• తాజా వార్తలు

వెన్నునొప్పిని కలిగిస్తున్న స్మార్ట్ ఫోన్ ల వాడకం దీనిని తప్పించుకునే మార్గం ఎలా?

కంప్యూటర్ లు, టాబ్లెట్ లు, మొబైల్స్ ల లాంటి టెక్ గాడ్జెట్ లు వాడే వారిలో తరచుగా వినిపించే మాట వెన్ను నొప్పి. అవును ఇది అక్షరాలా నిజం. ఈ టెక్ జీవన విధానంలో స్మార్ట్ ఫోన్ వాడడం ఎంత సాధారణం అయిందో వెన్ను నొప్పుల లాంటి ఆరోగ్య సమస్యలు కూడా అంటే సాధారణం అయ్యాయనేది అందరూ చెబుతున్న మాట. దీనిబారిన పడి ఎంతోమంది ఇరవై లోనే అరవై లాగా తయారుఅవుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అచేతనమైన జీవన విధానాలు, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగం, స్థూల కాయత్వం, కంప్యూటర్ ముందు కూర్చునే విధానం సరిగా లేకపోవడం ఇలా చాలా కారణాలు చెప్పుకోవచ్చు.ఇవన్నీ తీవ్రమైన వెన్నునొప్పికి దారి తీసేవే.

ఈ కారణాలు అన్నింటిలోనూ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ వాడేటపుడు మన శరీర భంగిమలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక్కసారి మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి. స్మార్ట్ ఫోన్ లను వాడుతున్న వారి శరీర భంగిమలు ఎలా ఉన్నాయో పరిశీలించండి. స్మార్ట్ ఫోన్ లను కానీ లేదా ఇతర గాడ్జెట్ లను కానీ వాడుతున్న వారు ఖచ్చితంగా ముందుకు వంగిపోయి కనిపిస్తూ ఉంటారు. వారిచేతిలో ఆ గాడ్జెట్ ఉన్నపుడు ఆటోమాటిక్ గా వారి శరీరం ఆ భంగిమలోనికి వచ్చేస్తుంది. ఇది ఈ వ్యాధిలో ప్రథమ లక్షణం గా విశ్లేషకులు చెబుతున్నారు. ఇది మనలని కోలుకోలేని స్థితికి తీసుకు వెళ్తుందని మీలో ఎంతమందికి తెలుసు? మొదట్లో మెడ నొప్పి గా మొదలవుతుంది ఆ తర్వాతా భుజాల నొప్పులూ, మోచేతి నొప్పులూ ఇలా మన మానసిక ప్రవర్తన పై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మన భావావేశ మరియు హావభావాలను కూడా మార్చివేస్తుంది.

మనిషి యొక్క సగటు తల బరువు 4.5 kg లనుండీ 5.5 kg ల వరకూ ఉంటుంది. మనం తలను తిప్పే కోణం పెరిగేకొద్దీ మెడ కండరాలపై తల కలుగజేసే ఒత్తిడి కూడా పెరుగుతుంది. 15 డిగ్రీ ల కోణం దగ్గర మన తల బరువు 12.2 kg లు ఉంటే, 30 డిగ్రీ ల కోణం వద్ద 18.1 kg లు గానూ, 60 డిగ్రీ ల కోణం వద్ద 27.2 kg లు గానూ ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ వాడేటపుడు మీ తలను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తిప్పుతారో ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి. మీ తలను ముందుకు వంచినపుడు మెడ భాగం, వెన్ను భాగం మరియు భుజాలపై అధిక ఒత్తిడి పడి మీ సాధారణ శరీర నిర్మాణాన్ని డిస్టర్బ్ చేస్తుంది.

దీనికోసం మీరు మీ జీవన విధానాన్ని మరియు మీరు గాడ్జెట్ లు వాడే శైలి నీ మార్చుకోవలసిన అవసరం ఉంది. ఇక్కడ మేము కొన్ని సూచనలు ఇస్తున్నాం. వాటిని తు.చ. తప్పకుండా పాటిస్తే కొంతలో కొంతైనా ఉపశమనం ఉంటుంది.

  1. మీరు ఎక్కువ సేపు కంప్యూటర్ వర్క్ చేయాలిఅనుకుంటే ఆ పనిని కంప్యూటర్ లేదా లాప్ టాప్  పైనే చేయడం ఉత్తమం. పొరపాటున కూడా మొబైల్ లేదా టాబ్లెట్ వాడకుండా ఉంటేనే మంచిది.
  2. మీ తలను కిందకు వంచే బదులు మీ ఫోన్ నే మీ కళ్ళు ఉన్న ఎత్తులో ఉంచండి.
  3. ఎక్కువసమయం పాటు ఒకే భంగిమ లో మీ తలను ఉంచకండి. కొంచెం సేపటికొకసారి నిదానంగా తలను అటూ ఇటూ తిప్పవచ్చు.
  4. మీ శరీరం ఎలా ఉండాలి అనే దాని గురించి ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉండాలి.
  5.  మీ తల నిటారుగా ఉండాలి, మీ చెవులు భుజాలకు సమాంతరంగా ఉండాలి,మీ భుజాలు క్రిందకు ఉండాలి.
  6. మీరు ఫోన్ ను 10 నిమిషాలకు మించి వాడుతున్నట్లయితే వెంటనే ఆపి వేసి ఒక చిన్న వ్యాయామం చేయండి. మీ చెంపలనుండీ మెడ వరకూ మృదువుగా చేతులుతో ఒత్తుతూ,మీ భుజాలను కూడా అలాగే చేయండి. ఇదే స్థితిలో కనీసం 10 సెకండ్ల పాటు ఉండండి. భవిష్యత్ లో వెన్ను నొప్పి రాకుండా ఉండాలంటే ఈ వ్యాయామాన్ని కనీసం రోజుకి 10-15 సార్లు చేయండి.

 

"

జన రంజకమైన వార్తలు