ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ బ్యాకప్ గురించి ఇప్పటికే తెలుసుకున్నాం కదా... ఇప్పుడు IOS వేదికపై ఐఫోన్లలో మెసేజ్‌ల పునరుద్ధరణకు మార్గాలేమిటో తెలుసుకుందాం:-
గూగుల్ డ్రైవ్ బ్యాకప్ కోసం వాట్సాప్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నప్పటికీ యాపిల్ కంపెనీ అందుకు సుముఖత చూపలేదు. అందువల్ల iPhone వినియోగదారులు గూగుల్ డ్రైవ్‌లో వాట్సాప్ బ్యాకప్ చేసుకోలేరు. కాబట్టి iPhoneలో బ్యాకప్ అంతా iCloudలో స్టోర్ అవుతుంది. వాట్సాప్ యాప్‌లోని బ్యాకప్ సెట్టింగ్స్‌లో మీరు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి బ్యాకప్ iCloudలోకి వెళ్తుంది. ఆటో బ్యాకప్‌ను డిఫాల్ట్‌గా డైలీ బ్యాకప్ సెట్ చేసినట్లయితే మీ వాట్సాప్ చాట్స్ మొత్తం రోజూ iCloudలో స్టోర్ అవుతుంటాయి. మీ డిలిటెడ్ మెసేజెస్‌ను ఇందులోనుంచి రిస్టోర్ చేసుకోవాలంటే ముందుగా మీ iPhone నుంచి వాట్సాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయండి. తర్వాత యాపిల్ యాప్ స్టోర్ నుంచి మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోండి. తర్వాత మీ ఫోన్ నంబర్ వెరిఫికేషన్ కోసం OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి నిర్ధారణ ప్రక్రియ పూర్తయ్యాక తాజా బ్యాకప్‌ను Restore చేసుకుంటారా Skip చేయమంటారా అని వాట్సాప్ అడుగుతుంది. అప్పడు కుడివైపు ఎగువ మూలలో కనిపించే Restore ఆప్షన్‌ను ట్యాప్ చేస్తే బ్యాకప్ ఫైల్ తేదీని, దాని సైజును చూపుతుంది. దీన్ని రెస్టోర్ చేసుకున్న తర్వాత మీరు వాట్సాప్‌ను యథాతథంగా వాడుకోవచ్చు.
ITUNESతో మెసేజ్‌ల పునరుద్ధరణ
మీ స్మార్ట్ ఫోన్‌లో మీరు iTunesను వాడుతూ దాని సాయంతో వాట్సాప్ బ్యాకప్ తీసుకుంటూంటే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు iTunesతో బ్యాకప్ చేస్తూండకపోతే ఇక చేయగలిగిందేమీ ఉండదు. iTunesలో ఒక యాప్ తర్వాత మరో యాప్ బ్యాకప్‌ను రెస్టోర్ చేసుకునే వీల్లేదు. అలాంటప్పుడు మీరు iTunesతో రెస్టోర్ చేయదలిస్తే మీ ఫోన్ మొత్తం రెస్టోర్ అయిపోతుంది. వాట్సాప్‌సహా అన్ని యాప్‌లు, వాటి సెట్టింగ్స్ రెస్టోర్ అయిపోతాయన్న మాట! అయినా పర్వాలేదు.. ఈ దారిలోనే వెళ్తామని మీరనుకుంటే అలాగే చేయొచ్చు. ఇందుకోసం ఏంచేయాలంటే...
STEP 1: మీ iPhoneను దాని కేబుల్‌తో మీరు iTunes ఇన్‌స్టాల్ చేసిన ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయండి.
STEP 2: ఇప్పుడు iTunesను లాంచ్ చేయండి. అప్పుడది మీ ఫోన్‌ను ఆటోమేటిక్‌గా కనుగొనాలి. తర్వాత మీ iPhoneను అన్‌లాక్ చేయాల్సిందిగా అడుగుతుంది. ఈ సమయంలో అవసరమైతే మీరు తాజా బ్యాకప్ చేసి ఉంచుకోవాలి.
STEP 3: అనంతరం iTunes యాప్ ఎడమవైపు ఎగున కనిపించే మీ డివైజ్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. అప్పుడు మీ కొత్త బ్యాకప్ ప్రారంభించవచ్చు లేదా పాత బ్యాకప్‌ను రెస్టోర్ చేసుకోవచ్చు. ఆ మేరకు మీరు బ్యాకప్ చేసుకోవాలనుకన్న ఫైల్స్‌ను తేదీ ఆధారంగా డ్రాప్‌డౌన్ మెనూద్వారా ఎంపిక చేసుకోవాలి. ఇలా బ్యాకప్ ప్రక్రియ పూర్తయ్యాక మీరు ఒక్క వాట్సాప్ మాత్రమే కాకుండా మీ iPhoneలోని డేటా మొత్తం రెస్టోర్ అవుతుంది. అంటే... కాంటాక్ట్స్, మెసేజెస్ వగైరాలన్నీ రెస్టోర్ అవుతాయని గుర్తుంచుకోండి. కాబట్టి పాతది రెస్టోర్ చేసుకునే ముందే మీ ఫోన్‌లో అప్పటికేగల ఇతర డేటాను బ్యాకప్ చేసి ఉంచుకోవాలని మరువకండి!