• తాజా వార్తలు

ఫొటోల‌పై టైమ్‌స్టాంప్ యాడ్ చేయ‌డానికి 3 వే గైడ్‌

స్మార్ట్‌ఫోన్ కెమెరా ఇప్పుడు గ‌ణ‌నీయంగా ప‌రిణామం చెందింది. బొకే, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సీన్‌ రిక‌గ్నిష‌న్, వాట‌ర్‌మార్క్‌, బ్యూటీ మోడ్ వంటివి దాదాపు ప్ర‌తి స్మార్ట్‌ఫోన్‌లో భాగ‌మైపోయాయి. సాధార‌ణంగా ఆండ్రాయిడ్ కెమెరాలో బోలెడు ఫీచ‌ర్ల ఉన్న‌ప్ప‌టికీ టైమ్‌స్టాంప్ వంటిది లేక‌పోవ‌డ ఒక లోట‌నే చెప్పాలి. టైమ్‌స్టాంప్ (ఫొటోపై తేదీ, స‌మ‌యం) అనేది అన‌లాగ్ కెమెరాల్లో సర్వ‌సాధార‌ణ ఫీచ‌ర్‌. కానీ, డీఎస్ఎల్ఆర్‌లు, స్మార్ట్‌ఫోన్ కెమెరాల యుగంలోకి ప్ర‌వేశించే క్ర‌మంలో ఈ చిన్న ఫీచ‌ర్ కాస్తా మాయ‌మైంది. అయితే, అదృష్ట‌వ‌శాత్తూ ఇప్పుడు ఎక్స్ఛేంజ‌బుల్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ (EXIF) డేటాలో స‌మ‌యానికి సంబంధించిన స‌మాచారం మొత్తం నిల్వ అవుతోంది. అందువ‌ల్ల ఫోన్‌లోని కెమెరా యాప్‌లో టైమ్‌స్టాంప్‌కు అవ‌కాశం లేనప్ప‌టికీ ఆండ్రాయిడ్ వేదిక‌పై తీసిన ఫొటోల‌కు టైమ్‌స్టాంప్‌ను యాడ్ చేసేందుకు అవ‌కాశం మిగిలే ఉంది. ఇందుకోసం అనుస‌రించ‌ద‌గిన మూడు మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:
స్టాక్ కెమెరా ద్వారా...
ఈ మార్గంలో టైమ్‌స్టాంప్‌ను రెండు విధాలుగా యాడ్ చేయ‌వ‌చ్చు... మ‌నం ఫొటోను క్లిక్ చేసే స‌మ‌యంలోనే యాడ్ చేయ‌డం లేదా విభిన్న కెమెరా యాప్‌ను వినియోగించ‌డం. ఇక మొద‌టి ప‌ద్ధ‌తిలో కెమెరాను ఫ్లిప్ చేయండి. దీంతో ఈ యాప్ నేటివ్ కెమెరాను యాక్సెస్ చేసి, టైమ్‌ను జోడిస్తుంది. ఈ ప్ర‌క్రియ వెంట‌వెంట‌నే పూర్త‌యిపోతుంది కాబ‌ట్టి, దీని బ్యాక్‌గ్రౌండ్ ప్రొసీజ‌ర్ గురించి మ‌న‌కు తెలిసే అవ‌కాశం లేదు. ఇలాంటి ప‌ని చేయ‌గ‌ల సాఫ్ట్‌వేర్‌లు ప్లే స్టో్‌ర్‌లో చాలానే ఉన్న‌ప్ప‌టికీ వాటి ప‌నితీరు ఆధారంగా మీ కోసం మూడింటిని ఎంపిక చేశాం:-
TIMESTAMP CAMERA PHOTOS
ఇది ఉచిత యాప్ ఎంత‌మాత్రం కాదు... అయితే, ఇది స‌ర‌స‌మైన ధ‌ర‌లో ల‌భించ‌డ‌మేగాక ఇందులోనుంచి యాడ్స్ పుట్టుకొచ్చి మ‌న‌ల్ని విసిగించ‌వు. ఈ యాప్‌లో చాలా ర‌కాల స్ట‌యిల్స్‌లో ఫాంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఏదైనా ఫాంట్‌ను ఎంపిక చేసుకునే ముందు కెమెరా ఫోల్డ‌ర్ పాత్‌ను మాన్యువ‌ల్‌గా యాడ్ చేసుకోవాలి. లేక‌పోతే ప్ర‌తి కొత్త ఫొటోపైనా... చివ‌ర‌కు వాట్సాప్‌లో ఫార్వార్డ్ అయిన పిచ్చి బొమ్మ‌కు కూడా  ఈ యాప్ వాట‌ర్‌మార్క్‌ను యాడ్ చేసేస్తుంది. కాబ‌ట్టి పాత్ మార్చడం మంచిది. ఇందుకోసం... ముందుగా ‘‘ఎడ‌మ ప‌క్క‌కు స్వైప్ చేయండి. సెట్టింగ్స్‌ను సెలెక్ట్ చేసుకోండి అందులో కెమెరా ఫోల్డ‌ర్ పాత్‌పై ట్యాప్ చేయండి (మెనూలో ఇది పైనుంచి మూడో ఆప్ష‌న్‌గా క‌నిపిస్తుంది).     కెమెరాను ఓపెన్ చేసి, ఏదో ఒక ఫొటోపై ట్యాప్ చేసి, పాత్‌ను సెట్ చేయండి. ఇదంతా పూర్త‌య్యాక వెన‌క్కు వెళ్లి మీకు న‌చ్చిన టైమ్‌స్టాంప్ స్ట‌యిల్‌ను ఎంపిక చేసుకుని, దాన్ని ఏ వైపు ఉంచాలో’’ నిర్ణ‌యించండి. ఇక ఆ త‌ర్వాత మీరు తీసే ఫొటోల‌కు ఈ యాప్ రెప్ప‌పాటులో టైమ్‌స్టాంప్ వేసేస్తుంద‌న్న మాట‌. అంతేకాదు.. డేట్‌, టైమ్ స్టాంప్‌ను మీరు న‌చ్చిన విధంగా మీరు మార్చుకునే వీలు కూడా ఉంది.
