• తాజా వార్తలు

ఈ వారం టెక్ రౌండ‌ప్‌

టెక్నాల‌జీ రంగంలో ఈ వారం జ‌రిగిన అంశాల‌తో లేటెస్ట్ అప్‌డేట్స్ అందించే ఈ వారం టెక్ రౌండ‌ప్ మీ ముందుకు వ‌చ్చేసింది. వాలెట్ల నుంచి బ్యాంక్ అకౌంట్ల వ‌ర‌కు, వెబ్‌సైట్ల నుంచి గ‌వ‌ర్న‌మెంట్  సైట్ల వ‌ర‌కు టెక్నాలజీ సెక్టార్‌లో ఈ వారం చోటు చేసుకున్న కొత్త మార్పుల్లో కీల‌క విష‌యాలు మీకోసం..

రౌండ‌ప్‌తో లాభం ఎంతో చెప్ప‌ని రైల్వేశాఖ‌
2013 ఫిబ్ర‌వ‌రిలో రైల్వేశాఖ వార్షిక బ‌డ్జెట్‌కి ముందు  ఓ చిన్న స‌ర్క్యుల‌ర్ రిలీజ్ చేసింది. దాని ప్ర‌కారం టికెట్ ఫేర్ ద‌గ్గ‌ర‌లో ఉన్న 5రూపాయ‌ల‌కు రౌండ‌ప్ చేయ‌బడుతుంది. అంటే 122 రూపాయ‌లు ఉంటే 125, 127 ఉంటే 130 ఇలా రౌండింగ్ అప్ చేస్తారు. అంటే ఇలాంటి టికెట్‌మీద రైల్వేకు బాగానే గిట్టుబాటవుతుంది. అలా 2013 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఇలా రౌండ‌ప్ చేయ‌డం వ‌ల్ల ఎంత అద‌న‌పు ఆదాయం వ‌చ్చిందో మాత్రం రైల్వేశాఖ ఎక్క‌డా బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. ఇంకో విష‌యం ఏమిటంటే ఈ రౌండింగ్ అప్‌లో టికెట్ రేట్ పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు 71 రూపాయ‌లు ఉంటే దాన్ని 70కి త‌గ్గించ‌రు. నాలుగు రూపాయ‌లు పెంచి 75 చేస్తారు. 

రాడిసిస్‌తో రిల‌య‌న్స్ జ‌ట్టు
యూఎస్ బేస్డ్ఓపెన్ టెలికం సొల్యూష‌న్స్ ప్రొవైడ‌ర్ రాడిసిస్ కార్పొరేష‌న్‌తో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ విలువ 74 మిలియ‌న్ డాల‌ర్లు (దాదాపు 5,185 కోట్ల రూపాయ‌లు)గా అంచ‌నా క‌ట్టారు.  ఈ కంపెనీ రిల‌య‌న్స్ జియోకు సంబంధించిన 5జీ2, ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్‌కు సంబంధించిన సాంకేతిక అంశాల‌ను బ‌లోపేతం చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను  రిల‌య‌న్స్ ఈ కంపెనీలో ఒక్కో షేర్‌కు 1.72 డాల‌ర్లు (దాదాపు 118 రూపాయ‌లు) చెల్లించ‌బోతుంది. 

వాట్సాప్‌లో ఫేక్ న్యూస్ ప్రాబ్ల‌మ్స్ 
ఇండియాలో ఏకంగా 20 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. సాధారణంగా ఇంత‌మంది వాడుతున్న‌ప్పుడు అన్ని ర‌కాల అవ‌ల‌క్ష‌ణాలు దీనిలో క‌న‌ప‌డుతుంటాయి. అలాగే అస‌త్య వార్తల ప్ర‌చారానికి వాట్సాప్ బాగా వేదిక‌గా మారుతోంది. రాజకీయం, మతం, సామాజిక, న్యాయ ప‌ర‌మైన అంశాలు ఇలా అన్నింటిలోనూ ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేయాల‌నుకునేవాళ్ల‌కు ఇది అడ్డాగా మారిపోయింది. హింసాత్మ‌క సంఘ‌ట‌న‌ల‌కు కూడా కార‌ణ‌మ‌వుతోంది. అందుకే వాట్సాప్‌లో ఈ ఫేక్ న్యూస్ ప్రచారాన్ని ఆప‌డానికి మార్గాలు వెత‌కాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఫేస్‌బుక్‌కు మ‌ళ్లీ ప‌రీక్ష‌
కేంబ్రిడ్జి అన‌లిటికా డేటా లీకేజి వ్య‌వ‌హారంతో ప‌రువు పోగొట్టుకున్న ఫేస్‌బుక్‌ను ఆ ఘ‌ట‌న ఇంకా నీడ‌లా వెంటాడుతూనే ఉంది. యూజ‌ర్ల డేటాను వారికి తెలియ‌కుండానే కేంబ్రిడ్జి అన‌లిటికా అనే సంస్థ‌కు ఇచ్చేసిన వ్య‌వ‌హారంలో ఫేస్‌బుక్‌ను ఇప్ప‌టికే ద‌ర్యాప్తు సంస్థ‌లు  ప‌లుమార్లు విచారించాయి. లేటెస్ట్‌గా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్‌, ఫెడ‌ర‌ల్ ట్రేడ్ క‌మిష‌న్ లాంటి సంస్థ‌లు కూడా ఈ ద‌ర్యాప్తులో భాగంగా ఫేస్‌బుక్‌ను ప్ర‌శ్నించ‌బోతున్నాయ‌ని వాషింగ్ట‌న్ పోస్ట్ పత్రిక చెప్పింది.

