ప్రస్తుతం ముఖ్యమైన ఫైల్స్ స్మార్ట్‌ఫోన్లోనే భద్రంగా దాచుకునేందుకు గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, బాక్స్, మెగా, వన్ డ్రైవ్ వంటి రకరకాల క్లౌడ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోసారి ఏ ఫైల్ ఏ సర్వీస్‌లో సేవ్ చేశాయో గుర్తుండదు. ఇటువంటి సమయంలో అన్ని క్లౌడ్ స్టోరేజ్‌లలోనూ వెతుక్కోక తప్పదు. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. మరి అటువంటి సమయంలో ఉపయోగపడే కొన్ని ఉచిత వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ క్లౌడ్ స్టోరేజ్‌లో ఉన్న ఫైల్‌నైనా కీవర్డ్ లేదా ఫైల్ నేమ్ సాయంతో ఒకేసారి అన్ని స్టోరేజీల్లోనూ సులువుగా వెతికిపెడతాయి.
MultCloud
క్లౌడ్ సర్వీసెస్లో ఫైల్‌ని వెతికేందుకు ఇది మంచి వెబ్‌సైట్. వివిధ రకాల క్లౌడ్ సర్వీసెస్‌ని ఇది సపోర్ట్ చేస్తుంది. వీటితో సులువుగా కనెక్ట్ అయి.. ఫైల్‌ని గుర్తించవచ్చు. ఎన్ని ఫైల్స్ అయినా ఇందులో వెతికవచ్చు.
ఎలా వెతకాలంటే..
* MultCloud వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి. పైన కనిపించే Add Cloud బటన్ మీద క్లిక్ చేయాలి. ఇందులో రకరకాల క్లౌడ్ సర్వీసులు ఉంటాయి. వీటిలో అకౌంట్‌కి కనెక్ట్ అయిన సర్వీసెస్‌ని సెలక్ట్ చేసుకోవాలి.
* ఎడమ వైపు select any cloud service ఆప్షన్‌ని ఎంచుకుంటే.. Search ఆప్షన్ వస్తుంది. ఇందులో క్విక్ సెర్చ్‌ని ఎంచుకోవాలి. తర్వాత ఏ క్లౌడ్‌లో ఫైల్‌ని వెతకాలనుకుంటున్నాయో వాటిని ఎంచుకోవాలి.
* Keyword ఆప్షన్‌లో ఫైల్ నేమ్ లేదా ఫైల్‌కి సంబంధించిన ముఖ్యమైన పదం ఇచ్చి.. Search క్లిక్ చేయాలి. వివిధ క్లౌడ్ సర్వీసెస్లో ఫైల్‌ని వెతికి.. ఏ సర్వీస్‌లో ఉందో అవన్నీ చూపిస్తుంది.
Findo
ఒకేసారి వివిధ రకాలైన క్లౌడ్ సర్వీసెస్లో ఫైల్‌ని వెతికేందుకు ఈ వెబ్‌సైట్ కూడా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా ఎన్ని ఫైల్స్ అయినా ఒకేసారి వెతకవచ్చు. అదెలానో చూద్దాం!
* Findo వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి. ఇందులో Add New Data Source ఆప్షన్‌ని ఎంచుకోవాలి. అకౌంట్‌కి కనెక్ట్ అయిన క్లౌడ్ సర్వీసెస్‌ని సెలక్ట్ చేయాలి.
* తర్వాత ఎడమ వైపు కనిపించే ప్యానల్‌లో All Sources అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి.. పైన కనిపించే సెర్చ్ బార్‌లో ఫైల్ పేరు లేదా కీవర్డ్‌ని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి.
* మొత్తం క్లౌడ్ సర్వీసెస్‌లన్నింటిలో ఎంటర్ చేసిన ఫైల్‌నేమ్, కీవర్డ్ ఉన్న ఫైల్స్ అన్నింటినీ వెతికి స్క్రీన్‌పై చూపుతుంది. అంతేగాక ఆ ఫైల్‌ను ఎప్పుడు ఉపయోగించామో తెలిపే ఆప్షన్‌తో పాటు వివిధ రకాల ఫార్మాట్ ప్రకారం ఫలితాలను ఫిల్టర్ చేసే అవకాశం ఉంది.
