ఎలక్ట్రానిక్ వస్తువులు మన జీవితంలో ఒక భాగమైపోయిన యుగమిది. అయితే, వాటి నిర్వహణలో అత్యంత జాగరూకత పాటించడం అవసరం. అవి పాడైపోతే బాగుచేయాలన్నా, కొత్తవి కొనాలన్నా అందుకయ్యే ఖర్చు మన జేబును ఖాళీచేస్తుంది. కాబట్టి వాటితో సజావుగా పనిచేయించుకుంటూనే జాగ్రత్తగా చూసుకోవడం అవశ్యం. ఇందుకు పెద్దగా ఖర్చేమీ ఉండదు... కావాల్సిందల్లా కాస్త ఓపిక మాత్రమే. అవి దుమ్ము కొట్టుకుపోకుండా, విరిగిపోకుండా, ఓవర్‌హీట్ కాకుండా చూసుకోవడం ప్రధానం. ఇప్పుడు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలిద్దాం:-
టేబుల్ ఫ్యాన్
1. టేబుల్ ఫ్యాన్ బ్లేడ్స్‌మీద సాధారణంగా దుమ్ము ఎక్కువగా పేరుకుపోతూంటుంది. వాటిని శుభ్రం చేసే ఉత్తమ, సులభ మార్గం కంప్రెస్డ్ ఎయిర్‌ను వాడటం. ఈ కంప్రెస్డ్ ఎయిర్ క్యాన్లు ఏ హార్డ్‌వేర్ స్టోర్‌లోనైనా లభిస్తాయి.
2. ఫ్యాన్ ఇతర భాగాలను శుభ్రం చేయడం...
ఎ. ఫ్యాన్‌కు ముందూ, వెనుకా గ్రిల్స్‌ను తొలగించాలి.
బి. నీటిలో కాస్త డిటర్జెంట్ కలిపి వాటిని శుభ్రం చేయాలి.
సి. మెత్తటి, తడి బట్టతో వాటిని తుడవాలి.
డి. అయితే మోటార్ విషయంలో ఇలా చేయకూడదు.
ఇ. విడిభాగాలన్నిటినీ ఆరబెట్టాలి.
ఎఫ్. తిరిగి ఏ భాగాన్ని ఆ భాగం స్థానంలో అమర్చాలి.
ఇయర్ ఫోన్లు
1. ఆడియో ప్లే అవుతుండగా జాక్‌ను డివైజ్ నుంచి బయటకు లాగకూడదు. అలా చేయడంవల్ల డ్రైవర్‌లో కరకరమనే ధ్వని ప్రవేశించి డ్రైవర్ పనిచేయకుండా పోవడానికి దారితీస్తుంది.
2. దుమ్ము, తేమకు ఇయర్‌ఫోన్లను దూరంగా ఉంచాలి. దీనివల్ల ఇయర్‌ఫోన్లు మెరుగ్గా పనిచేస్తాయి.
3. గోరువెచ్చని నీటిలో కాస్త సోప్‌వేసి ఆ మిశ్రమంతో ఇయర్ బడ్స్‌ను శుభ్రం చేయాలి. అటుపైన పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే తిరిగి వాడుకోవాలి.
4. ఇయర్‌ఫోన్లపై దుమ్మును బ్రష్‌తో శుభ్రం చేయాలి. ఇంకా ఏమైనా దుమ్ము మిగిలి ఉంటే టూత్‌పిక్ వంటిదానితో తొలగించవచ్చు.
5. ఇయర్ ఫోన్ల వైరు ముడులు పడకుండా, మెలికలు తిరిగిపోకుండా ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పట్టి.. లాగకూడదు.
6. ఇయర్ ఫోన్లను అలమరలో ఉంచే సమయంలో కేబుల్‌ను బిగించి చుట్టకూడదు. వీలైతే వాటికోసం స్టోరేజ్ కేసు ఒకటి కొని ఉంచుకోవడం మంచిది.
మరికొన్ని వస్తువుల నిర్వహణ గురించి మరో వ్యాసంలో తెలుసుకుందాం!