• తాజా వార్తలు

చైనాలో ఆపిల్ బ్యాన్ చేయాలంటూ ఉద్యమం

అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది.  చైనా మొబైల్ మేకర్ హువాయిను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టడంతో డ్రాగన్ కంట్రీ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికాపై చైనా యువత ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. అమెరికాలో హువాయి ఉత్పత్తులను నిషేధించినందుకు ప్రతీకారంగా చైనాలో ఆపిల్ ప్రొడక్టులపై నిషేధం విధించాలని డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఇందులో భాగంగానే చైనా సోషల్ మీడియా వేదికగా యూజర్లు టెక్నాలజీ యుద్ధానికి నాంది పలికారు. 

అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్న తరుణంలో ట్రంప్ ప్రభుత్వం డ్రాగన్ దేశ ప్రొడక్టులపై తాత్కాలిక నిషేధం విధించడంతో టెక్నాలజీ యుద్ధానికి దారి తీసింది. ఈ క్రమంలో అమెరికా మల్టినేషనల్ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ కు చైనా భారీ షాక్ ఇచ్చింది. చైనా సోషల్ మీడియాల్లో ఆపిల్ యాప్స్ ను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఆపిల్ యాంటీ’ ఉద్యమం మొదలైంది.  

చైనా ఉత్పత్తులను అమెరికాలో నిషేధం విధిస్తే.. చైనాలో కూడా ఆపిల్ ఉత్పత్తులను కూడా బైకాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున యువత డిమాండ్ చేస్తోంది. కాగా అమెరికా సంస్థలతో హువాయి వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి 90 రోజుల వరకు అనుమతి ఇస్తూ తాత్కాలిక నిషేధం విధించింది. ఈ క్రమంలో ఆల్ఫాబెట్ ఇంక్ దిగ్గజం గూగుల్.. కూడా హువావే ఆండ్రాయిడ్ లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

తమ దేశ బ్రాండ్ ఉత్పత్తులపై అమెరికా నిషేధం విధించడాన్ని చైనా సోషల్ మీడియా యూజర్లు తప్పుబట్టారు. హువాయికు మద్దతుగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. సోషల్ మీడియా సైట్ వైబోలో యాంటీ ఆపిల్ వార్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఇప్పటివరకూ ఆపిల్ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపామని, కానీ, ఇప్పటి నుంచి చైనాలో హువాయి ఫోన్లను మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. 

మరోవైపు.. చైనా, అమెరికాల మధ్య ట్రేడ్ వార్ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించే దిశగా బీజింగ్ అడుగులు వేస్తోంది. వాషింగ్టన్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సిగ్నల్స్ అందిస్తోంది. ట్రేడ్ వార్ వివాదానికి తెర దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు అమెరికాలో చైనా అంబాసిడర్ చుయ్ టియాంకీ తెలిపారు. వచ్చే నెల జూన్ లో G20 అంతర్జాతీయ సదస్సులో అమెరికా, చైనా నేతల మధ్య మరోసారి ట్రేడ్ వార్ పై చర్చించే అవకాశం ఉంది.    

జన రంజకమైన వార్తలు