స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంది. ఫిట్‌నెస్ ట్రాకర్స్ బదులు స్మార్ట్‌వాచ్‌లను ఎక్కువ మంది కొంటున్నారు. ఇది మీ ఆరోగ్య పరిస్థితిని స్మార్ట్‌గా విశ్లేషిస్తుండడం ఇందుకు ప్రధాన కారణం. స్మార్ట్‌వాచ్ హెచ్చరించడంతో హాస్పిటల్‌కు వెళ్లి ప్రాణాపాయం నుంచి కాపాడుకున్న ఉదాహరణలు చూస్తుంటే స్మార్ట్‌వాచ్ ఒత్తిడితో కూడిన నేటి తరానికి ఎంతో అవసరంలా కనిపిస్తోంది.
యాపిల్ వాచ్ కాపాడింది
అమెరికాకు చెందిన జేమ్స్ టి గ్రీన్ ఆఫీస్ పనిలో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం తమ ఆఫీస్ బ్లాక్ చుట్టూ నడుస్తుండగా శ్వాస తీసుకోవడం కొద్దిగా కష్టంగా అనిపించింది. అతనికి ఇంతకుముందే ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకడితే ఆపరేషన్ చేసి సరిచేశారు. దాంతో గ్రీన్ తన శ్వాసలో ఇబ్బంది సాధారణ సమస్య కాదనుకున్నాడు. ఆఫీస్‌లో కూర్చుని తన చేతికి ఉన్న యాపిల్ వాచ్ చూశాడు. అందులో అతని హార్ట్‌బీట్ రేట్ చాలా చాలా ఎక్కువగా కనిపించింది. వెంటనే ఆస్పత్రికెళ్లాడు. అయితే డాక్టర్లు అదేమంత పెద్ద విషయం కాదని, పని ఒత్తిడి వల్ల అలా అనిపించిందని సర్దిచెప్పారు. కానీ గ్రీన్ వినలేదు. యాపిల్ స్మార్ట్‌వాచ్ గత కొన్ని రోజులుగా తన హార్ట్‌రేట్ నమోదైన తీరును చూపించాడు. దీంతో డాక్టర్లు అప్రమత్తమైసీటీ స్కాన్ చేయిస్తే ఊపిరితిత్తుల్లో రక్తం మళ్లీ గడ్డకడుతున్నట్లు తేలింది. ఈసారి ఆపరేషన్ అవసరం లేకుండా రక్తాన్ని పలుచన చేసే మెడిసిన్‌తో తగ్గించగలిగారు. .
తలనొప్పే అన్నారు.. పేస్‌మేకర్ వేయాల్సి వచ్చింది
కెనడాలో జాకీ బ్రదర్స్ అనే 53 ఏళ్ల నర్స్ కూడా ఇలాగే స్మార్ట్‌వాచ్‌తో ప్రాణాలు కాపాడుకోగలిగింది. బ్రదర్స్ 12 గంటల షిప్ట్ చేసేది. ఆరోగ్యం బాగాలేదని డాక్టర్లను సంప్రదిస్తే ఆమె చెప్పిన లక్షణాలు విన్నాక ఇది వర్టిగో అని చెప్పారు. అంటే తలపోటు, కళ్లు సరిగా కనిపించకపోవడం వంటి లక్షణాలుండొచ్చు అన్నారు. అయితే ఆమె హాస్పటల్ డ్యూటీలో ఉండగా ఫిట్‌బిట్ బ్లేజ్ స్మార్ట్‌వాచ్ పెట్టుకుని ఉండేది. డ్యూటీలో అటూ ఇటూ నడిచినప్పుడు స్మార్ట్ వాచ్‌లో నమోదైన హార్ట్ రేట్ డేటాను డాక్టర్లకు చూపిస్తే వాళ్లు వెంటనే అలర్టయ్యారు. టెస్ట్‌లు చేసి వెంటనే ఆమెకు గుండె సమస్య ఉందని, ఫేస్‌మేకర్ వేశారు. అలా జాకీ బ్రదర్స్ ప్రాణాలు కాపాడుకోగలిగింది.
ఆట్రియల్ ఫైబ్రిలేషన్ ఉందని కనిపెట్టేసింది
అమెరికాలోని ఇండియానాలో ఎరిక్ ఐజాక్‌సన్ అనే ఫైనాన్షియల్ అడ్వయిజర్‌ది మరో కథ. వాళ్ల కంపెనీ ఉద్యోగులందరికీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ పెట్టింది. దానికోసం ఎరిక్ రోజూ ఫిట్‌బిట్‌ను ధరించడం ప్రారంభించాడు. దానిలో అతని హార్ట్‌రేట్ అసాధారణంగా ఉందని చూపించింది. దాన్ని డాక్టర్‌కు చూపిస్తే ఆట్రియల్ ఫైబ్రిలేషన్ ఉందని తేల్చారు. ఆట్రియల్ ఫైబ్రిలేషన్ అనేది గుండె సమస్య. ఏటా అమెరికాలో దీనివల్ల లక్షా 30 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతటి ప్రమాదకరమైన గుండె జబ్బు ఉందని తనకు స్మార్ట్‌వాచ్ ద్వారానే తెలిసిందని, ప్రతి ఒక్కరూ ఇలాంటి హార్ట్‌రేట్ మానిటర్ ధరించడం అత్యవసరమని అంటున్నాడు ఎరిక్.
ఈ మూడు ఘటనలు గత నెలలోనే జరిగాయంటే స్మార్ట్‌వాచ్‌లు మన ఆరోగ్య పరిరక్షణలో ఎలా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయో అర్ధమవుతుందంటున్నారు నిపుణులు. ఫిట్‌నెస్ ట్రాకర్లు మీ హార్ట్‌రేట్, పల్స్, ఎన్ని కేలరీస్ ఖర్చయ్యాయి వంటి డేటా మాత్రమే ఇస్తాయి. యాపిల్ స్మార్ట్‌వాచ్ మీ హార్ట్‌రేట్ డేటాను కొన్ని శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషిస్తుంది. అసాధారణమైన అంశాలేమైనా కనపడితే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఫిట్‌బిట్ కూడా ఇలాంటి డేటా విశ్లేషణకు సిద్ధమవుతోంది. డాక్టర్లు ఈ విశ్లేషణలను శాస్త్రీయమని అంగీకరించకపోవచ్చేమో కానీ పేషెంట్‌కు మాత్రం తనకేదో సమస్య ఉందని గుర్తించి, డాక్టర్‌ను వెంటనే సంప్రదించి ప్రాణాపాయం తప్పించుకునే అవకాశం కల్పిస్తున్నాయి.