• తాజా వార్తలు

ఏ ఆండ్రాయిడ్ ఓఎస్ ఎంతమంది వాడుతున్నారో తెలుసా?

ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ల స్మార్టు ఫోన్లు శరవేగంగా మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. అదేసమయంలో ఓఎస్ అప్ డేట్ చేసుకునే వీలున్న ఫోన్లు... అప్ డేట్ చేసుకునేవారూ పెరుగుతున్నారు. దీంతో కొత్త ఓఎస్ వస్తే చాలు, చాలా ఫోన్లలో అదే కనిపిస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ నూగట్ విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ డివైస్ లలో సుమారు 10 శాతం ఆండ్రాయిడ్ నూగట్ వాడుతున్నారట.
ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ డివైస్‌ల‌లో 9.5 శాతం వాటిలో ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్ ఉన్నట్లు గూగుల్ ప్రకటించింది. జూన్ నెల‌కు గాను గూగుల్ ఈ వివ‌రాల‌ను తాజాగా రిలీజ్ చేసింది. అయతే... ప్రస్తుతం ప్రపంచంలోని అత్యధిక ఫోన్లలో ఉన్న ఓఎస్ మాత్రం దీనికంటే ముందు వెర్షన్ అయిన ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.0. మొత్తం 31.2 శాతం డివైస్ లో ఇది రన్ అవుతోంది.
ఇక రెండో స్థానం విషయానికొస్తే లాలీ పాప్ దే. లాలిపాప్ 5.0ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30.8 శాతం ఆండ్రాయిడ్ డివైస్‌ల‌లో వాడుతున్నారు. జెల్లీబీన్‌, కిట్‌క్యాట్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ల‌ను వాడుతున్న వారు 18.1, 8.8 శాతం ఉండ‌గా, పాత ఆండ్రాయిడ్ ఓఎస్ అయిన జింజ‌ర్‌బ్రెడ్‌ను నేటికీ 1 శాతం ఆండ్రాయిడ్ డివైస్‌ల‌లో వాడుతున్నారు. ఐస్ క్రీం శాండ్‌విచ్ 4.0 ఆండ్రాయిడ్ ఓఎస్‌ను 0.8 శాతం మంది వాడుతున్నారు. జూన్ 5వ తేదీ వ‌ర‌కు ప్లే స్టోర్‌ను యాక్సెస్ చేసిన ఆండ్రాయిడ్ డివైస్‌ల వివ‌రాల‌ను ఆధారంగా గూగుల్ ఈ స్టేటిస్టిక్స్ రిలీజ్ చేసింది.

జన రంజకమైన వార్తలు