• తాజా వార్తలు

ఆధార్ పై మనకున్న సందేహాలలో టాప్ 11 కి UIDAI ఇచ్చిన సమాధానాలు ఇవే !

మన దేశం లో ఏ క్షణాన ఈ ఆధార్ ను మొదలుపెట్టారో గానీ సామాన్య ప్రజలకు దీనిపై మొదటినుండీ సందేహాలూ, చికాకులు, ఇబ్బందులు , కన్ఫ్యూజన్ లే. అసలే ఈ ఆధార్ ను నమ్మవచ్చా లేదా అని ప్రజలు సందేహపడుతున్న తరుణం లో ప్రభుత్వం అందించే ప్రతీ సేవకూ ఆధార్ లింకింగ్ ను తప్పనిసరి చేయడం తో ప్రజల్లో నెలకొని ఉన్న భయాలు రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యం లో ఆధార్ పట్ల ప్రజలలో ఉన్న అనేక సందేహాలకు UIDAI సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. అలాంటి సందేహాలు, సమాధానాలలో టాప్ 11 ఈ రోజు మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం.

ప్రశ్న : బయో మెట్రిక్ లు, బ్యాంకు ఎకౌంటు లు, PAN మొదలైన సమాచారం అంతా UIDAI వద్ద ఉంది కదా! మరి దీనిని ఉపయోగించి నా కార్యకలాపాలను ట్రాక్ చేసే వీలుందా?

జవాబు : ఇది పూర్తిగా అవాస్తవం. UIDAI వద్ద ఉండే డేటా బేస్ లో మీ పేరు, చిరునామా,పుట్టిన తేదీ, పది వేలిముద్రలు, రెండు ఐరిస్ స్కాన్ లు, ముఖం యొక్క ఫోటో గ్రాఫ్, మొబైల్ నెంబర్ మరియు ఈ మెయిల్ ఐడి మాత్రమే ఉంటాయి. ఇవి కాక మీ కుటుంబ నేపథ్యం, కులం, విద్యార్హతలు, బ్యాంకు ఎకౌంటు లు, షేర్ లు, మీ ఆర్థిక స్థితిగతులకు సంబందించిన సమాచారం ఏదీ ఉండదు. అంతేగాక ఒకవేళ UIDAI అలాంటి సమాచారం కావాలని అనుకున్నా తీసుకోకుండా ఆధార్ యాక్ట్ 2016 లోని సెక్షన్ 32(3) దీనిని నియంత్రిస్తుంది. కాబట్టి ఈ విషయమై ఏ విధమైన భయం అవసరం లేదు.

ప్రశ్న: కానీ నేను నా బ్యాంకు ఎకౌంటు కు, మ్యూచువల్ ఫండ్స్ కు, షేర్ లకూ ఆధార్ ను లింక్ చేసినపుడు UIDAI కి ఈ సమాచారం చేరే అవకాశం ఉంది కదా !

జవాబు: ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మీరు మీ ఆధార్ నంబర్ ను బ్యాంకు ఎకౌంటు లకూ,మ్యూచువల్ ఫండ్ కంపెనీలకూ, మొబైల్ కంపెనీలకూ ఇచ్చినపుడు వారు కేవలం మీ ఆధార్ నెంబర్ మరియు మీ బయో మెట్రిక్ లను మాత్రమే UIDAI  కి పంపుతారు. అదికూడా కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే. కాబట్టి ఈ విషయం లో కూడా ఏ విధమైన సందేహాలూ అవసరం లేదు.

ప్రశ్న : ఎవరికైనా నా ఆధార్ నెంబర్ తెలిస్తే దానిద్వారా వారు నా బ్యాంకు ఎకౌంటు ను హ్యాక్ చేసే వీలు ఉంటుందా ?

జవాబు : ఇది కూడా పూర్తిగా అవాస్తవం. ఉదాహరణకు ఎవరికైనా మీ ATM నెంబర్ తెలిసిందనుకోండి. కేవలం ఆ నెంబర్ తో ATM మెషిన్ నుండి డబ్బు డ్రా చేయలేరు కదా! ఇది కూడా అంతే. కేవలం మీ ఆధార్ నెంబర్ తెల్సినంత మాత్రాన దానిద్వారా ఎవరూ మీ బ్యాంకు ఎకౌంటు ను హ్యాకింగ్ చేయలేరు. కాబట్టి అనవసర భయాలు పెట్టుకోనవసరం లేదు.

ప్రశ్న: నా ఎకౌంటు కు ఆధార్ లింక్ చేయమని బ్యాంకు లు ఎందుకు అడుగుతున్నాయి?

జవాబు : ఇది కేవలం మీ భద్రత కోసమే. ఎకౌంటు హోల్డర్ ల యొక్క ఐడెంటిటీ ని వెరిఫై చేయడం ఇప్పుడు తప్పనిసరి అయింది. ఎందుకంటే ఖాతాదారులలో నేరగాళ్ళు, మోసగాళ్ళు మొదలైన వారు ఉండవచ్చు కదా! మీ ఎకౌంటు ను ఆధార్ కు లింక్ చేయడం ద్వారా వేరెవరూ మీ ఎకౌంటు ను దుర్వినియోగం చేసే వీలు ఉండదు. కాబట్టి మీ బ్యాంకు ఎకౌంటు కు ఆధార్ ను లింక్ చేయడం మీకే సురక్షితం.

ప్రశ్న : నా మొబైల్ నెంబర్ కు ఆధార్ ను ఎందుకు లింక్ చేయాలి?

