• తాజా వార్తలు

గూగుల్ వ‌ర్సెస్ ఈయూ- ఒక సామాన్య ఆండ్రాయిడ్ యూజ‌ర్ తెలుసుకోవాల్సిన విషయాలేంటి?

టెక్నాల‌జీ దిగ్గ‌జం గూగుల్‌కు ఏకంగా 35వేల కోట్ల రూపాయ‌ల జ‌రిమానా విధిస్తూ యూరోపియ‌న్ యూనియ‌న్‌కు చెందిన కాంపిటిషన్‌ కమిషన్ తీర్పు చెప్ప‌డం ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.  తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) కున్న మార్కెట్‌ వాటాను ఉపయోగించుకుని పోటీ చట్టాలకు వ్యతిరేకంగా గూగుల్‌ లబ్ధి పొందింద‌న్న ఆరోప‌ణ‌ల మీద ఈయూ విచార‌ణ జ‌రిపి ఈ జ‌రిమానా విధించింది. 
 

శాంసంగ్‌, హువావేల‌కు ఎర‌వేసింది
గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌, సెర్చ్‌ ఇంజిన్‌లను ప్రీ-ఇన్‌స్టాల్ చేస్తే కొన్ని గూగుల్ యాప్స్‌ను ఉచితంగా ఇస్తామ‌ని చెప్పి శాంసంగ్‌, హువావే వంటి ప్రధాన మొబైల్‌ తయారీ కంపెనీలన్నిటినీ గూగుల్‌ ఒప్పించింది. అలాగే  గూగుల్‌ సెర్చ్‌ను డిఫాల్ట్‌గానూ పెట్టేలా చూసుకుంది. ఇలా ఐరోపాలోని వివిధ దేశాల్లో విక్ర‌యించే ఆండ్రాయిడ్ ఫోన్ల‌న్నింటిలోనూ దాదాపుగా ఇలాగే చేసింద‌ని ఈయూ ఆరోపించింది. అంతేకాదు ఇత‌ర ఓఎస్‌లు వేటినీ స్మార్ట్‌ఫోన్లు వాడ‌కుండా ఫోన్ త‌యారీ కంపెనీల‌కు ఆర్థిక ప్రోత్సాహ‌కాల పేరిట లంచాలిస్తుందని కూడా ఆరోప‌ణ‌లున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ తయారీదార్లకు గూగుల్‌ తన ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను ఉచితంగా ఇస్తోంది. సెర్చ్‌ ఫలితాలతో పాటు వచ్చే వ్యాపార ప్రకటనలు విక్రయించి వేల కోట్ల రూపాయ‌ల ఆదాయం సంపాదిస్తోంద‌ని ఈయూ పేర్కొంది. వీటిమీద మూడేళ్ల‌పాటు విచారించి బుధ‌వారం 35వేల కోట్ల రూపాయ‌ల జరిమానా విధించింది.  మూడు నెల‌ల్లోగా ఈ ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే మ‌రింత జ‌రిమానా ప‌డుతుందని కూడా హెచ్చ‌రించింది. ఈ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తామ‌ని గూగుల్ చెబుతోంది.

ఇప్పుడేం జ‌రగ‌బోతోంది?

* గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా 200 కోట్ల మంది వాడుతున్నారు. వారిపై ఈ నిర్ణ‌యం ప్ర‌భావం ఎలా ఉంటుంద‌న్న‌ది అప్పుడే చెప్ప‌లేం.

* ఈయూ విధించిన జ‌రిమానాను స‌వాల్ చేస్తామ‌ని గూగుల్ ప్ర‌క‌టించింది. ఈ తీర్పు కూడా గూగుల్‌కు వ్య‌తిరేకంగా క‌నుక వ‌స్తే మాత్రం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారీ మార్పులే చూడొచ్చు. ఎందుకంటే యూరోపియ‌న్ యూనియ‌న్‌లోని దేశాల్లో ఆండ్రాయిడ్ ఫోన్ కొన్న‌వారు త‌మ‌కు న‌చ్చిన ఓఎస్‌ను వాడుకునే అవకాశం ఉంటుంది. గూగుల్‌తోపాటు పోటీదారులంతా  బ‌హిరంగ పోటీలో నిల‌బ‌డ‌గ‌లుగుతారు.

* ఇప్ప‌టికే గూగుల్ ఆండ్రాయిడ్ వినియోగ‌దారుల‌ను త‌మ సెర్చ్ ఇంజిన్ సెట్టింగ్‌లు మార్చుకోవాల‌ని కోరింద‌ని, అయితే ఇప్ప‌టికీ 95 శాతం మంది ఆండ్రాయిడ్ వినియోగ‌దారులు గూగుల్ సెర్చ్‌నే వాడుతున్నార‌ని ఈయూ చెప్పింది. అన్ని కోట్ల మంది వాడుతున్నందున ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం భారీగా వ‌స్తుంది.  గూగుల్ బ్రౌజర్ వంటి వాటిని ప్రీ ఇన్‌స్టాల్ చేసి ఇస్తున్నందున ఆండ్రాయిడ్ ఓఎస్‌కు కంపెనీల నుంచి డ‌బ్బులు తీసుకోవ‌డం లేదు. అదే రేపు ఈ నిర్ణ‌యాన్ని క‌చ్చితంగా అమ‌లు చేయాల్సి వ‌స్తే గూగుల్ త‌న సెర్చ్ ఇంజిన్‌ను డీఫాల్ట్‌గా పెట్టుకోమ‌ని ఫోన్ల త‌యారీ కంపెనీల‌ను కోర‌లేదు. అప్పుడు కంపెనీలు ఓఎస్ కోసం గూగుల్‌కు డ‌బ్బు చెల్లించాలి. అంటే  ఆండ్రాయిడ్ ఫోన్ల ధర పెరిగే అవ‌కాశం ఉంటుంది.

* గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో లేక‌పోతే గూగుల్‌కు ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం త‌గ్గిపోతుంది. అప్పుడు ఆండ్రాయిడ్ యాప్స్‌ను కూడా ఇప్ప‌టిలా ప్లే స్టోర్లో ఫ్రీగా ఉంచ‌దు. వాటికి కూడా డ‌బ్బులు వ‌సూలు చేసే అవ‌కాశం (పెయిడ్ యాప్స్‌) ఉంటుంది.

జన రంజకమైన వార్తలు