• తాజా వార్తలు

మొబైల్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, పూర్తి గైడ్ మీకోసం 

మొబైల్ మన నుంచి చేజారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ముఖ్య సమాచారాన్ని కోల్పోవడమే కాకుండా పాస్‌వర్డ్‌లు వంటి వాటిపట్ల ఆందోళన మొదలై చివరకు డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎంతో ఖర్చు పెట్టిన మొబైల్ పోయిన సందర్భంలో ఆ ఫోన్ కొన్న మొత్తంలో చేతికి కొంత మొత్తం వస్తే చాలా సంతోషపడతాము. మరి అలా అమౌంట్ వచ్చే అవకాశం ఉందా.. దీనికి సమాధానమే మొబైల్‌ ఇన్సూరెన్స్‌ బీమా వర్తింపు, క్లెయిం లాంటి విషయాలు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ శీర్షికలో చర్చించుకుందాం.

అగ్ని ప్రమాదాలు, అల్లర్లు, ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు, ఫోన్ దొంగతనానికి గురైనప్పుడు, నీళ్లలో పడి మొబైల్‌ పాడైనప్పుడు మరికొన్ని సందర్భాల్లో మాత్రమే బీమాను వర్తింపజేస్తుంది. అనుమానాస్పద స్థితిలో,దేశం వెలుపల మొబైల్‌ పోగొట్టుకున్నప్పుడు, మరో వ్యక్తి ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్‌ పాడైనా లేదా పోయినా, అధీకృత సంస్థల వద్ద కాకుండా వేరే ఎక్కడైనా మరమ్మతు చేయించినప్పుడు, అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన సమయంలో జరిగే నష్టానికి బీమా వర్తింపు ఉండదు.

మొబైల్‌ కొన్న ఒకటి, రెండు రోజుల్లోపే బీమా తీసుకోవాలి. బీమా తీసుకునేందుకు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాథమిక సమాచారాన్ని పూరించాల్సి ఉంటుంది.తర్వాత బీమా కంపెనీలు మొబైల్‌ కొనుగోలు బిల్లు, వ్యక్తిగత గుర్తింపు పత్రం లాంటి వివరాలను పోస్ట్‌లో పంపాల్సిందిగా కోరతాయి. కొన్ని కంపెనీలు వాట్సప్‌లో డాక్యుమెంట్ల ఫోటోలు తీసి పంపేందుకు అవకాశమిస్తున్నాయి.

క్లెయిం ఫారం, మొబైల్‌ కొనుగోలు బిల్లు, క్లెయిం వివరాలను తెలియపరిచేందుకు అక్‌నాలెడ్జ్‌మెంట్, మొబైల్‌ దొంగతనానికి సంబంధించి స్థానిక పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు కాపీ, లెటర్‌ ఆఫ్‌ ఇండెమ్నిటీ, బీమా కంపెనీ అడిగిన విధంగా మొబైల్‌ గుర్తించబడలేదని నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. క్లెయిం ఫారం,మొబైల్‌ కొనుగోలు బిల్లు,క్లెయిం వివరాలను తెలియపరిచేందుకు అక్‌నాలెడ్జ్‌మెంట్‌, ప్రమాదానికి గురైన ఫోన్‌ స్క్రీన్‌ ఫోటోతో పాటు ఐఎమ్‌ఈఐ నంబరుతో కూడిన ఫోటో, అధీకృత సేవా కేంద్రం అందించే మరమ్మతు ఖర్చుల అంచనా పత్రం / రీప్లేస్‌మెంట్‌ బిల్లు లేదా నష్టపోయినట్లు ఇచ్చే సర్టిఫికెట్‌తో పాటు బిల్లు, మరమ్మతు/ రీప్లేస్‌మెంట్‌కు సంబంధించిన బిల్లు, క్లెయిం సొమ్ముకు సంబంధించిన సర్వే నివేదికలు అవసరమవుతాయి.

మొబైల్‌ ఫోన్‌ పోయినట్లుగా గుర్తించిన వెంటనే 24 గంటల్లోగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్నప్పుడు 48 గంటల్లోగా బీమా కంపెనీకి సమాచారం అందించాలి. క్లెయిం పొందేందుకు బీమా కంపెనీ సూచించిన విధంగా పాటించాలి. ప్రీమియం: రూ. 5000 కన్నా తక్కువ ఖరీదు కలిగిన మొబైల్‌ ఫోన్లకు రూ. 299 నుంచి రూ. 600 వరకూ, రూ. 5000 నుంచి రూ. 15000 లోపు వాటికి రూ. 500 నుంచి రూ. 1300 వరకూ ప్రీమియం ఉంటుంది.రూ. 15000 నుంచి రూ. 25000 లోపు వాటికి రూ. 1200 నుంచి రూ. 2000 వరకూ ప్రీమియం ఉంటుంది. ఇంకా ఖరీదైన ఫోన్లకు పాలసీ వర్తింపును బట్టి రూ. 2000 నుంచి రూ. 5000 వరకూ ప్రీమియం ఉంటుంది.
 

జన రంజకమైన వార్తలు