• తాజా వార్తలు

యాపిల్ వాచ్ క‌ట్టుకున్న ఎంపీకి పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌

యాపిల్ ఉత్ప‌త్తులంటే కుర్రాకారు నుంచి అన్ని ర‌కాల ప్రొఫెష‌న‌ల్స్ కు క్రేజే. రాజ‌కీయ నాయ‌కులూ దీనికి అతీతులు కారు. మ‌న దేశంలోని చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేతుల్లో యాపిల్ ఫోన్లు, యాపిల్ వాచ్ లు క‌నిపిస్తుంటాయి. అయితే... ఓ ఎంపీ ఇలాగే యాపిల్ వాచ్ క‌ట్టుకోవ‌డంతో పార్టీ ఆయ‌న్ను స‌స్పెండ్ చేసింది. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. ఇంత‌కీ యాపిల్ వాచ్ క‌ట్టుకోవడం ఎందుకు త‌ప్ప‌యిందో తెలుసుకోవాల్సిందే.
సీపీఎం సంగ‌తి తెలుసు క‌దా... వామ‌ప‌క్ష భావ‌జాలం గ‌ల ఆ పార్టీ ఆడంభ‌రాల‌కు దూరంగా ఉంటుంది. కానీ, ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రితుబ్రత బెనర్జీ మాత్రం అదేమీ ప‌ట్టించుకోకుండా హైటెక్ పోక‌డ‌లు పోతున్నార‌ట‌. చేతికి యాపిల్ వాచ్‌... ఇత‌ర ల‌గ్జ‌రీ గాడ్జెట్లు వాడుతున్నార‌ట‌. దీంతో పార్టీ ఆయ‌న్ను మూడు నెలల పాటు బహిష్కరించింది.
వామపక్ష భావజాలానికి విభిన్నంగా ఆయన జీవనశైలి ఉందనే నెపంతో రితబ్రత బెనర్ పై బహిష్కరణ వేటు వేసింది. ఆయన ఎక్కువగా హై-టెక్, ఖరీదైన గాడ్జెట్లను వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఖరీదైన ఆపిల్ వాచ్, లగ్జరీ మోంట్ బ్లాంక్ పెన్ (రూ.15వేల పైన నుంచి రూ. 60వేల రూపాయల మధ్యలో రేటు) వాడి బెనర్జీ ఇరకాటంలో పడ్డారు. సాకర్ మ్యాచ్ చూస్తూ ఖరీదైన యాక్ససరీస్ ధరించిన బెనర్జీ ఫోటోలను సీపీఎం నేత సుమిత్ తాల్కుదార్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అప్పట్లో దుమారం చెలరేగింది. దీనిపై పార్టీ విచార‌ణ జ‌రిపి వేటు వేసింది.

జన రంజకమైన వార్తలు