• తాజా వార్తలు

పోస్టాఫీస్ ఫిక్సెడ్ డిపాజిట్ల గురించి తప్పక చదవాల్సిన గైడ్-

మార్కెట్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. అయితే వాటిల్లో రాబడి గ్యారెంటీగా వస్తుందా లేదా అనే దానిపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. కనీసం పెట్టుబడి పెట్టిన మొత్తానికైనా 100 శాతం గ్యారెంటీ ఉందా అంటే అదీ లేదు. మరి పెట్టిన పెట్టుబడికి 100 శాతం న్యాయం చేసేవి ఏవైనా ఉన్నాయంటే ఉన్నాయనే చెప్పవచ్చు. అవే పోస్టాఫీస్ ఫిక్సెడ్ డిపాజిట్లు. ఇవి కస్టమర్లకు అధిక రాబడినిస్తాయే గాని వారిని ముంచవు. వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం 


పోస్టాఫీస్ టైం డిపాజిట్ (ఫిక్సెడ్ డిపాజిట్)లను టర్మ్ డిపాజిట్స్ అని కూడా పిలుస్తారు.ఈ డిపాజిట్లకు ప్రభుత్వమే  బలం. కేంద్ర ప్రభుత్వం మన డబ్బుకు పూర్తిగా హామీగా ఉంటుంది. అందుకే డబ్బు వంద శాతం పక్కా సేఫ్ గా ఉంటుంది. అయితే వీటిపై వడ్డీని కేంద్రం ప్రతీ మూడు నెలలకు ఓ సారి సమీక్షిస్తూ ఉంటుంది. రికరింగ్ డిపాజిట్లు, పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి స్కీం వంటివి కూడా పోస్టాఫీసులు ఆఫర్ చేస్తున్న సేవల్లో భాగంగా ఉన్నాయి. 

ఎవరైనా వీటిని చెక్కు, లేదా క్యాష్ ఇచ్చి ఖాతాను తెరవొచ్చు. అయితే పోస్ట్ డేటెడ్ చెక్స్ కాకుండా.. అదే రోజున చెల్లుబాటయ్యే తేదీతో చెక్స్ మాత్రమే తీసుకుంటారు. ఈ జూలై 1వ తేదీన ఈ వడ్డీ రేట్లను సమీక్షించారు. దాని ప్రకారం ఏడాది, రెండు, మూడేళ్ల పరిమితి ఉండే డిపాజిట్లకు 6.9 శాతం వడ్డీని నిర్ణయించారు. అదే ఐదేళ్ల పరిమితి ఉండే ఫిక్సెడ్ డిపాజిట్లకు పోస్టాఫీస్ 7.7 శాతం వడ్డీని ఇస్తోంది. 

దీని ప్రకారం మీ డబ్బు రెట్టింపు కావాలంటే 9 ఏళ్ల మూడు నెలలు పోస్టాఫీసులో ఉంచాలి. ఇందులో ఎఫ్.డి. తెరవడానికి కనీస మొత్తం రూ.200 ఉండాలి. గరిష్టంగా ఎంత మొత్తమైనా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఎలాంటి పరిమితీ లేదు. ఐదేళ్లకు పెట్టుబడిపెట్టిన ఎఫ్. డి.లపై ఆదాయపు పన్ను శాఖ ప్రోత్సాహకం సెక్షన్ 80సి వర్తిస్తుంది. అంటే మీరు ఈ సెక్షన్ కింద క్లైం చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తంపై వచ్చే వడ్డీపై మాత్రం ఎలాంటి మినహాయింపు లేదు. అంటే ఈ వడ్డీని కూడా ఆదాయంగా పరిణగిస్తారు.

బ్యాంకు ఖాతాలో అసలు, వడ్డీ ఈ బాండ్స్ మెచ్యూరిటీ ముగిసిన వెంటనే నేరుగా మీ బ్యాంకు ఖాతాలో అసలు, వడ్డీ జమైపోతుంది. ఈ ఖాతాల్లో పెట్టే పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వ పూచీ ఉంటుంది. ఈ వడ్డీని కూడా కేంద్రమే ఇస్తుంది కాబట్టి అసలు, వడ్డీకి ఎలాంటి ఆందోళనా లేదు. ఎవరు ఎన్ని ఫిక్సెడ్ డిపాజిట్లైనా చేయొచ్చు. ఎన్ని ఖాతాలైనా తెరవొచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఈ ఫిక్సెడ్ డిపాజిట్లను బదలాయించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అంటే మీరు ప్రాంతం మారినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరున్న చోటికే వీటిని మార్చుకోవచ్చు. 
 

జన రంజకమైన వార్తలు