మనం చాలా వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉండటం పరిపాటి. అయితే, మన ఫోన్ స్టోరేజ్‌ని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోవడంలో భాగంగా చాలా మెసేజ్‌లను, అటాచ్‌మెంట్లను సులభంగా డిలీట్ చేసేస్తుంటాం. ఈ ప్రక్రియలో కొన్ని ముఖ్యమైనవి కూడా పొరపాటున డిలీట్ అయిపోతే వాటిని రెస్టోర్ చేసుకోవడం ఎలా? ఇప్పటిదాకా మనం వాట్సాప్ మెసేజ్‌లను గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేసుకుంటున్న నేపథ్యంలో దీన్ని మీ స్టోరేజ్ పరిమితిలో భాగంగా పరిగణించబోమని వాట్సాప్ ఇటీవల ప్రకటించింది. ఇది మనకు సంతోషం కలిగించే ప్రకటనే అయినా, ఈ బ్యాకప్స్‌కు గూగుల్ డ్రైవ్‌లో ఎన్‌క్రిప్షన్ (సైబర్ భద్రత) లేదు. దీనివల్ల తమ వ్యక్తిగత డేటా గోప్యతకు భంగం కలుగుతుందని కొందరు ఆందోళనకు గురవుతుంటే మరికొందరికి అసలు ఈ విషయమే తెలియదు! అందుకే గూగుల్ డ్రైవ్‌తో పనిలేకుండా మెసేజ్‌లు రెస్టోర్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ మెసేజెస్ పునరుద్ధరణ
వాట్సాప్ మన డేటాను ప్రతిరోజూ తెల్లవారుజామున 2:00 గంటలకు (డిఫాల్ట్ సమయం) స్థానికంగా బ్యాకప్ చేస్తుందని చాలామందికి తెలియదు. మీరు రెస్టోర్ చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయాన్నిబట్టి లోకల్ బ్యాకప్ ఒకరోజు మునుపటిదని గుర్తించండి. ఏదైనా కారణంవల్ల ఫోన్‌ను ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌కు రీసెట్ చేయాలని భావిస్తే లేదా వాట్సాప్ తన పని ప్రారంభిస్తే కింది ప్రక్రియను అనుసరించండి.
ముందుగా వాట్సాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయండి. తర్వాత ప్లే స్టోర్‌కు వెళ్లి మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. ఈ సమయంలో వాట్సాప్ మిమ్మల్ని వెరిఫికేషన్ ప్రక్రియలోకి తీసుకెళ్తుంది. అప్పుడు మీ ఫోన్‌కు 6 అంకెల కోడ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయడంతో వెరిఫికేషన్ పూర్తయ్యాక వాట్సాప్ ఆటోమేటిక్‌గా మీ ఫోన్ బ్యాకప్ కోసం అన్వేషిస్తుంది. అందుబాటులో ఉన్న బ్యాకప్‌లో మెసేజ్‌లు, ఫైళ్లను రెస్టోర్ చేయాల్సిందిగా వాట్సాప్ సూచిస్తుంది. ముఖ్యంగా బ్యాకప్ ఎప్పడు అయిందో, దాని సైజ్ ఎంతో కూడా మీరు చూడగలరు. అటుపైన రెస్టోర్‌పై ట్యాప్ చేస్తే ఆ ప్రక్రియ మొదలవుతుంది. ఇది పూర్తయ్యాక రెస్టోర్ చేసిన మెసేజ్‌ల సంఖ్యను మీకు తెలియపరుస్తుంది. ఆ తర్వాత Nextపై ట్యాప్ చేయండి. తర్వాతి స్క్రీన్‌లో మీ పేరు, ప్రొఫైల్ పిక్చర్‌గా మీ ఫోటోను యాడ్ చేసుకోవచ్చు.
ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌తో ఇలా చేయాలి...
వాట్సాప్ నిత్యం లోకల్ బ్యాకప్ చేస్తుందని ఇంతకుముందే చెప్పుకున్నాం. దీనికి విభిన్న వెర్షన్‌లో రెస్టోర్ చేసుకోదలిస్తే మీకు ఫైల్ ఎక్స్‌ప్లోరర్ కావాలి. ఇందుకోసం ES File Explorerకన్నా Solid Explorerను వినియోగిస్తే బాగుంటుంది. కానీ, వీటిలో మీకిష్టమైనది వాడుకోవచ్చు. ఇందుకోసం ఏంచేయాలంటే... ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ను ఓపెన్ చేయండి. మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీకోసం బ్రౌజ్ చేసి, /WhatsApp/databases ఫోల్డర్‌ను అన్వేషించండి. అందులోనే మీ వాట్సాప్ బ్యాకప్ మొత్తం స్టోర్ అయి ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్, ప్రాధాన్యాలనుబట్టి ఈ ఫోల్డర్‌ను ఇంటర్నల్ లేదా ఎక్సటర్నల్ మెమరీలో కనుగొనవచ్చు. ఒకవేళ ఈ ఫోల్డర్‌ను మీరు కనుగొనలేకపోతే సెర్చ్ ఐకాన్‌పై ట్యాప్‌చేసి, ‘msgstore’ (కోట్స్ లేకుండా) అని టైప్ చేసి వెతకండి. అప్పుడు మీకు msgstore-YYYY-MM-DD.1.db.crypt12. ఫార్మాట్‌లో చాలా రిజల్ట్స్ కనిపిస్తాయి. వాటిలో కనిపించే తేదీనిబట్టి మీకు కావాల్సినదాన్ని రెస్టోర్ చేసుకోవచ్చు. ఇందులో మొదట కనిపించే తేదీలేని ఫైల్ తాజా వాట్సాప్ మెసేజెస్ బ్యాకప్‌గా గుర్తించాలి. తర్వాత ముందుకెళ్లేటప్పుడు కోరుకున్న ఫైల్‌ను కాపీ చేసి, మరో ఫోల్డర్‌లో వేయాలి. ఆ తర్వాత తాజా ఫైల్‌కు మీకు ఇష్టమైన కొత్త పేరు పెట్టాలి.
ఆ తర్వాత మరొక బ్యాకప్ ఫైల్‌ను ఎంచుకుంటే అది తాజా ఫైల్‌గా కనిపించేలా అందులోని తేదీ (YYYY-MM-DD) భాగాన్ని తొలగించాలి. (ఉదా.. msgstore.db.crypt12). దీన్ని కూడా మునుపు సేవ్ చేసిన తరహాలోనే జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత వాట్సాప్‌ను Uninstall, Reinstall చేసి, బ్యాకప్ నుంచి రెస్టోర్ చేశాక మీ డేటాను చెక్ చేసుకోవాలి. iOSలో ఎలా బ్యాకప్ చేసుకోవాలో మరో వ్యాసంలో తెలుసుకుందాం!