Otixo
ఈ వెబ్‌సైట్ కూడా ఫైల్‌ని వెతికేందుకు ఉపయోగపడినా.. కేవలం 10 క్లౌడ్ సర్వీసెస్ వరకూ మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
* Otixo వెబ్‌సైట్‌ని ముందుగా ఓపెన్ చేసి Add Cloud Drive సెలక్ట్ చేసుకుని క్లౌడ్ సర్వీసెస్‌ని ఎంచుకోవాలి.
* తర్వాత ఫైల్‌నేమ్ లేదా కీవర్డ్‌ని సెర్చ్‌బాక్స్‌లో ఎంటర్ చేయాలి.
* పక్కనే ఉన్న డ్రాప్ డౌన్ మెనూలో ఇమేజ్, వీడియో, ఆడియో, డాక్యుమెంట్ ఆప్షన్లు ఉంటాయి. ఇందులో మనం వెతకాలనుకునే ఫైల్ టైప్‌ని సెలెక్ట్ చేసుకుని సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి.
* ఇందులో.. ముందు సెలెక్ట్ చేసుకున్న సర్వీస్‌లో మాత్రమే ఇది సెర్చ్ చేసేలా ఆప్షన్ ఉంటుంది. Can’t find it? Search all Cloud Drives ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకుంటే అన్నింట్లో ఫైల్ వెతికి రిజల్ట్స్ స్క్రీన్‌పై చూపుతుంది.
Koofr
* ముందుగా Koofr వెబ్‌సైట్ ఓపెన్ చేసి Connect ఆప్షన్ ద్వారా క్లౌడ్ సర్వీసెస్‌ని ఎంచుకోవాలి.
* ఎడమవైపు ప్యానల్‌లో కనిపించే సెర్చ్ బార్‌లో.. ఫైల్ పేరు క్లిక్ చేయాలి.
* పక్కనే ఉండే యరో మీద క్లిక్ చేస్తే.. ఫైల్స్, ఫోల్డర్, ఇమేజ్, ఆడియో, డాక్యుమెంట్.. ఇలా వివిధ ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో మనం ఏ రకం ఫైల్‌ని వెతకాలని అనుకుంటున్నామో సెలక్ట్ చేసుకోవాలి.
* మొత్తం అన్ని కనెక్టెడ్ సర్వీసెస్‌లో ఫైల్‌ని వెతకాలనుకుంటే.. Any Location క్లిక్ చేసి.. తర్వాత Search ఎంచుకోవాలి.
* ఇది మొత్తం క్లౌడ్ సర్వీసులన్నింటినీ స్కాన్ చేసి.. మనం ఇచ్చిన పేరుతో పాటు.. ఆ పదంతో సరిపోయే ఇతర ఫైల్స్‌ని వాటి సైజ్, తేదీతో పాటు స్క్రీన్‌పై చూపుతుంది.
FYI
ఇది కూడా అన్ని క్లౌడ్ సర్వీసెస్‌ని సపోర్ట్ చేస్తుంది. ఈ వెబ్‌సైట్ ఫ్రీ వెర్షన్‌లో ఐదు క్లౌడ్ సర్వీసెస్‌లో మత్రమే సపోర్ట్ చేస్తుంది. 30 రోజుల క్రితం క్రియేట్ చేసిన ఫైల్స్‌ని సెర్చ్ చేస్తుంది.
* ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేశాక.. లాగిన్ అవ్వాలి. Add Apps బటన్ ద్వారా క్లౌడ్ అకౌంట్స్‌ని యాడ్ చేసుకోవాలి. * ఇందులో సెర్చ్ బాక్స్‌లో ఫైల్ నేమ్ లేదా కీవర్డ్‌ని ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేయాలి. మొత్తం ఫైల్స్‌ని సెర్చ్ చేస్తుంది.
* ఇచ్చిన ఫైల్‌నేమ్‌కు సరిపోయే ఫైల్స్‌తో పాటు ఒకవేళ ఒకే ఫైల్ వేర్వేరు సర్వీసెస్‌లో ఉన్నా.. వాటన్నింటినీ స్క్రీన్‌పై చూపుతుంది.