ఈ వారం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో జరిగిన మార్పులేమిటి? కొత్తగా ఏమొచ్చాయి? ఇప్పటికే ఉన్న కంపెనీల్లో డెవలప్‌మెంట్స్ ఏమిటి? వాట్సాప్ నుంచి ఫేస్‌బుక్ దాకా ఆధార్ నుంచి మొబీక్విక్ వరకు వివిధ కంపెనీల్లో జరిగిన పరిణామాలేంటో క్లుప్తంగా తెలుసుకోవాలనుందా? అయితే ఈవారం టెక్ రౌండప్ మీకోసం..
1.జియో త్రైమాసిక లాభం 510 కోట్లు
ఇండియన్ మొబైల్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న 2017-18 చివరి త్రైమాసికం (జనవరి నుంచి మార్చి)వరకు 510కోట్లు లాభాలు ఆర్జించింది. దాదాపు 18 కోట్ల 66 లక్షల మంది కస్టమర్లతో 7,128కోట్ల రూపాయల వ్యాపారాన్ని జియో ఈ మూడు నెలల్లో చేసింది. దీని ద్వారా 510కోట్ల రూపాయల లాభాలు సంపాదించింది. ఇది అంతకు ముందు త్రైమాసికం (504 కోట్ల) కంటే 6కోట్లు ఎక్కువ. గత త్రైమాసికంలో జియో 6,879 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది.
2.ఐడియా వాలెట్ బేస్ పడిపోయింది
ఐడియా సెల్యులర్ కంపెనీ ప్రీపెయిడ్ వాలెట్ ఐడియా మనీ వ్యాపారం భారీగా పడిపోయింది .గత త్రైమాసికంలో 8.5మిలియన్లున్న యూజర్ బేస్ మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి 4.53 మిలియన్లకు పడిపోయింది. అంటే ఏకంగా 65శాతానికి పైగా యూజర్లు తగ్గిపోయారు. ఇన్ యాక్టివ్‌గా ఉన్న యూజర్లు వాలెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం ఇందుకు కారణమని ఐడియా అంచనా వేస్తోంది.
3.వాట్సాప్‌కు జాన్ కోమ్ టాటా
వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ కామ్ వాట్సాప్ నుంచి వైదొలిగారు. ఫేస్‌బుక్ డైరెక్టర్లలో ఒకరైన కోమ్ వాట్సాప్‌ను ఫేస్‌బుక్ భారీ మొత్తానికి కొనుగోలు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అయితే ఫేస్‌బుక్ ఇటీవల డేటాను బయటివారికి ఇచ్చిందని ఫేస్‌బుక్ అనలిటికా వివాదంలో ఇరుక్కున్న నేపథ్యంలో కోమ్ తన పదవి నుంచి వైదొలిగారు.
4.ట్విట్టర్ డేటా కూడా పొక్కింది
ఫేస్‌బుక్ అనలిటికా వివాదం నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ అన్నింటికీ ఇప్పుడు డేటా చౌర్యం సెగ తగులుతుంది. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డేటా కూడా బయటికి పొక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జి అనలిటికా ఇవ్వడంలో కీలకపాత్రధారి అయిన అలెగ్జాండర్ కోగన్ ట్విట్టర్ డేటాను కూడా యాక్సెస్ చేశారని తెలుస్తోంది.
5.కొత్త సిమ్‌కు ఆధార్ అక్కర్లేదు
కొత్త సిమ్ కార్డు కొనాలంటే ఆధార్ నెంబర్ ఇవ్వాలన్న నిబంధన ఇకపై అమలు కాబోదు. సిమ్ కార్డు కావాలంటే ఆధార్ వివరాలు చెప్పాలన్న నిబంధనను పక్కన పెట్టినట్లు టెలికం సెక్రటరీ అరుణా సుందరరాజన్ చెప్పారు. దీని బదులు పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్ లాంటి ఐడెంటిటీ ప్రూఫ్ ఏది ఇచ్చినా సరిపోతుంది. దీన్ని తక్షణం అమలు చేయాలని సుందరరాజన్ ప్రకటించారు.
