• తాజా వార్తలు

ఎన్ఈఎఫ్టీ ద్వారా ఆన్ లైన్ మనీ ట్రాన్సఫర్ మరింత వేగం కానుంది తెలుసా?


వ్యాలట్లు, యూపీఐ విధానాలు వంటివి ఎన్ని వచ్చినా కూడా మనీ ట్రాన్సఫర్ లో ఐఎంపీఎస్, ఎన్ ఈ ఎఫ్ టీ విధానాలే ఇంకా ఎక్కువగా వాడుతున్నారు. ఐఎంపీఎస్ లో ఎప్పటిది అప్పుడే డబ్బు ట్రాన్సఫర్ అవుతుంది... ఎన్ ఈ ఎఫ్ టీ విషయానికొచ్చేసరికి మాత్రం కాస్త సమయం పడుతుంది. కానీ.. మరో రెండు నెలల్లో ఎన్ ఈ ఎఫ్ టీ కూడా మరింత వేగంగా మనీ ట్రాన్సఫర్ కు ఉపయోగపడబోతోంది. ఈ మేరకు ఆర్బీఐ కొన్ని మార్పులు చేస్తోంది.
ఎన్ఈఎఫ్టీ విధానంలో మరింత పారదర్శకత, వేగం పెంచడం లక్ష్యంగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు జూలై 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో భాగంగా, ఇప్పటివరకూ ఎన్ఈఎఫ్టీ లావాదేవీ క్లియరెన్స్ సమయం గంటగా ఉండగా, మారిన నిబంధనల మేరకు ఆ సమయం అర గంటకు తగ్గుతుంది.
ఉదయం 8:30 నుంచి గంటకోసారి చొప్పున 11 అదనపు సెటిల్ మెంట్ బ్యాచ్ లను ప్రవేశపెడుతున్నామని ఆర్బీఐ వెల్లడించింది. మొత్తం 23 బ్యాచ్ లు అమలవుతాయని, ఉదయం 8 గంటలకు తొలి బ్యాచ్ క్లియరెన్స్, రాత్రి 7 గంటలకు చివరి బ్యాచ్ క్లియరెన్స్ ఉంటుందని తెలిపింది.
లబ్దిదారుడి బ్యాంకు ఖాతాలో ఏవైనా కారణాలతో డబ్బును జమచేయలేకపోతే, రెండు గంటల్లోగా తిరిగి ఆ మొత్తాన్ని పంపిన వారి ఖాతాలో జమ చేయాలని కూడా ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. మరింత వేగంగా ఫండ్స్ ట్రాన్స్ ఫర్ కోసమే ఈ నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు తెలిపింది.
ఎన్ఈఎఫ్టీ విధానంలో బట్వాడా చేయాల్సిన కనీస మొత్తం అంటూ ఏ నిబంధనా ఉండదని, బ్యాంకు శాఖల ద్వారా జరిపే లావాదేవీలతో పోలిస్తే, తక్కువ చార్జ్ తోనే ఎన్ఈఎఫ్టీ లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపింది.

జన రంజకమైన వార్తలు