• తాజా వార్తలు

ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో మీ ఫోన్ సురక్షితం అనేది ఎంతవరకూ వాస్తవం?

ఈ మధ్య వస్తున్న దాదాపు అన్ని హై ఎండ్ స్మార్ట్ ఫోన్ లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లు తప్పనిసరిగా ఉంటున్నాయి. కొన్ని కొన్ని బడ్జెట్ ఫోన్ లలో కూడా ఇవి ఉంటున్నాయి. ఫోన్ లలో ఉండే వివిధ రకాల లాక్ ల లాంటిదే ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా. అయితే మనిషి యొక్క వేలిముద్రలు వేరెవరినీ పోలి ఉండవు కాబట్టి ఇది చాలా సురక్షితం అని అందరూ అనుకుంటారు. అయితే ఇది వాస్తవమేనా?
ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ లు ఎంతవరకూ సురక్షితం?
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లలో లభిస్తున్న ఫింగర్ ప్రింట్ స్కానర్ లు అంత సురక్షితం కాదని న్యూ యార్క్ యూనివర్సిటీ కి చెందిన టాండన్ స్కూల్ అఫ్ ఇంజినీరింగ్ పరిశోధక బృందం చెబుతుంది. ఈ బృందం ఈ వేలిముద్రల స్కానర్ లపై ఒక పరిశోధన జరిపారు. ఈ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే మొబైల్ ఫోన్ లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉండే ఫింగర్ ప్రింట్ స్కానర్ లు అంత సురక్షితం కావు. వీటిని ఉపయోగించి మోసాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది.
మోసం ఎలా జరుగుతుంది?
ఏ ఇద్దరి వ్యక్తుల వేలి ముద్రలూ ఒకేరకంగా ఉండవు అనేది మనందరికే తెలిసిన విషయమే. మరి మోసం జరిగే అవకాశం ఎక్కడ ఉంది? మనస్మార్ట్ ఫోన్ లలో ఉండే ఫింగర్ ప్రింట్ స్కానర్ లు మన వేలి మొత్తాన్నీ స్కాన్ చేసేటంత సామర్థ్యాన్ని కలిగి ఉండవు. మన వేలిలోని కొంత భాగాన్ని మాత్రమే ఇవి స్కాన్ చేసి మన పరికరాలకు సెక్యూరిటీ ని కల్పిస్తాయి. ఇక్కడే వచ్చింది అసలు చిక్కంతా. ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకే రకంగా ఉండవు కానీ వాటిలో ఉండే భాగాలు లేదా గీతల యొక్క వరుసలు ఒకేరకంగా ఉండే అవకశం ఉంది. అంటే ఇద్దరి వ్యక్తుల వేలిముద్రల లోని భాగాలు ఒకేరకంగా ఉండవచ్చు అన్నమాట. మీ వేలి ముద్ర యొక్క భాగం తో పోలిన ఎవరైనా మీ స్కానర్ లో వేలు పెడితే వారికి కూడా యాక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
ఈ అవకాశం ఎంతవరకూ ఉంది?
ఉదాహరణకు 1234 అనే పాస్ వర్డ్ ను తీసుకుందాం. వివిధ రకాలుగా ప్రయత్నిస్తే ఇది కరెక్ట్ అయ్యే అవకాశం సంభావ్యతా సిద్ధాంతం ప్రకారం 4 శాతం వరకూ ఉంది. అంటే ఊహించడం తో పోలిస్తే ఇదే ఎక్కువ అవకాశమే కదా! ఇప్పుడు వేలి ముద్రల వద్దకు వద్దాం. ఈ పరిశోధక బృందం సుమారు ఒక పదివేల మంది వేలిముద్రలు పరీక్షించి చూశారు. వీటిలో ఉండే పాక్షిక భాగాలను ఉపయోగించి వీరు 92 మాస్టర్ ప్రింట్ లను తయారు చేశారు. అంటే ప్రతీ 800 మంది వేలి ముద్రలు కలిపితే ఒక మాస్టర్ ప్రింట్ తయారు అవుతుంది అన్నమాట. ఈ 800 మందిలో ఏ ఒక్కరు ఆ మాస్టర్ ప్రింట్ లో స్కాన్ చేసినా తమ వేలిముద్రలు సరిపోలతాయి కదా! మరి ఇదే సూత్రం మన ఫోన్ లలో ఉండే ఫింగర్ ప్రింట్ స్కానర్ లకు ఎందుకు వర్తించదు ? అని వీరు అంటున్నారు. మీ వేలి ముద్ర లలో కొంత భాగాన్ని పోలిన వారు ఇంకా చాలా మంది ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా తప్పు జరగడానికి కొంచెం అవకాశం అయినా సరిపోతుంది, మరి ఇంత అవకాశం ఉన్నపుడు మోసం జరగకుండా ఎలా ఉంటుంది? ఈ గణాంకాలు ఉపయోగించి సైబర్ నేరస్తులు రెచ్చిపోయే అవకాశం ఉంది కదా! ఏముంది వీటితో ఒక మాస్టర్ ప్రింట్ తయారు చేసారంటే చాలు బ్యాంకు ఎకౌంటు లలోని డబ్బు దగ్గరనుండీ స్మార్ట్ ఫోన్ ల వరకూ మీకు సంబందించిన ప్రతీదీ తస్కరించబడే అవకాశం ఉంది కదా!

జన రంజకమైన వార్తలు