యాపిల్.. టెక్నాలజీతో పరిచయమున్న ప్రతి వ్యక్తి ఆ కంపెనీ ప్రొడక్ట్ ఒక్కసారైనా వాడాలని కోరుకుంటాడు. యాపిల్ కంప్యూటర్, మ్యాక్, ఐపోడ్, ఐ ప్యాడ్, ఐ ఫోన్, యాపిల్ వాచ్ ఇలా ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ప్రపంచంలోనే ఐకాన్‌గా నిలిచిన యాపిల్ 40 ఏళ్ల క్రితం ఓ సాదాసీదా కంపెనీ. స్టీవ్ జాబ్స్ ఆయన సహచరులు కలిసి స్థాపించిన ఈ సంస్థ మొదట కంప్యూటర్లే తయారు చేసేది. ఆలా 40 ఏళ్ల క్రితం యాపిల్ తయారు చేసిన మొదటి కంప్యూటర్ వేలానికి వచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి దాన్ని ఏకంగా 3,65,000 డాలర్లు (దాదాపు 2కోట్ల 30 లక్షల రూపాయల)కు సొంతం చేసుకున్నాడు.
66లో మిగిలింది ఈ ఒక్కటే
1976లో యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్ కలిసి అసెంబుల్డ్ మదర్‌బోర్డులతో 66 కంప్యూటర్లు తయారు చేశారు. వీటిలో మిగిలింది ఇదొక్కటే. దీనికి యాపిల్ 1 అని పేరు పెట్టారు. అప్పట్లో దీని ధర 666.66 డాలర్లు. ఇప్పుడు క్రిస్టీ ఆక్షన్ హౌస్‌లో వేలంలో 3 లక్షల 55వేల డాలర్ల ధర పలికింది. ప్రీ అసెంబుల్డ్ మదర్ బోర్డుతో వచ్చిన తొలి కంప్యూటర్ ఇదే కావడం విశేషం.