AUTO STAMPER
టైమ్‌స్టాంప్ వేసేందుకు మ‌రొక టూల్ ‘ఆటో స్టాంప‌ర్‌.’ ఇదీ పైన చెప్పిన యాప్‌లాంటిదే అయినా, యూజ‌ర్ ఇంట‌ర్ఫేస్ విష‌యంలో కాస్త ఇబ్బందే. అంతేకాకుండా ఇందులో తెగ‌బోలెడు యాప్స్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూ విసిగించేస్తాయి. అయితే, ఇది ఉచిత యాప్ కాబ‌ట్టి ఆ మాత్రం చిరాకును మ‌నం భ‌రించ‌క త‌ప్ప‌దు. ఆటో స్టాంప‌ర్‌లో ‘డేట్‌-టైమ్‌, లొకేష‌న్‌, సిగ్నేచ‌ర్‌, లోగో’ ఆప్ష‌న్లుంటాయి. వీటిలో ముందుగా మొద‌టి ఆప్ష‌న్‌ను ట్యాప్ చేసి, డేట్‌-టైమ్ ఫార్మాట్‌ను, ఫాంట్ సైజ్‌ను సెలెక్ట్ చేయండి. త‌ర్వాత స్క్రీన్ దిగువ‌న ప్రివ్యూ ఐకాన్ క‌నిపిస్తుంది. అందులోకి వెళ్తే మీ లోగో ఎలా క‌నిపిస్తుందో అది చూపుతుంది. ఇది పూర్త‌య్యాక కెమెరా యాప్‌లోకి వెళ్లి ఫొటోను క్లిక్ చేయండి... వెంట‌నే ఈ యాప్ దానికి టైమ్‌స్టాంప్‌ను జోడిస్తుంది. దీంతోపాటు ఆ విష‌యాన్ని నిర్ధారిస్తూ దిగువ‌న ఓ బుల్లి మెసేజ్‌ని కూడా చూపుతుంది.
గ‌మ‌నికః మీరు బ‌ర్స్ట్ మోడ్‌లో ఫొటో తీసేట్ల‌యితే ఈ యాప్ అనుకున్న‌ట్లుగా ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు.
థ‌ర్డ్ పార్టీ కెమెరా యాప్‌ల వినియోగం
ఇక థర్డ్ పార్టీ కెమెరా యాప్‌ల‌ను వినియోగించ‌డం మ‌రొక మార్గం. అవి ఫొటోలు తీయ‌డ‌మే కాకుండా అదే స‌మ‌యంలో టైమ్‌స్టాంప్ కూడా వేసేస్తాయి. వీటిలో ఒక‌టి ‘Open Camera.’ మీరు ఫొటోగ్ర‌ఫీపై ఆస‌క్తిగ‌ల‌వారైతే ఈ యాప్ గురించి వినే ఉంటారు. ఈ మాన్యువ‌ల్ కెమెరా యాప్‌లో క‌ల‌ర్ ఎఫెక్ట్స్ వంటి చాలా ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి. దీంతో JPEG ఫార్మాట్ నాణ్య‌త‌ను క‌స్ట‌మైజ్ చేసుకునే వీలు కూడా ఉంది. మాన్యువ‌ల్ కంట్రోల్స్‌తోపాటు ఎక్స్‌పోజ‌ర్ కంట్రోల్‌, ISO, వైట్ బ్యాల‌న్స్ వంటివి కూడా ఉన్నాయి.  మాన్యువ‌ల్ ఫొటోగ్ర‌ఫీ గురించి మీకు బాగా తెలిసి ఉంటే ఈ కెమెరాను వాడ‌టం మీకు సులువ‌వుతుంది. ఇక టైమ్‌స్టాంప్ కోసం కుడివైపు ఎగువ‌న క‌నిపించే ప‌ళ్ల చ‌క్రంలాంటి ఐకాన్‌పై క్లిక్‌చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి... అక్క‌డ కెమెరా సెట్టింగ్స్‌పైన ట్యాప్ చేసి, కిందికి స్ర్కోల్ చేస్తూ ‘Stamp photos’ ఆప్ష‌న్ క‌నిపించ‌గానే దాన్ని ఎంపిక చేయండి. ఈ ఓపెన్ కెమెరా యాప్‌లో మీరు ఫాంట్ క‌ల‌ర్‌, సైజ్‌ను మీకు కావాల్సిన‌ట్లు మార్చుకోవ‌చ్చు. ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే... ఇందులో యాడ్స్‌గానీ, అన‌వ‌స‌ర‌మైన పాప‌ప్స్‌గానీ క‌నిపించ‌వు.