6.కేంబ్రిడ్జి అనలిటికా మూత
ఫేస్‌బుక్ డేటా ఉల్లంఘన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న బ్రిటీష్ రాజకీయ సలహాదారు కేంబ్రిడ్జ్ అనలిటికా మూతపడబోతోంది. దివాలాకు సిద్ధంగా ఉన్నట్లు కేంబ్రిడ్జి అనలిటికా తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది.అంతేకాదు తమ కంపెనీ ఎలక్ట్రానిక్స్ డివిజన్ ఎస్‌సీఎల్ గ్రూప్‌ను కూడా మూసివేయబోతున్నట్లు చెప్పింది.
7.ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ట్యాంపర్ కాలేదన్న యూఐడీఏఐ
ఆధార్ నమోదుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ ట్యాంపరింగ్ అయిందన్న ఆరోపణలను ఆధార్ నమోదు సంస్థ యూఐడీఏఐ (UIDAI)కొట్టిపారేసింది. ఆధార్ నమోదు సాఫ్ట్‌వేర్ టాంపరయిందని, బయటి మార్కెట్లలో దొరుకుతుందని సోషల్ మీడియాలోనూ, కొన్ని వార్తా ఛానల్స్‌లోనూ వార్తలొచ్చాయి. ఆధార్ బయోమెట్రిక్ వివరాలు డబ్బు పెట్టి కొనుక్కుంటే దొరికేలా ఉన్నాయని వాటి సారాంశం.అయితే వార్తలను యూఐడీఏఐ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో తోసిపుచ్చింది.
8.షేర్లు తిరిగి కొంటున్న ఫ్లిప్‌కార్ట్
దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అమ్మకానికి వచ్చింది.. దాన్ని వాల్‌మార్ట్ కొంటుందా, అమెజాన్ కొంటుందా అని గత కొన్ని రోజులుగా బిజినెస్ సర్కిల్స్‌లో విపరీతంగా ప్రచారంజరుగుతోంది. దీనిమీద పుంఖానుపుంఖాలుగా కథనాలు, విశ్లేషణలు కూడా వచ్చాయి. అయితే మరోవైపు ఫ్లిప్‌కార్ట్ సింగపూర్ బేస్డ్ కంపెనీ వద్ద ఉన్న దాదాపు 2,338 కోట్ల రూపాయల విలువైన షేర్లను తిరిగి కొనుక్కొంది. కంపెనీ అమ్మకానికి వెళుతుందన్న విశ్లేషణలున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా భారీగా షేర్లను తిరిగి కొంటుండడంపై మార్కెట్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
9.మొబీక్విక్ యాప్ నుంచి ఓలా రైడ్ బుకింగ్
పేమెంట్స్ యాప్ మొబీక్విక్ మార్కెట్లో పట్టు పెంచుకోవడానికి ఇతర సేవలందించే కంపెనీలతో టైఅప్ అవుతోంది. దీనిలో భాగంగా క్యాబ్ ఎగ్రిగేటర్ ఓలాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం మొబీక్విక్ యాప్ నుంచి ఓలా రైడ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓలా యాప్‌లో ఉన్న ఓలా ఆటో, మైక్రో, మినీ, ప్రైమ్, ఎస్‌వీయూ సర్వీస్ బుకింగ్స్ అన్నీ ఇకపై మొబీక్విక్ నుంచి నేరుగా చేసుకోవచ్చు. అంతేకాదు క్యాబ్ ఫేర్‌ను మొబీక్విక్ వాలెట్ మనీతో పే చేయొచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ సర్వీసు అందుబాటులోకి తెచ్చినట్లు మొబీక్విక్ ప్రకటించింది.