ఆర్నెళ్ల పాటు ఫ్రీగా డేటా, కాల్ ఆఫర్లను ఇచ్చినంతకాలం జియో జియో అన్న వినియోగదారులు మెల్లగా ఇప్పుడు తమ మనసు మార్చుకుంటున్నారు. మొన్న ఏప్రిల్ నుంచి జియో ఫ్రీ సర్వీసులు నిలిపివేసి టారిఫ్ లు ప్రకటించేసరికి చాలామంది చల్లగా జారుకుంటున్నారు. జియో వద్దంటూ తమ పాత సర్వీస్ ప్రొవైడర్ల నంబర్లనే వాడటం మొదలు పెడుతున్నారు. దీన్ని అరికట్టడానికి జియో చాలా ప్రయత్నాలే చేసినా ఇంకా చాలామంది ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీంతో జియోకు భారీ షాకే తగులుతోంది.
సర్వీసు ప్రొవైడర్ల స్పీడ్
జియో ఎప్పుడైతే ఫ్రీ సేవలు ఆపేసి టారిఫ్ లు ప్రకటించిందో మిగతా సర్వీసు ప్రొవైడర్లంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. జియో ఆఫర్లకు సరితూగేలా తామూ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించారు. ఇంకేముంది తమ పాత సర్వీసు ఫ్రొవైడర్లు ఇంక జియో ఎందుకు దండగ అనే అభిప్రాయానికి వినియోగదారులు వస్తున్నారు.
డాటా కస్టమర్ల పునరాలోచన
జియోకు వెళ్లిన తమ ఖాతాదారుల్లో చాలా మంది తిరిగి వెనక్కు వచ్చారని, దీని ప్రభావంతో కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాల నుంచి గట్టెక్కుతామన్న నమ్మకం ఉందని ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా అంచనా వేశారు. చార్జీల వసూళ్లు ప్రారంభించిన తరువాత డేటా కస్టమర్లు జియో నెట్ వర్క్ ను వీడుతున్నారని ఆయన చెప్తున్నారు. తొలి త్రైమాసికంలో రెవెన్యూ వృద్ధిని తాము ముందుగానే ఊహించామని, జనవరి నుంచి మార్చి వరకు వచ్చిన నష్టాల నుంచి ఈ సంవత్సరం 15 శాతం రికవరీ సాధిస్తామని అన్నారు.
లాభాలు తగ్గాయంతే..
కాగా గత సంవత్సరంతో పోలిస్తే టెలికం ఇండస్ట్రీ 14 శాతం వరకూ ఆదాయాన్ని కోల్పోయిందట. జియో గొడుగు కిందకు 7.5 కోట్ల మంది కస్టమర్లు చేరినప్పటికీ ఐడియా వంటి పెద్ద నెట్ వర్కులకు లాభాలు తగ్గాయే కానీ పెద్దగా నష్టాలేమీ రాలేదని తెలుస్తోంది.