• తాజా వార్తలు

క‌రోనా అవుట్‌బ్రేక్‌లో టెక్ దిగ్గ‌జాలు ప్ర‌జ‌ల‌కు ఎలా సహాయపడుతున్నాయి ?

క‌రోనా వైర‌స్ క‌నీవినీ ఎర‌గ‌నంత విధ్వంసం సృష్టిస్తోంది. ప్ర‌పంచంలో 190 దేశాలు ఇప్ప‌టికే క‌రోనా బారిన‌ప‌డ్డాయి. ఇట‌లీ, స్పెయిన్‌, యూకే, యూఎస్ లాంటి దేశాలు క‌రోనా భ‌యంతో అల్లాడిపోతున్నాయి.  ఈ వైర‌స్ సోకి చ‌నిపోయిన‌వాళ్ల శ‌వాల‌ను పూడ్చ‌డానికి కూడా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.  ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌పంచంలోని దిగ్గ‌జ టెక్నాల‌జీ సంస్థ‌లు ప్ర‌జ‌ల‌కు త‌మ‌వంతు సాయం అందిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్
టెక్నాల‌జీ లెజండ్ కంపెనీ మైక్రోసాఫ్ట్ క‌రోనా మీద అల‌ర్ట్ అయింది. త‌మ ఉద్యోగుల్లో ఎక్కువ మందిని వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయ‌మ‌ని చెప్పేసింది. అంతేకాదు సామాన్య ప్ర‌జ‌ల కోసం కరోనా ట్రాకింగ్ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. 

bing.com/covid  అని బ్రౌజ‌ర్‌లో టైప్ చేస్తే  ఏ దేశంలో ఎన్ని క‌రోనా కేసులున్నాయి?  ఎంత‌మంది రిక‌వ‌రీ అయ్యారు, ఎంత మంది చ‌నిపోయారు లాంటి వివ‌రాల‌ను అందిస్తుంది.

ఇండియా అని సెర్చ్‌లో టైప్ చేస్తే ఇండియాలో క‌రోనా ఎలా ఉందో చూపిస్తుంది. మ్యాప్‌లో ఏ స్టేట్‌ను క్లిక్ చేస్తే అక్క‌డి వివ‌రాలిస్తుంది.

bing.com/covid వెబ్‌సైట్‌లోని వివ‌రాల ప్ర‌కారం  ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 504 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 37 మంది రిక‌వ‌ర‌య్యారు 457 మందికి ఇంకా క‌రోనా యాక్టివ్‌గానే ఉంది.  10 మంది వ‌ర‌కు చ‌నిపోయార‌ని చూపిస్తుంది.

గూగుల్‌
టెక్నాల‌జీ జెయింట్ గూగుల్ కూడా క‌రోనా నియంత్ర‌ణలో భాగం పంచుకుంటోంది. తన మాతృసంస్థ ఆల్ఫాబెట్ వారి అనుబంధ సంస్థ అయిన వెరిలీ.. క‌రోనా వైర‌స్ టెస్టింగ్ ప్ర‌క్రియ‌ను లైవ్‌లో చూపిస్తామంటూ మ‌న ముందుకొచ్చింది. 

అలాగే కొవిడ్‌-19 గురించిన స‌మాచారం అంటే ఎన్ని కేసులు న‌మోద‌య్యాయి. ఎంత‌మంది రిక‌వ‌ర‌య్యారు వంటి వివరాల‌తోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్త‌ల‌నుకూడా వివ‌రిస్తుంది. 

గూగుల్ సెర్చ్‌లో coronavirus అని టైప్ చేయ‌గానే సెర్చ్ రిజ‌ల్ట్ పేజీలో రైట్‌సైడ్ ఒక ఎస్‌వోఎస్ అల‌ర్ట్ వ‌స్తుంది. దానిలో క‌రోనా ఓవ‌ర్ వ్యూ, సింప్ట‌మ్స్ (వ్యాధి ల‌క్ష‌ణాలు), ట్రీట్‌మెంట్ (చికిత్స‌) అనే వివ‌రాలు అందిస్తోంది.

యాపిల్
యాపిల్ త‌న యూజ‌ర్ల‌కు క‌రోనా వైర‌స్ గురించిన స‌మాచారం అందించ‌డానికి త‌న వాయిస్ అసిస్టెంట్ సిరిని ఉప‌యోగించుకుంటోంది.

యాపిల్ ఐఫోన్ ఐప్యాడ్ యూజ‌ర్లు వాయిస్ అసిస్టెంట్ సిరిని do I have coronavirus అని అడిగితే  అది కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతుంది. దానికి మీరిచ్చే స‌మాధానాల‌ను బ‌ట్టి అవి క‌రోనా ల‌క్ష‌ణాలో కాదో ఒక అంచ‌నాకు వ‌స్తుంది.

ల‌క్ష‌ణాలు దానికి ద‌గ్గ‌ర‌గా ఉంటే మిమ్మ‌ల్ని హెచ్చ‌రిస్తుంది. వెంట‌నే 911 (అమెరికాలో అయితే) లేదా ఇత‌ర  హెల్ప్‌లైన్ల‌కు కాల్ చేయ‌మ‌ని సూచిస్తుంది.

అనుమానం ఏమాత్రం అనిపించినా మిమ్మ‌ల్ని మీరు ఇత‌రుల‌తో క‌లవ‌కుండా ఐసోలేట్ కావాల‌ని స‌ల‌హా ఇస్తుంది.

ఇండియాలో మీరు సిరిని  do I have coronavirus అని అడిగితే అక్క‌డి నుంచి ఆరోగ్య కుటుంబ‌సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌కు మిమ్మ‌ల్ని తీసుకెళుతుంది.

 

 

జన రంజకమైన వార్తలు