గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా స్మార్టు ఫోన్ల సేల్స్ లో దుమ్ము రేపిన యాపిలే ఈ ఏడాది కూడా టాప్ లో నిలిచింది. 2017 తొలి క్వార్టల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ‘ఐఫోన్ 7’ నిలిచింది.
మూడు నెలల్లో 2.15 కోట్ల ఫోన్లు
2017 మొదటి త్రైమాసికంలో 2.15 కోట్ల ‘ఐఫోన్ 7’ యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రపంచ మార్కెట్‌లో జరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో ఇది ఆరు శాతంగా నమోదైంది. 1.74 కోట్ల హ్యాండ్‌సెట్ల అమ్మకాలతో యాపిల్ కంపెనీకే చెందిన ఐఫోన్ 7 ప్లస్ రెండో స్థానంలో నిలిచింది.
మొత్తం 35.33 కోట్ల స్మార్ట్ ఫోన్ల విక్రయం
2017 ఫస్ట్ క్వార్టర్లో 35.33 కోట్ల స్మార్ట్‌ఫోన్లు విక్రయం కాగా అందులో ఐఫోన్ 7 దే అగ్రస్థానం. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్-5 స్మార్ట్‌ఫోన్లలో రెండు యాపిల్ కంపెనీవే కావడం విశేషం.
ఒప్పో ఫస్ట్ టైం థర్డ్ ప్లేస్ లోకి..
గత ఏడాది అయిదో స్థానం సాధించిన ఒప్పో ఈసారి మూడో స్థానంలోకి వచ్చింది. 89 లక్షల యూనిట్ల అమ్మకాలతో ఒప్పో ఆర్9ఎస్ ఫోన్ మూడో స్థానంలో నిలిచింది. బ్రాండ్ ప్రకారం చూసుకుంటే ఒప్పో సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసింది. యాపిల్ మోడల్స్ తరువాత ఒప్పోయే ఉంది. ఈ రకంగా అది శాంసంగ్ ను వెనక్కు నెట్టేసింది.
శాంసంగ్ వెనక్కు..
శామ్‌సంగ్ గెలాక్సీ జే3, శామ్‌సంగ్ గెలాక్సీ జే5 నాలుగైదు స్థానాల్లో నిలిచాయి. కాగా, భారత్‌లో టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ‘ఐఫోన్ 5ఎస్’ నిలిచింది.
ఇవీ టాప్ 5
1. యాపిల్ ఐఫోన్ 7 - 2.15 కోట్ల యూనిట్లు -- 6.1 శాతం వాటా
2. ఐఫోన్ 7 ప్లస్ - 1.74 కోట్లు -- 4.9 శాతం వాటా
3. ఒప్పో ఆర్ 9ఎస్ - 89 లక్షలు -- 2.5 శాతం వాటా
4. శాంసంగ్ గెలాక్సీ జే 3 -- 61 లక్షలు -- 1.7 శాతం వాటా
5. శాంసంగ్ గెలాక్సీ జే 5 -- 50 లక్షలు -- 1.4 శాతం వాటా
ఇతర ఫోన్లన్నీ కలిపి -- 29.44 కోట్లు -- 83.3 శాతం వాటా
** మొత్తంగా స్మార్టు ఫోన్ల విక్రయాల్లో గత ఏడాది ఇదే క్వార్టర్ తో పోల్చిచూస్తే 6.1 శాతం వృద్ధి నమోదైంది.