• తాజా వార్తలు

యాపిల్ టీవీ ప్ల‌స్ వ‌ర్సెస్, అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్ వ‌ర్సెస్ హాట్‌స్టార్

సినిమాలు, సీరియల్స్ చూడాలంటే  అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ చూడాల్సిందే. ఇదే ఇప్పుడు ట్రెండ్. క్రికెట్ మ్యాచ్‌లు కూడా లైవ్ చూడాల‌నుకునేవారికి హాట్‌స్టార్ ఉండనే ఉంది.  ఎల‌క్ట్రానిక్ రంగ దిగ్గ‌జం యాపిల్ కూడా కొత్త‌గా  ఈ బిజినెస్‌లోకి వ‌చ్చేసింది. యాపిల్ టీవీ ప్లస్‌తో స్ట్రీమింగ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. దీంతో పోటీ మ‌రింత పెరిగింది. ఇంత‌కీ ఈ నాలుగింటిలో ఏది బెస్ట్‌? ఓ లుక్కేద్దాం ప‌దండి 

యాపిల్ టీవీ ప్ల‌స్ 
న‌వంబ‌ర్ 1న  ఇండియాతో స‌హా 100కు పైగా దేశాల్లో యాపిల్ టీవీ ప్లస్ లాంచ్ అయింది. 9 ఒరిజినల్ షోస్, మూవీస్ తో యాపిల్ తన స్ట్రీమింగ్ సర్వీసును లాంచ్ చేసింది. ఇందులో జెన్నిఫర్ ఆనిస్టిన్ నటించిన కామెడీ షో ద మార్నింగ్ షోతోపాటు సీ, ఫ‌ర్ ఆల్ మాన్‌కైండ్‌, డికిన్స‌న్‌ వంటి ప్ర‌ఖ్యాత షోలు ఉన్నాయి. మరిన్ని షోలు, మూవీస్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. హెచ్‌డీ, 4కే కంటెంట్ వ‌స్తుంది. దీన్ని కావాలంటే డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో కూడా చూడొచ్చు.
 

ఏయే డివైస్‌ల్లో చూడొచ్చు: ఐ ఫోన్‌, ఐప్యాడ్‌, ఐపాడ్‌, మాక్‌, యాపిల్ టీవీ స్ట్రీమింగ్ బాక్స్‌ల్లో యాపిల్ టీవీ ప్ల‌స్‌ను చూడొచ్చు.  వీటితోపాటు శాంసంగ్‌, సోనీ, ఎల్జీ, రోకూల్లోని కొన్ని స్మార్ట్ టీవీల్లోనూ, అమెజాన్ ఫైర్ స్టిక్ ఉన్న టీవీల్లోనూ కూడా యాపిల్ టీవీ ప్ల‌స్ ప్ర‌సారాల‌ను వీక్షించ‌వ‌చ్చు. గూగుల్ క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, స‌ఫారీ బ్రౌజ‌ర్ల‌లో tv.apple.comలోకి వెళ్లి స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుని యాపిల్ టీవీ ప్ల‌స్ చూడొచ్చు.  
నెల‌కు ఎంత‌: సెప్టెంబ‌ర్ 12 త‌ర్వాత యాపిల్  ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి యాపిల్ ప్రొడక్ట్స్ కొన్న‌వారికి ఏడాది పాటు యాపిల్ టీవీ ప్లస్ సర్వీస్ ఉచితం.  మిగిలిన వారికి వారం పాటు ఉచితం. త‌ర్వాత నెల‌కు 99 రూపాయ‌లు. 

నెట్ ఫ్లిక్స్ 
15 కోట్ల‌కు పైగా స‌బ్‌స్క్రైబ‌ర్లున్న ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ స‌ర్వీస్ నెట్‌ఫ్లిక్స్.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొంది. ఇందులో దేశ విదేశాల సినిమాలు, టీవీ షోల‌తోపాటు ఇండియ‌న్ సినిమాలు, సీరియ‌ల్స్ కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. అందుకే ఇండియాలో కూడా నెట్‌ఫ్లిక్స్‌కు  మంచి ఆద‌ర‌ణే ఉంది. స్ట్రేంజ‌ర్ థింగ్స్‌, హౌస్ ఆఫ్ కార్డ్స్‌, బ్లాక్ మిర్ర‌ర్‌, ద క్రౌన్‌, ఢిల్లీ క్రైమ్ లాంటి షోలు నెట్ ఫ్లిక్స్‌లో బాగా పాపుల‌ర్ అయ్యాయి.  డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ చూడొచ్చు. అయితే కొంత కంటెంట్ మాత్రం డౌన్‌లోడ్ కాదు. 
 

ఏయే డివైస్‌ల్లో చూడొచ్చు: నెట్‌ఫ్లిక్స్ దాదాపు అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులో ఉంది. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్‌లు, ఆండ్రాయిడ్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, ప్లే స్టేష‌న్ 4, ఎక్స్‌బాక్స్ 1, విండోస్ 10 ల్యాప్‌టాప్స్‌తోపాటు క్రోమ్‌, ఫైర్ ఫాక్స్ బ్రౌజ‌ర్ల‌లోనూ చూడొచ్చు.