అమెజాన్ మూడో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంట‌ర్ ప‌శ్చిమ‌బెంగాల్‌లో
ఈకామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ త‌న మూడో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంట‌ర్‌ను ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇలా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తే అక్క‌డ భారీగా ప్రొడ‌క్ట్స్ తెచ్చిపెడ‌తారు. దీంతో ఆ ప్రాంతంలో 1 నుంచి 2 రోజుల్లోనే డెలివ‌రీ ఇచ్చేస్తారు. కోల్‌క‌తాకు స‌మీపంలో పెట్ట‌బోతున్న ఈ కొత్త సెంట‌ర్ లక్షా 40 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉండ‌బోతోంది.

గుర్‌గావ్‌లో బైక్‌షేరింగ్‌
గూగుల్ బ్యాక‌ప్‌తో వ‌చ్చిన బైక్‌షేరింగ్ స్టార్ట‌ప్ డున్జో త‌న సేవ‌ల‌ను గుర్‌గావ్‌కు కూడా విస్త‌రించ‌ర‌నుంది. క్యాబ్ స‌ర్వీస్‌లాగే బైక్ బుక్ చేసుకుంటే రైడ‌ర్ వ‌చ్చి మిమ్మ‌ల్ని తీసుకెళ్లి మీరు చెప్పిన చోట డ్రాప్ చేస్తారు. ప్ర‌స్తుతానికి ప్ర‌యోగాత్మ‌కంగా గుర్‌గావ్‌లో ప‌రీక్షిస్తున్నారు.

జియోఫోన్‌లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌
జియో ఫోన్‌లో ఇక‌పై యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌కూడా నేరుగా చూసుకోవ‌చ్చు.  ఈ మూడు యాప్స్‌ను కూడా నేరుగా జియో ఫోన్‌లోనే పెట్టేలా ఆగ‌స్టు 15నాటికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తెస్తామ‌ని రిల‌య‌న్స్ ప్ర‌క‌టించింది. అలాగే సెకండ్ జ‌న‌రేష‌న్ జియో ఫోన్ 2ను కూడా త్వ‌ర‌లోనే తీసుకురానుంది. దీంతోపాటు జియో ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌ను కూడా ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ట్లు రిల‌య‌న్స్ ఈ వారం జ‌రిగిన ఏజీఎంలో ప్ర‌క‌టించింది.

ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా అప్పు
ఇండియాలోని అతిపెద్ద ఈకామ‌ర్స్ సంస్థ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్‌ల రంగంలోకి కాలు మోప‌బోతోంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ కంపెనీ లైసెన్స్ కోసం ఇప్ప‌టికే ద‌రఖాస్తు కూడా చేసింది. చిన్న‌పాటి రుణాలు ఇవ్వ‌డం, త‌మ వెబ్‌సైట్‌లో కొనే ఉత్ప‌త్తుల‌కు మైక్రో ఇన్స్యూరెన్స్ వంటి ఆర్థిక కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌బోతుంది. 

డేటా లీకేజీల‌పై దృష్టి పెట్టిన ఏపీ ప్ర‌భుత్వం
త‌మ ప్ర‌భుత్వ వెబ్‌సైట్ల‌లో పౌరుల డేటా లీక‌వుతుంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. డేటా లీకేజిని నివారించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్  కంప్యూట‌ర్ రెస్పాన్స్ టీమ్ (APCRT)ని తీసుకొస్తోంది. వ‌చ్చే వారం నుంచి ఈ టీమ్ పని చేయ‌బోతోంది.

మేధోసంపత్తి హక్కులను కాపాడడానికి విపో ఇంటర్నెట్ ఒప్పందాలకు ఇండియా ఆమోదం
ప్రపంచ మేధోసంపత్తి సంస్థ యొక్క ఇంటర్నెట్ ఒప్పందాలకు అనుగుణంగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.  ఇంట‌ర్నెట్ ప‌రిధి పెరిగిపోతున్న ప‌రిస్థితుల్లో మేధో సంపత్తి హ‌క్కుల‌ను ర‌క్షించుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతోంది.  అందుకే ఈ ఒప్పందాలకు అంగీక‌రించిన‌ట్లు మంత్రివర్గం ప్ర‌క‌టించింది. ఈ ఒప్పందాలు అమ‌ల్లోకి వ‌చ్చిన ప‌ద‌హారు సంవ‌త్స‌రాల త‌ర్వాత భార‌త మేథో హ‌క్కుదారులు త‌మ మేథోసంప‌త్తి హ‌క్కుల‌ను విదేశాల్లో కూడా పొంద‌గ‌లుగుతారు.

జన రంజకమైన వార్తలు