ప్రపంచాన్ని టెక్నాలజీ ఊపేస్తుంది. ప్రతి రంగంలోనూ టెక్నాలజీయే రాజ్యమేలుతోంది. దీంతో అందరూ టెక్నాలజీపై ఆసక్తి చూపుతున్నారు. టెక్నాలజీని ఇష్టపడేవారు.. అప్ డేట్ గా ఉండేవారిని టెక్ సవ్వీ అనడమూ తెలిసిందే. అయితే.. టెక్నాలజీతో పాటే సైబర్ క్రైం కూడా విపరీతంగా పెరుగుతోంది. కానీ... ఈ టెక్ సవ్వీల్లో ఎంతమంది సైబర్ క్రైం నుంచి తమ గాడ్జెట్లను, తమ విలువైన డాటాను కాపాడుకునే పరిస్థితుల్లో ఉన్నారంటే జవాబు ఇవ్వలేం. అయితే... కొన్ని నెలలుగా టెక్ నాలెడ్జితో సైబర్ సెక్యూరిటీపైనా చాలామంది అప్ డేట్ అవుతున్నారు. తమ నాలెడ్జిని పెంచుకుంటున్నారు. ప్రముఖ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ల తయారీ సంస్థ కాస్పరెస్కీ జరిపిన అధ్యయనంలో ఈ సంగతి వెల్లడైంది.
సైబర్ సవ్వీలు సిద్ధమవుతున్నారు
ప్రపంచ దేశాలతో పాటు ఇండియన్ టెక్ సవ్వీల్లో చాలామంది ఇప్పుడు సైబర్ సవ్వీలుగా మారుతున్నారు. కరడుగట్టిన సైబర్ నేరగాళ్ల నుంచి తమ స్మార్టు పరికరాలను, డాటాను కాపాడుకోవడానికి సిద్ధమవుతున్నారు. అందుకోసం తామే స్వయంగా సైబర్ జ్హానాన్ని పెంచుకుంటున్నారు. ఎలాంటి సైబర్ దాడులను ఎలా ఎదుర్కోవాలి... ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వంటివన్నీ తెలుసుకుని అందుకు సన్నద్ధంగా మారుతున్నారు. కాస్పరెస్కీ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇంటర్నెట్ యూజర్ల ముంగిట ఉన్న సైబర్ ముప్పు స్థాయి, సన్నద్ధత వంటి అన్ని అంశాలనూ ఇందులో ప్రస్తావించింది.
కొంత నయం
2016 రెండో అర్థ భాగానికి కాస్పరెస్కీ విడుదల చేసిన సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ లో సానుకూల మార్పులు కనిపించాయి.
* సైబర్ నేరగాళ్లకు తాము టార్గెట్ అవుతామని ఏమాత్రం భావించనివారు 74 శాతం మంది ఉన్నారు. ఇంతకుముందు చేపట్టిన సర్వేలో ఇది 79 శాతంగా ఉండేది. అంటే... 5 శాతం మందికి దీనిపై కొంత అవగాహన ఏర్పడినట్లుగా భావించాలి.
* తమ డివైస్ లకు ఎలాంటి సెక్యూరిటీ సాఫ్ట్ వేర్లు వాడనివారు 39 శాతం మంది ఉన్నారు. గత నివేదికలో వీరి శాతం 41గా ఉండేది.
* మాల్ వేర్ బారిన పడినవారు 20 శాతం. ఇంతకుముందు వీరు 22 శాతం ఉండేవారు.
* ఈ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టెక్ వినియోగదారుల్లో సైబర్ సెక్యూరిటీ పట్ల అవగాహన పెరిగిందని కాస్పరెస్కీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.