టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)గత రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టీవీ ఛానెళ్ల ప్రసారాలు, ధరలు, ప్యాకేజీల విషయంలో ట్రాయ్ కొత్త రూల్స్ ని తీసుకువచ్చింది. ఈ నియమనిబంధనలపై ఇప్పుడు తీవ్రస్థాయిలోనే చర్చ జరుగుతోంది. కస్టమర్లు తాము చూడాలనుకున్న ఛానెల్స్ మాత్రమే ఎంచుకొని వాటికి డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించామని ట్రాయ్ చెబుతుంటే... ఛానెల్స్ వేర్వేరుగా ఎంచుకుంటే బిల్లు మొత్తం తడిసి మోపెడవుతోందని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ట్రాయ్ కొత్త నిబంధనలతో కేబుల్ బిల్ ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం.
ట్రాయ్ నిబంధనల ప్రకారం 100 ఎస్‌డీ ఛానెళ్ల బేస్ ప్యాక్ రూ.130. దానికి జీఎస్‌టీ అదనంగా ఉంటుంది. జీఎస్టీతో కలిపి కేవలం రూ.153 చెల్లించి 100 ఉచిత ఛానెళ్లు చూసే వెసులుబాటు ఉంది. అయితే పే ఛానెల్స్ చూడాలంటే మాత్రం అదనంగా చెల్లించాల్సిందే. ఇందుకోసం ప్యాకేజీలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 535 ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్, 330 పే ఛానెల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలోంచి ఛానెళ్లను ఎంచుకోవచ్చు. ఎయిర్‌టెల్, టాటాస్కై రూ.99 నుంచే బేస్ ప్యాక్స్ ఆఫర్ చేస్తున్నాయి.
పే ఛానెళ్లకు ఎంత ఛార్జ్ చేస్తారో ట్రాయ్ తన వెబ్‌సైట్‌లో జాబితాను ఉంచింది. ఆ జాబితా చూడాలంటే https://main.trai.gov.in/sites/default/files/PayChannels18122018_0.pdf ఈ లింక్ ద్వారా చూడవచ్చు. పే ఛానెళ్ల ధరల్ని బట్టి మీరు కోరుకునే ఛానెళ్లకు ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసుకోవచ్చు. దీంతో పాటుగా ఛానెల్ సెలెక్టర్ అప్లికేషన్‌ను కూడా ట్రాయ్ రూపొందించింది. https://channel.trai.gov.in/index.html ఇందులో మీరు చూడగలరు. ప్రాధాన్యతను బట్టి ఛానెళ్లను ఎంచుకోవాలి. మీరు ఎంచుకునే ఛానెళ్లకు మొత్తం ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు.
అయితే బేస్ ప్యాకేజీలో ఫ్రీ ఛానెళ్లు, పే ఛానెళ్లు మొత్తం కలిపి 100 దాటకూడదు. 100 దాటికే ప్రతీ 25 అదనపు ఛానెళ్లకు రూ.20 చెల్లించాలి. అంటే మీరు రూ.150+జీఎస్టీ చెల్లిస్తే 125 ఛానెళ్లను ఎంచుకోవచ్చు. ఒకవేళ మీరు మీ కేబుల్ ఆపరేటర్ లేదా డీటీహెచ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర గతంలోనే వార్షిక ప్యాకేజీ తీసుకున్నట్టయితే మీ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు.