• తాజా వార్తలు

ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఊరటనిచ్చింది. ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టతనిచ్చింది. సాంకేతిక కారణాలతో విఫలమైన లావాదేవీలను, బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, చెక్‌బుక్‌ విజ్ఞప్తి వంటి నగదేతర లావాదేవీలను నెల నెలా అందించే ఐదు ఉచిత లావా దేవీల్లో భాగం చేయవద్దని సూచించింది. ప్రతినెలా బ్యాంకులు వినియోగదారులకు అందించే ఉచిత ఏటీఎం కోటాలో విఫలమైన లావాదేవీలను లెక్కించవద్దని బ్యాంకులను ఆదేశించింది. 

ఎటిఎంల్లో నగదు లేక, సాంకేతిక ఇబ్బందుల కారణంగా రద్దైనా లావాదేవీలనూ బ్యాంకులు ఉచిత ఎటిఎం లావాదేవీలుగా లెక్కిస్తున్నాయని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఈ  ఫిర్యాదులతో ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.వినియోగదారుల నుంచి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకులకు జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఆర్‌బిఐ పేర్కొంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ సమస్యలు, ఏటీఎంలో కరెన్సీ అందుబాటులో లేకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల విఫలమయ్యే లావాదేవీలను చెల్లుబాటు అయ్యే లావాదేవీలుగా పరిగణించరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. 

కస్టమర్లనుంచి ఇందుకోసం ఎలాంటి ఛార్జీ  వసూలు చేయరాదని  ఆర్‌బీఐ  ప్రకటన పేర్కొంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లతో సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు కూడా  ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం అన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు ఎటిఎం యంత్రాల ద్వారా సగటున ప్రతి నెలా 5 వరకూ ఉచిత నగదు ఉపసంహరణ అవకాశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. 

బ్యాంకు ఎటిఎం నుంచి నగదు ఉపసంహరణ ప్రయత్నంలో విఫలమైతే.. ప్రతి నెలా నిర్దేశిత ఉచిత లావాదేవీల్లోంచి ఒకటి వథా అయిపోయినట్లే. బ్యాలెన్స్‌ ఎంక్వైరీని కూడా ఇందులో భాగంగా చూపిస్తున్నాయి. చివరికి ఎటిఎంలో నగదు లేకపోయినా వినియోగదారుడు ఉచిత లావాదేవీలు నష్టపోవాల్సి వస్తోంది. నెలలోపు ఉచిత 5 లావాదేవీలు పూర్తయితే తర్వాతి నుంచి బ్యాంకులు రుసుములు వసూలు చేస్తున్నాయి.

జన రంజకమైన వార్తలు