• తాజా వార్తలు

ఇక భార‌త ఫ్లయిట్ల‌లో వైఫై సేవ‌లు!

భార‌త్‌లో వైఫై వాడ‌కం బాగా పెరిగిపోయింది. కేవ‌లం ఇళ్ల‌లో మాత్ర‌మే కాదు ప‌బ్లిక్ ప్లేసుల్లో ఎక్క‌డ చూసినా వైఫై క‌నిపిస్తోంది. రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌, కాఫీ షాపులు ఎక్క‌డికి వెళ్లినా మా వైఫై వాడుకోండి అని పాస్‌వ‌ర్డ్‌లు ఇచ్చేస్తున్నారు. భార‌త్‌లో ఇంత‌గా వ్యాపించిన వైఫై మాత్రం విమానాల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి ఇప్ప‌టివ‌ర‌కు అందుబాటులో ఉండేది కాదు. సాధార‌ణంగా విమానాశ్ర‌యాల్లో మాత్రమే వైఫై నెట్‌వ‌ర్క్ ఉంటుంది. అయితే ఒక‌సారి బోర్డింగ్ అయిన త‌ర్వాత ఇంట‌ర్నెట్ అనే ప్ర‌స్త‌క్తే ఉండ‌దు. అస‌లు మనం ఫోన్ పూర్తిగా ఫ్ల‌యిట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. కానీ చాలామంది బిజినెస్ మాగ్న‌ట్‌లు విమానాల్లో రాక‌పోక‌లు సాగిస్తుంటారు. ఇలాంటి వారికి 24 గంట‌లు నెట్ ఉండాల్సిందే . విమానం ఎక్కాక కీల‌క స‌మ‌యాల్లో నెట్ లేక వీరు చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు. ఇక‌పై ఇలాంటి ఇబ్బందుల‌కు చెక్ పెట్టాల‌ని భార‌త విమాన‌యాన సంస్థ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

బోర్డింగ్‌తో పాటు వైఫై!
ఇక‌పై మ‌నం విమానం ఎక్కిన త‌ర్వాత అది టేకాఫ్ తీసుకునే ముందే ప్ర‌యాణీకులు మొబైల్స్‌, లాప్‌టాప్‌లు వైఫైకి క‌నెక్ట్ చేయ‌బ‌డ‌తాయి. ఇక‌పై ఇలాంటి ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు విమాన‌యాన వ‌ర్గాలు తెలిపాయి. అంటే ఆకాశంలో ఎగురుతూ కూడా మ‌నం మెయిల్స్ చెక్ చేసుకోవ‌డం, ఇత‌ర స‌మాచారాన్ని పంపించుకోవ‌డం, టాస్క్ కంప్లీట్ చేసుకోవ‌డం చేయ‌చ్చు. అంత‌ర్జాతీయ విమానాల్లో ఇప్ప‌టికే ఈ వైఫై సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని విమానంలో వైఫైని అనుమ‌తించ‌కూడ‌ద‌ని భార‌త విమాన‌యాన సంస్థ నిర్ణ‌యించింది. కానీ పెరుగుతున్న అవ‌స‌రాల దృష్ట్యా, ప్ర‌యాణీకుల ఇబ్బందుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వైఫై సేవ‌ల్ని తీసుకు రావాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

టెర్ర‌రిస్టుల‌తోనే భ‌యం
విమానాల్లో వైఫై స‌ర్వీసులు తీసుకు వ‌స్తున్నార‌న్న వార్త ప్ర‌యాణీకుల్లో ఆనందాన్ని నింపుతుంటే.. ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు మాత్రం గుబులు రేపుతోంది. దీనికి కార‌ణం టెర్ర‌రిస్టులే. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టినా ఉగ్ర‌వాదుల చేతుల్లో ఎన్నోసార్లు విమానాలు హైజాక్ అయ్యాయి. మ‌రి వైఫై ఉపయోగిస్తే ప‌రిస్థితి ఏంట‌నేది వారి భ‌యం. ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బందికి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ వ్య‌వ‌స్థ‌కి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా వైఫై సిగ్న‌ల్స్ ఇవ్వ‌డం ఒక ఎత్తైతే.. టెర్ర‌రిస్టుల హ్యాకింగ్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం మ‌రో ఎత్తు. హ్యాక్ చేసిన ప్లేన్స్‌ను టెర్ర‌రిస్టులు మిసైల్స్‌లా ఉప‌యోగించే ప్ర‌మాదాలు లేక‌పోలేద‌ని నిపుణులు అంటున్నారు. అంతేకాక ప్ర‌యాణీకుల్లో ఎవ‌రైనా హైజాక‌ర్ ఉంటే భూమి మీద ఉన్న త‌న స‌హ‌చ‌రుల‌తో కాంటాక్ట్ కావ‌డం చాలా సుల‌భ‌మ‌ని.. ఇది భ‌ద్ర‌త‌కు చాలా ప్ర‌మాద‌మ‌ని వారు చెబుతున్నారు.

జన రంజకమైన వార్తలు