జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీకి సంబంధించిన ముఖ్య విశేషాలతో కంప్యూటర్ విజ్ఞానం ప్రతివారం మీకు టెక్ రౌండప్ అందిస్తోంది. ఈ వారం టెక్ రౌండప్‌లో ముఖ్యాంశాలు ఇవిగో..
6 కండిషన్లకు ఒప్పుకుంటేనే ఇంటర్నెట్ సౌకర్యం
జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినప్పటి నుంచి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ ఇంటర్నెట్‌ను షట్‌డౌన్ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా ఇంటర్నెట్ కనెక్షన్లను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేసింది. బిజినెస్ అవసరాల కోసం ఇంటర్నెట్ వాడుకోవాలనుకునేవారు తమ సర్వీసులు తిరిగి ప్రారంభించుకోవాలనుకుంటే జమ్మూకాశ్మార్ ప్రభుత్వం 6 నిబంధనలతో ప్రచురించిన బాండ్ మీద సంతకం చేయాలని ప్రకటించింది.
67 లక్షల ఫాస్టాగ్‌లు ఇచ్చాం
టోల్ ప్లాజాల్లో టోల్ ఫీజు వసూలు కోసం వేచి చూడకుండా ఆటోమేటిగ్గా టోల్ ఫీ వసూలు చేయడానికి ఫాస్టాగ్‌ను కేంద్ర ప్రభుత్వం చాలా కాలం కిందటే తీసుకొచ్చింది. డిసెంబర్ 15 నుంచి దాన్ని తప్పనిసరి చేసింది. ఈ పరిస్థితుల్లో నవంబర్ 18 నాటికి దేశవ్యాప్తంగా 67 లక్షలకు పైగా ఫాస్టాగ్‌లు ఇష్యూ చేసినట్లు కేంద్ర రహదారులు, హైవేల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ రాజ్యసభకు చెప్పారు.
లండన్‌లో ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ కోల్పోయిన ఉబెర్
ప్రముఖ ట్యాక్సీ అగ్రిగేటర్ సంస్థ ఉబర్ లండన్‌లో తన ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ కోల్పోయింది. ఇలా కోల్పోవడం ఇది రెండోసారి. ఉబర్ డ్రైవర్లు ఫేక్ ఐడీలతో వాహనాలు నడుపుతన్నట్లు, ఇలాంటివి కనీసం 14వేల ట్రిప్పులను తాము గుర్తించామని లండన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ అయిన ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ ప్రకటించింది. అందుకే ఉబర్ ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
500 మంది ఇండియన్ గూగుల్ యూజర్లను టార్గెట్ చేసిన అటాకర్లు
ఈ ఏడాది జులై సెప్టెంబర్ మధ్య 101 నుంచి 500 మంది ఇండియన్ యూజర్ల అకౌంట్లను గవర్నమెంట్ మద్దతున్న అటాకర్లు టార్గెట్ చేశారని గూగుల్ ప్రకటించింది. గూగుల్‌కి చెందిన త్రెట్ ఎనాలిసిస్ గ్రూప్ (టాగ్) నవంబర్ 26న ప్రచురించిన రిపోర్ట్‌లో ఈ విషయాన్ని తెలియజేసింది.
స్టార్టప్‌ల ఫండ్ రైజింగ్‌కు ఊతం
స్టార్టప్ సంస్థలు నిధులు సమకూర్చుకొనే చర్యలకు మద్దతు పెరుగుతోంది. ఇళ్లు, స్థలాలు, విల్లాల వంటి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అమ్మి దాన్ని స్టార్టప్‌ల కోసం ఉపయోగించేటప్పుడు వాటి అమ్మకంపై క్యాపిటల్ ట్యాక్స్ విధించవద్దని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సిఫార్స్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
టెలిగ్రాం యూజర్ల మెసేజ్‌లను ట్రేస్ చేయడం కష్టం అంటున్న కేరళ పోలీసులు
టెలిగ్రామ్ యాప్ యూజర్ల యాక్టివిటీని ట్రేస్ చేయడం చాలా కష్టమని కేరళ పోలీసులు ఆ రాష్ట్ర హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు. వాట్సాప్ మాదిరిగా దీనిలో యూజర్ ఫోన్ నెంబర్, అకౌంట్ వివరాలేవీ బయటికి తెలియవని.. కేవలం యూజర్ నేమ్ లేదా ఐడీతోనే ఈ యాప్ మెసేజ్ సర్వీసింగ్ అందజేస్తుందని చెప్పారు. ఇంత సెక్యూరిటీ ఉండటం వల్లే ఈ యాప్‌లో యూజర్ల యాక్టివిటీని ట్రేస్ చేయడం కష్టమవుతుందని ఓ కేసు విచారణలో పోలీసులు హైకోర్టుకు తెలిపారు.
పెగాసస్ మాల్వేర్‌పై వాట్సాప్‌తో మాట్లాడామన్న ఐటీ మంత్రి
వాట్సాప్ ద్వారా పెగాసస్ మాల్వేర్‌ను యూజర్ల స్మార్ట్‌ఫోన్లలోకి పంపుతున్నారన్న విషయంపై వాట్సాప్ యాజమాన్యంతో చర్చించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ప్రకటించారు. ఈ మాల్వేర్ గురించి తెలిసినప్పటి నుంచి ఏయే రోజున వాట్సాప్ యాజమాన్యంతో ఏం మాట్లాడామో,వాట్సాప్ రియాక్షన్ ఏమిటో ఆయన తేదీలవారీగా ఓ రిపోర్ట్‌ను సభకు సమర్పించారు.
పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రవేశపెట్టేది ఎప్పుడో?
వ్యక్తిగత సమాచార రక్షణ (పర్సనల్ డేటా ప్రొటెక్షన్) కోసం ఓ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీనిపై పార్లమెంట్‌లో బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతామో ఇంకా తెలియదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో చెప్పారు. వాట్సాప్ పెగాసస్ మాల్వేర్‌పై ప్రశ్నలకు జవాబిస్తూ ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
యూపీఐ ఒక ఆప్షనే.. యూజర్లకు ఇంకా చాలా ఛాయిస్‌లున్నాయి
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) రూపొందించిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) అనేది డబ్బు చెల్లింపులకు ఒక ఆప్షన్ మాత్రమేనని ఎన్‌పీసీఊ సీఈఓ దిలీప్ ఆస్బే చెప్పారు. దీనికి ఆర్‌బీఐ నుంచి లైసెన్స్ కూడా తీసుకున్నామన్నారు. భీమ్, ఆధార్, రూపే ఆధారంగా పేమెంట్స్ చేయడానికి యూపీఐ ఉపయోగపడుతుంది. అయితే తామేమీ దీనిలో ఏకఛత్రాధిపత్యం వహించడం లేదని, చాలా మొబైల్ వాలెట్స్, యాప్స్ కూడా యూజర్లకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
పెగాసస్‌తో ఎలాంటి హానీ జరగలేదన్న మంత్రి
ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్‌ను వాట్సాప్ ద్వారా యూజర్ల ఫోన్లలోకి పంపి ప్రజలపై నిఘా పెట్టాలనుకుంటున్నారా అని రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. ప్రభుత్వమే ఈ స్పైవేర్ కొనుగోలు చేసిందన్న ఎంపీల వాదనను ఆయనను తోసిపుచ్చారు. దీనిపై వాట్సాప్ యాజమాన్యంతో కూడా చర్చించామంటూ డేట్స్‌తో సహా పార్లమెంట్‌లో సమాధానం చెప్పారు.