• తాజా వార్తలు

5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడితే వచ్చే రోగాల లిస్ట్ రెడీ

సాంకేతిక విప్లవ పుణ్యమా అంటూ.. కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు, సెల్ ఫోన్లు.. అదీ స్మార్ట్ ఫోన్లు.. కెమెరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వీటి ఉపయోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అయితే కెమెరాలు అదీ స్మార్ట్ ఫోన్లలో గల కెమెరాలను అత్యధికంగా ఉపయోగించడం ద్వారా కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ పరిశోధకులు కనుకొన్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే ఐదేళ్ల లోపు గల చిన్నారుల్లో కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆందోళన ఇలా ఉంటే సిమోన్ బొలివర్ యూనివర్సిటీకి చెందిన హెల్త్ సైన్సెస్ విభాగం విద్యార్థులు తాజాగాచేసిన ఓ అధ్యయనం ఆందోళనకు గురిచేస్తోంది. 

ఈ అధ్యయనం ప్రకారం రోజుకు 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను వాడితే మనకు ప్రమాదమేనని సైంటిస్టులు చెబుతున్నారు. గుండె జబ్బులు, డయాబెటిస్ తదితర అనారోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. 

సిమోన్ బొలివర్ యూనివర్సిటీకి చెందిన హెల్త్ సైన్సెస్ విభాగం విద్యార్థులు 1060 మందిపై సైంటిస్టులు చేపట్టిన అధ్యయనంలో పై విషయం తేలింది. ఆ విద్యార్థులకు ఉన్న ఆహారపు అలవాట్లు, జబ్బులు తదితర వివరాలను సైంటిస్టులు సేకరించారు. అలాగే వారు నిత్యం ఎన్ని గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతారనే వివరాలను కూడా రాబట్టారు.వారి పరిశోధనలో నిత్యం 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ను వాడే విద్యార్థులు స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని, అదే విద్యార్థినులు అయితే ఆ అవకాశాలు 57.4 శాతం వరకు ఉంటాయని తేల్చారు. 

స్మార్ట్‌ఫోన్ వాడకం నిత్యం 5 గంటలకు మించితే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సదరు సైంటిస్టులు పైన తెలిపిన అధ్యయనం ద్వారా వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థూలకాయం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని, అది మన శరీరానికి ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. కనుక నిత్యం స్మార్ట్‌ఫోన్ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని వారు సూచిస్తున్నారు.
 

జన రంజకమైన వార్తలు