ధ‌ర ఎంత‌: నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జి నెల‌కు 499 రూపాయ‌లు. ప్రీమియం క‌నెక్ష‌న్  అయితే 799 రూపాయ‌లు క‌ట్టాలి. 
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ యూజ‌ర్ల కోసం నెల‌కు 199 రూపాయ‌ల‌తో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. అయితే ఈ స్కీమ్‌లో కేవ‌లం ఒక్క స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్‌లో మాత్ర‌మే నెట్‌ఫ్లిక్స్‌ను చూడ‌గ‌ల‌రు. అది కూడా ఎస్డీ క్వాలిటీతోనే వస్తుంది. 

అమెజాన్ ప్రైమ్ వీడియో 
ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అద‌న‌పు ప్ర‌యోజ‌నాల కోసం అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ప్ర‌వేశ‌పెట్టింది. దీన్ని తీసుకున్న‌వారికి ఆటోమేటిగ్గా అమెజాన్ ప్రైమ్ వీడియో మెంబ‌ర్ షిప్ కూడా వ‌చ్చేస్తుంది.  లోక‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ కంటెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇండియ‌న్ యూజ‌ర్ల కోసం బాలీవుడ్ సినిమాల‌తోపాటు తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌రాఠీ వంటి ప్రాంతీయ భాష‌ల సినిమాలు కూడా ఉండ‌డంతో ఇది బాగానే క్లిక్క‌యింది. ద బాయ్స్‌, బాష్‌, గోలియ‌త్‌, ద ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లు బాగా పాపుల‌ర‌య్యాయి.  డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ కంటెంట్ చూడొచ్చు. 


ఏయే డివైస్‌ల్లో చూడొచ్చు: అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా  అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులో ఉంది. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్‌లు, ఆండ్రాయిడ్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, ప్లే స్టేష‌న్ 4, ఎక్స్‌బాక్స్ 1, విండోస్ 10 ల్యాప్‌టాప్స్‌తోపాటు క్రోమ్‌, ఫైర్ ఫాక్స్ బ్రౌజ‌ర్ల‌లోనూ చూడొచ్చు.

ధ‌ర ఎంత‌: ఏడాదికి 999 రూపాయ‌ల‌తో అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుంటే అమెజాన్ సైట్‌లో చాలా ఉప‌యోగాలున్నాయి. ఆఫ‌ర్లు మిగిలిన‌వారికంటే ముందు ప్రైమ్ మెంబ‌ర్ల‌కు అందుబాటులో పెడ‌తారు. ఫ్రీ, ఫాస్ట్ డెలివ‌రీ ఇస్తారు. దానికి తోడు ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఉచితంగా చూడొచ్చు. నెల‌కు 129 రూపాయ‌ల ప్యాకేజీ కూడా ఉంది.  

హాట్‌స్టార్ 
డిస్నీ సంస్థ నుంచి వచ్చిన హాట్‌స్టార్‌కి కూడా ఇండియాలో బాగానే ఫాలోయింగ్ ఏర్ప‌డింది. క్రికెట్ మ్యాచ్‌లు లైవ్‌లో చూడాలంటే టీవీ  అక్క‌ర్లేదు.  హాట్‌స్టార్ మెంజ‌ర్‌షిప్ ఉంటే మొబైల్‌, పీసీలో, ల్యాపీలో లైవ్ చూసేయొచ్చు. అంతేకాదు స్టార్ నెట్‌వ‌ర్క్‌లో ఉన్న అన్ని ఛాన‌ల్లూ చూడొచ్చు. రీసెంట్‌గా ముగిసిన బిగ్‌బాస్ రియాల్టీ షోను హాట్‌స్టార్‌లో కొన్ని ల‌క్షల మంది చూశారు. 

ఏయే డివైస్‌ల్లో చూడొచ్చు: ఐవోఎస్‌, ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్‌లు, ఆండ్రాయిడ్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, ల్యాప్‌టాప్స్‌తోపాటు క్రోమ్‌, ఫైర్ ఫాక్స్ బ్రౌజ‌ర్ల‌లోనూ చూడొచ్చు.

ధ‌ర ఎంత‌:  హాట్‌స్టార్‌లో వ‌చ్చే కంటెంట్ చాలావ‌ర‌కూ ఉచితంగానే చూడొచ్చు.  అయితే ప్రీమియం మెంబ‌ర్‌షిప్ కావాలంటే నెల‌క‌రు 299, ఏడాదిక‌యితే 999 చెల్లించాలి.  ప్రీమియం మెంబ‌ర్ల‌కు గేమ్ ఆఫ్ థ్రోన్స్‌, సిలికాన్ వ్యాలీ లాంటి ఇంట‌ర్నేష‌నల్ షోలు కూడా చూసే అవ‌కాశం ఉంటుంది. ఇటీవ‌ల ఏడాదికి 365 రూపాయ‌ల‌తో హాట్‌స్టార్ వీఐపీ అనే కొత్త ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది.  


 

జన రంజకమైన వార్తలు