• తాజా వార్తలు

E SIM ద్వారా మొబైల్ నంబర్ పోర్టబులిటీ కి సింపుల్ గైడ్  

మొబైల్ నంబర్ పోర్టబులిటీ సదుపాయం వచ్చాక... అదే నంబర్ వాడుతూ సర్వీస్ అందించే నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను మార్చుకునే వీలు కలుగుతోంది. తాజాగా ఈ ప్రక్రియ మరింత తేలిక అయ్యింది. ఈ సిమ్ రావడంతో మున్ముందు మొబైల్ ఫోన్ వినియోగదారులకు పోర్టబులిటీ మరింత సులభం కానుంది. ఎవరికైనా తాము వినియోగిస్తున్న టెలికం ఆపరేటింగ్ సర్వీస్ నచ్చకపోతే మరో టెలికం ఆపరేటింగ్ సర్వీస్‌లోకి మారడమే పోర్టబులిటీ. త్వరలో రానున్న eSIMతో తమకు నచ్చిన టెలికం ఆపరేటర్‌కు సులభంగా మారిపోయే అవకాశం అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం ఓ సిమ్ వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ యూజర్లు.. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (MNP) ద్వారా తమ నెంబర్‌ను మార్చుకోకుండానే మరో టెలికం ఆపరేటర్‌కు మారవచ్చు. దీనికి కొద్ది రోజుల సమయం పడుతుంది. ఇందుకు కనీసం వారం లేదా పది పదిహేను రోజుల సమయం పడుతుంది. ఆపరేటర్ మార్పుకు అభ్యర్థన చేసుకున్న తర్వాత ఆ ఆపరేటర్‌కు చెందిన స్టోర్లకు వెళ్లి సిమ్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో యాక్టివేషన్‌కు కొంత సమయం తీసుకుంటుంది. అయితే ఇదంతా అవసరం లేకుండా వేగవంతంగా తమకు నచ్చిన ఆపరేటర్‌కు మారేందుకు eSIM ఉపయోగపడుతుంది.

eSIM ఒక డిజిటల్ సిమ్ కార్డు. ఇది మొబైల్ ఫోన్‌తోనే వస్తుంది. దీనిని మొబైల్ నుంచి బయటకు తీయవలసిన అవసరం లేదు. ఫిజికల్ సిమ్ లేకుండానే eSIMతోనే మొబైల్ టారిఫ్ ప్లాన్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. నెంబర్ మార్చకుండానే పోర్టబులిటీ ద్వారా మరో టెలికం ఆపరేటర్‌కు మారే వెసులుబాటు ఉంది. ఇప్పుడు eSIMతో ఇది మరింత సులభం కానుంది. eSIMలను ఎక్కువగా ఐవోటీ, మెషిన్ 2 మెషిన్ సొల్యూషన్స్‌కు వినియోగిస్తారు.

eSIMతో కలిసి పని చేసేందుకు వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్ సిద్ధమని ప్రకటించాయి. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కంపెనీలు eSIM ఎనేబుల్డ్ యాపిల్ వాచీలను విక్రయించేందుకు ఇప్పటికే యాపిల్‌తో లింకప్ అయ్యాయి. హైఎండ్ ఫోన్లలోనే eSIM సదుపాయం ఉంటుంది. కాబట్టి వినియోగం ఎక్కువగా లేదు. ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఎక్స్ఎస్ మాక్స్, గూగుల్ పిక్సెల్ 3 వంటి ఫోన్లు eSIM లను సపోర్ట్ చేస్తున్నాయి. మనదేశంలో eSIM కార్డులు ఒక శాతం కంటే తక్కువ. అయితే రానున్న ఆరేళ్లలో అంటే 2025 నాటికి 25 శాతానికి పెరుగుతుందని అంచనా. గత ఏడాది (2018) ప్రపంచ మార్కెట్లో eSIM పరిమాణం 253.8 మిలియన్ డాలర్లుగా ఉంటే రానున్న నాలుగేళ్లలో అంటే 2023 నాటికి 978.3 మిలియన్ డాలర్లకుగా ఉండవచ్చునని అంచనా.

జన రంజకమైన వార్తలు