క్రికెట్ అనగానే సాంకేతికతతో ముడిపడిన అంశం. స్కోరు బోర్డు దగ్గర నుంచి ఆటగాళ్ల రికార్డుల వరకు ఇప్పడు ఏదైనా కంప్యూటర్ ద్వారా జరగాల్సిందే. రాను రాను క్రికెట్లో సాంకేతికత చొచ్చుకుపోతోంది. రికార్డులు బద్ధలైన సమయంలో... ఏమైనా సంచలన మ్యాచ్‌లు జరిగిన సమయంలో సాంకేతికత ఎంతో అవసరం. క్రికెట్లో సెకన్లలో అంకెలు మారిపోతాయి. రికార్డులు తలకిందలవుతాయి. ఈ స్థితిలో ప్రతి అంకె కీలకమే. ఈ నేపథ్యంలో క్రికెట్‌ను మరింత టెకీగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అభిమానులను ఆకట్టుకోవడానికి టెక్నాలజీని విస్తృతంగా వాడుకోవాలని ఐసీసీ నిర్ణయించింది. త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ (మినీ ప్రపంచకప్) టెక్నాలజీని వీలైనంతగా ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఐసీసీ భావిస్తోంది. దీనిలో భాగంగా ఇంటెల్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది.
ఇన్నోవేటివ్ దాడి
మ్యాచ్‌ల విశ్లేషణ, ఇన్నింగ్స్ విశ్లేషణ, ఆటగాళ్ల రికార్డుల వివరాలను అభిమానులకు సులభంగా అర్ధమయ్యేలా చెప్పడానికి ఈ సాంకేతికత ఉపయోగపడనుంది. బ్యాట్స్‌మెన్ ఏ యాంగిల్‌లో బంతిని అందుకుంటున్నాడు.. ఏ బంతిని మిస్ అవుతున్నాడు? ఎన్ని రకాలు షాట్లు ఆడాడు. ఎలాంటి బంతికి ఔటయ్యాడు. అతని వీక్ జోన్ ఏమిటీ? ఇవన్నీ పై చిత్రాల రూపంలోనూ, గ్రాఫిక్ రూపంలో చూపిస్తూ అభిమానులకు అర్దమయ్యేలా చేయడానికి ఇంటెల్ ప్రయత్నించనుంది. బౌలర్ యాంగిల్‌నూ సాంకేతికత ఎంతో కీలకం. అతను ఎలాంటి బంతుల్ని విసిరాడు. ఓవర్ పిచ్ వేశాడా? స‌్లో బాల్స్ వేశాడా? అతను ఔట్ చేయదగిని బంతులు వేశాడు లాంటి విశేషాలు కేవలం టెక్నాలజీ ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే ఐసీసీ తన టెక్నాలజీ పార్ట్‌నర్‌గా ఇంటెల్‌ను ఎంచుకుంది. ఈసారి ఇంగ్లాండ్‌లో జరిగే చాంపియన్ ట్రోఫీని ఇన్నోవేటివ్‌గా అందించడానికి ప్రయత్నిస్తోంది.
అలా దెబ్బకొడుతున్నారు.
కేవలం విశ్లేషణలు అందించడానికి మాత్రమే కాదు ఆటగాళ్లను, కోచ్‌లను ట్రయిన్ చేయడానికి కూడా టెక్నాలజీని వాడుకోనున్నారు. ప్రత్యర్థుల బలాబలాలేంటి? బలహీనతలు ఏంటి? ఎలా దెబ్బ కొట్టాలి... లాంటి అంశాల్లో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అన్ని జట్లు భావిస్తున్నాయి. ఒకప్పుడు వీడియోలు మాత్రమే చూసి ఆటను అంచనా వేసేవాళ్లు. ఇప్పుడు ప్రతి బంతిని ఒక ఆటగాడు ఎలా ఎదుర్కొంటున్నాడు.... అతని వీక్ జోన్ ఏంటి లాంటి అంశాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి లాభం పొందుతున్నారు.