జవాబు : మీ భద్రత తో పాటు దేశ భద్రత కూడా ముఖ్యం కదా! కాబట్టి దేశం లో ఉన్న అందరు మొబైల్ సబ్ స్క్రైబర్ ల యొక్క ఫోన్ నెంబర్ లు వారి వారి ఆధార్ నెంబర్ తో లింక్ చేయడం తప్పనిసరి. లేకపోతే ఉగ్రవాదులు నకిలీ ఐడెంటిటీ లతో సిమ్ కార్డు లు తీసుకుని దేశ భద్రతకు పెనుసవాలు గా మారే అవకాశం ఉంది.

ప్రశ్న: సిమ్ కోసం నా దగ్గర తీసుకున్న నా ఆధార్ నెంబర్ ను మొబైల్ కంపెనీలు వేరే అవసరాలకు వాడే అవకాశం ఉందా?

జవాబు: ఎవరూ అలా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మీ ఆధార్ నెంబర్ మరియు మీ బయో మెట్రిక్ లు పూర్తిగా ఎన్ క్రిప్ట్ చేయబడి ఉంటాయి.అది ఎంతలా అంటే మళ్ళీ మీరు మీ వేలిముద్రలు ఇచ్చినపుడే వాటికి యాక్సెస్ లభిస్తుంది. అంతవరకూ మీ వేలిముద్రలు ఉన్నాసరే ఎవరూ ఆ నెంబర్ తో ఏమీ చేయలేరు. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం వారు శిక్షార్హులు. కాబట్టి ఈ విషయం లో ఎటువంటి సందేహాలు అవసరం లేదు.

ప్రశ్న : NRI లకు బ్యాంకింగ్, మొబైల్ , PAN మరియు ఇతర సర్వీస్ లకు ఆధార్ అవసరం లేదా ?               

జవాబు : ఆధార్ అనేది కేవలం భారతీయులకు అంటే ఇండియా లో నివసించే వారికి మాత్రమే. NRI లు ఆధార్ పొందుటకు అనర్హులు. బ్యాంకు లు, మొబైల్ కంపెనీలు NRI ల కోసం కొన్ని మినహాయింపులతో కూడిన షరతులను కలిగిఉన్నాయి.

ప్రశ్న : ఆధార్ కోసం కొంతమంది పేదలకు రేషన్, పెన్షన్ లాంటి సర్వీస్ లు నిలిపివేస్తున్నారు కదా!

జవాబు : ఇది అవాస్తవం. సెక్షన్ 7 ప్రకారం ఆధార్ లేదనీ లేదా ఆధార్ మ్యాచ్ అవడం లేదనీ మరే ఇతర సాంకేతిక కారణాల వలన గానీ ప్రభుత్వ సేవలైన రేషన్, పెన్షన్ లాంటి వాటిని నిలుపుదల చేయడం లాంటివి చేయకూడదు. ఒకవేళ ఏ ప్రభుత్వ ఏజెన్సీ అయినా ఇలాంటి కారణాలతో ప్రభుత్వ సర్వీస్ లు నిలిపివేసినట్లయితే ఫిర్యాదు చేయవచ్చు.        

ప్రశ్న : కొన్ని ఏజెన్సీ లు ఈ- ఆధార్ ను అంగీకరించకుండా ఒరిజినల్ ఆధార్ ను అడుగుతున్నాయి కదా! ఇది కరక్టేనా?

జవాబు : UIDAI  ద్వారా డౌన్ లోడ్ చేసుకోబడిన ఈ- ఆధార్ అనేది ఒరిజినల్ ఆధార్ లాగే చట్టప్రకారం ఎక్కడైనా చెల్లుతుంది. ఒకవేళ రెండింటిలో ఏదైనా మార్పులు ఉంటే వాటిని పరిగణన లోనికి తీసుకోవాలి గానీ ఎవరైనా సరే ఈ ఆధార్ ను యాక్సెప్ట్ చేయను అంటే వరి పై కంప్లైంట్ నమోదు చేయవచ్చు.

ప్రశ్న : సామాన్యునికి ఆధార్ వలన ఉపయోగo ఏమిటి ?

జవాబు :  దేశం లో ఉన్న సుమారు 120 కోట్ల మంది ప్రజలు ఒకనమ్మదగిన ఐడెంటిటీ ని కలిగి ఉన్నారు. అదే ఆధార్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఒక భారతీయునికి ఉన్న ఐడెంటిటీ డాక్యుమెంట్ లలో ఎవరికైనా ముందు గుర్తు వచ్చేది ఆధార్ మాత్రమే. అంతెందుకు ఎవరైనా ఒక మధ్య తరగతి వ్యక్తి ని అడిగి చూడండి అతనే చెప్తాడు ఆధార్ వలన సామాన్యునికి గల ఉపయోగాలు ఏమిటో !

ప్రశ్న : ఆధార్ డేటా లీక్ అవుతుంది అని ఈ మధ్య వింటున్న వార్తలు నిజమేనా ?

జవాబు : ఇప్పటికి ఆధార్ ను ప్రవేశపెట్టి 7 సంవత్సరాలు అయ్యింది. ఈ 7 సంవత్సరాలలో  ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఆధార్ సమాచారం లీక్ అవ్వలేదు. అందరు ఆధార్ హోల్డర్ ల సమాచారం చాలా సురక్షం గా ఉంది. రక్షణ  విషయం లో ఆధార్ చాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ని కలిగి ఉంది. ఆధార్ డేటా లీక్ అవుతుందని వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దు. ఇదంతా తప్పుడు ప్రచారం.

 

 

జన రంజకమైన వార్తలు