సెలబ్రిటీలు ఏదైనా ట్వీట్ చేస్తే వాళ్ల ఫ్యాన్స్ దాన్ని రీట్వీట్ చేస్తుంటారు. చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లు, వాళ్ల సరదా ఫొటోలు, పర్సనల్ ఇష్యూస్ గురించి వాళ్లు చెప్పే ముచ్చట్లు లక్షల్లో రీ ట్వీట్ అవుతుంటాయి. అయితే వరల్డ్ మోస్ట్ రీట్వీటెడ్ ట్వీట్ మాత్రం ఓ 16 ఏళ్ల అమెరికన్ కుర్రాడి సొంతమైంది. అది కూడా ఫ్రీ చికెన్ నగెట్స్ కావాలంటూ ఆ కుర్రాడు చేసిన ట్వీట్‌కు రీట్వీట్ కావడం విశేషం.
18 మిలియన్ల ట్వీట్లు
కార్టర్ విల్కర్‌సన్ అనే అమెరికన్ టీనేజర్‌కు చికెన్ నగెట్స్ అంటే చాలా ఇష్టం. ఏడాది పొడవునా ఫ్రీ చికెన్ నగ్గెట్స్ కావాలంటే ఏం చేయాలంటూ అమెరికాలో చికెన్ నగ్గెట్స్ బిజినెస్‌లో ఫేమస్ అయిన ద వెండీస్‌కు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు 18 మిలియన్ల (కోటీ 80 లక్షల) రీట్వీట్లు కావాలంటూ వెండీస్ చెప్పింది. ఫ్రీ చికెన్ నగ్గెట్స్ కోసం అంటూ విల్కర్‌సన్ చేసిన ట్వీట్ ట్విటర్‌లో వైరల్ అయింది. ఎవరికి వారు దాన్ని రీ ట్వీట్ చేసుకుంటూ వెళ్లడంతో ఇప్పడు ఏకంగా వాటి సంఖ్య 35 లక్షలు దాటేసింది. ఇది గిన్నిస్ రికార్డుల్లో చోటుసంపాదించింది. అబ్బురపడిన ‘వెండీస్’ స్పందిస్తూ.. విల్కర్‌సన్‌కు ఏడాదిపాటు ఉచితంగా నగెట్లు అందజేస్తామని ప్రకటించింది.
సెలబ్రిటీ రికార్డ్‌ను దాటేశాడు
టీవీ షోలతో ఫేమస్ అయిన ఎలెన్ డిజెనెరెస్ 2014లో ఆస్కార్ అవార్డు పొందిన హాలీవుడ్ నటులు బ్రాడ్‌పిట్, జూలియా రాబర్ట్‌లతో సెల్ఫీ దిగి ట్వీట్ చేస్తే దానికి 34 లక్షల 30వేల రీ ట్వీట్లు వచ్చాయి. ఇప్పటివరకు రీట్వీట్లలో అదే పెద్ద రికార్డు. విల్కర్‌సన్ చికెన్ నగెట్స్ రిక్వెస్ట్ ట్వీట్‌తో దాన్ని దాటేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ రికార్డ్ చూసి ముచ్చటపడిన వెండీస్.. కోటీ 80 లక్షల రీట్వీట్లు రానప్పటికీ విల్కర్‌కు ఏడాది పొడవునా ఫ్రీ చికెన్ నగెట్స్ పంపిస్తామని ప్రకటించేసింది.
ఛారిటీ కూడా చేసేశాడు
రీట్వీట్ల కోసం రిక్వెస్ట్ చేస్తూనే విల్కర్‌సన్.. ఫోస్టర్ కేర్‌లో ఉన్న చిన్నారుల కోసం టీ షర్ట్‌లు అమ్మాడు. దీనిలో వచ్చిన ప్రతి పైసాను వారికే వినియోగిస్తామని చెప్పాడు. దీంతో వెండీస్ కూడా అబ్బురపడింది. విల్కర్‌సన్ గౌరవార్ధం ఆ ఫౌండేషన్‌కు లక్ష డాలర్ల విరాళం ప్రకటించడం మరో విశేషం.