CAMERA TIMESTAMP
మాన్యువ‌ల్‌గా ఫోటోలు తీయ‌డం మీకు అల‌వాటు లేన‌ట్ల‌యితే మీరు ‘Camera Timestamp’ యాప్‌ను వాడుకోవ‌చ్చు. ఇందులో exposure setting, color effects, timer వంటి ప్రాథ‌మిక కెమెరా సెట్టింగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ యాప్‌లో అనేక టైమ్‌స్టాంప్ ఫార్మాట్లు ఉన్నందువ‌ల్ల మీరు వాటితో చాలా ప్ర‌యోగాలు కూడా చేయొచ్చు. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాక మీరు చేయాల్సింద‌ల్లా... కొన్ని ఫొటోల‌ను క్లిక్ చేయ‌డ‌మే... వాటికి ఈ యాప్ ఆటోమేటిక్‌గా టైమ్‌స్టాంప్ వేసేస్తుంద‌న్న మాట‌. కానీ, ఇందులో ఒక అసౌక‌ర్యం కూడా ఉందండోయ్‌... అదేమిటంటే మీ ఫోన్‌లోని బిల్టిన్ కెమెరా యాప్ ఫీచర్ల‌ను కోల్పోవాల్సివ‌స్తుంది.
PHOTOSTAMP CAMERA
ఇది కూడా దాదాపు పైన చెప్పిన యాప్‌లాంటిదే. దీనికి త‌న సొంత కెమెరా ఇంట‌ర్ఫేస్ ఉంటుంది. అయితే, కెమెరా టైమ్‌స్టాంప్ యాప్‌తో పోలిస్తే ఇందులో ముఖ్య‌మైన అంశం డేట్‌-టైమ్‌, లొకేష‌న్‌, సిగ్నేచ‌ర్‌ల‌ను మీరు ఇష్టం వ‌చ్చిన చోట ముద్రించ‌వ‌చ్చు. అంతేకాకుండా స‌ద‌రు స్టాంప్ సైజ్‌, క‌ల‌ర్‌ను కూడా మోడిఫై చేసుకోవ‌చ్చు. అయితే, ఇందులో యాడ్స్ చికాకు ఎక్కువే కాబ‌ట్టి మీకు కాస్త ఓర్పు అధికంగా ఉండాలంతే!
INSTAGRAM
అవును... నిజ‌మే! ఇన్‌స్టాగ్రామ్ కూడా మీ ఫొటోల‌పై చిటికలో టైమ్‌స్టాంప్ వేయ‌గ‌ల‌దు. అలాగే ఇందుకోసం మీరు ఎలాంటి యాప్‌నూ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన ప‌నిగానీ, డ‌బ్బు చెల్లించే అవ‌స‌రంగానీ లేవు. ఇందులోని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఫీచ‌ర్‌లో ఇది దాగిఉంది. మీరు 24 గంట‌లక‌న్నా ముందు తీసిన ఫొటోలను యాడ్ చేస్తే ఇది త‌న‌దైన టైమ్‌స్టాంప్ వేస్తుంది. పైగా మీ స్టోరీస్‌కు త‌గిన విభిన్న సైజుల ఫొటోల‌తోపాటు టైమ్ స‌మాచారాన్ని కూడా అటు లాండ్‌స్కేప్‌, ఇటు పోర్ట్రెయిట్ ఫొటోల‌పైనా జ‌త‌చేయొచ్చు. మీరు యాడ్ చేసిన ఫొటోపై ఇన్‌స్టాగ్రామ్ టైమ్‌స్టాంప్ వేస్తుంది. దీంతోపాటు ఆ ఫొటోను మీకు కావాల్సిన చోట పెట్ట‌డానికీ వీలుంటుంది. అలాగే క‌ల‌ర్స్ మార్చ‌డానికి change colorsపై ట్యాప్ చేస్తే ఆ ప‌ని పూర్తిచేసుకోవ‌చ్చు.అటుపైన Saveపై క్లిక్ చేస్తే ఆ ఫొటో మీ ఫొటో గ్యాల‌రీలో కూడా సేవ్ అవుతుంది.

జన రంజకమైన వార్తలు