర్ట్‌లు లభ్యమవుతాయి. మీరు ఆర్డరిచ్చే ఫుడ్‌తోపాటు దానికో ముక్తాయింపునిస్తూ ఓ ‘హాజ్మోలా’ సాచెట్‌ను ఉచితంగా అందిస్తుంది రైల్‌యాత్రి!
ఈ-కేటరింగ్
భారత రైల్వేలు నిర్వహించే ఓ మినీ ప్రభుత్వరంగ సంస్థ ‘ఈ-కేటరింగ్.’ నిత్యం దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణించేవారికి నాణ్యమైన, వైవిధ్యభరిత ఆహారాన్ని అందించడం లక్ష్యంగా రైల్వేశాఖ దీన్ని ప్రారంభించింది. రైళ్లలో సర్వసాధారణ భోజనం, నీళ్లలాంటి పప్పు, ఉడికీఉడకని కూరలతో మొహంమొత్తిన ప్రయాణికులు ఇప్పుడీ ఈ-కేటరింగ్‌ద్వారా రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఫాస్ట్‌ఫుడ్ నుంచి కాంటినెంటల్, చైనీస్, ఏషియన్, అమెరికన్, ఇటాలియన్ శాకపాకాలను కూడా రుచిచూడొచ్చు. అదీ... ప్రయాణంలో ఉండగా ఏ ప్రదేశంలోనైనా, ఏ సమయంలోనైనా తెప్పించుకోవచ్చు.
గోఫుడ్ఆన్‌లైన్
రైళ్లలో అత్యంత రుచికరం, పరిశుభ్రంగానేగాక ఆకర్షణీయ రీతిలో ఆహారం అందిస్తామంటుంది ‘గోఫుడ్ఆన్‌లైన్.’ ఈ వెబ్‌సైట్‌కు ‘ప్రయాణిక’ ఆదరణ కూడా బాగానే ఉంది. రైళ్లలో లభించే ఆహారం తిని అస్వస్థత పాలయ్యే ప్రయాణికుల అవస్థలు గమనించిన ఈ వెబ్‌సైట్- అత్యంత తాజా, నాణ్యమైన ఆహారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ రకాల స్నాక్స్, బెవరేజెస్‌తోపాటు రుచికరమైన వంటకాలు సరసమైన ధరల్లో అందజేస్తుంది గోఫుడ్ఆన్‌లైన్.