• తాజా వార్తలు

అజ్ఞాతంగా చాట్ చేయ్యాలా? - ఐతే అందుకు టాప్ 5 యాప్స్ ఇవే

 

అజ్ఞాతంగా చాట్ చేయ్యాలా?
ఐతే అందుకు టాప్ 5 యాప్స్ ఇవే

మన జీవితంలో ఎన్నో బాధలు, మరెన్నో ఆనందాలూ ఉంటాయి. వీటితో పాటు మరెన్నో ఆలోచనలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ అందరితో పంచుకోవాలి అని మనకు ఉంటుంది. అయితే మనలో చాలా మందికి మనం ఎవరో తెలియకుండానే, అంటే మన ఐడెంటిటీని వ్యక్తపరచుకుండా ఉంటే అదొక ఆనందంగా ఉంటుంది. మన బాధలు పంచుకుంటే ఊరటగా ఉంటుంది, మన ఆనందాలూ, ఆలోచనలూ పంచుకుంటే సంతృప్తిగా ఉంటుంది. అలాంటి వారికోసమే కొన్ని అజ్ఞాత చాటింగ్ ఫ్లాట్ ఫాంలు సిద్దంగా ఉన్నాయి. మరి వాటిపై ఒక లుక్కేయండి.

1. Whisper

Whisper అత్యంత ప్రాచుర్యం పొందిన అజ్ఞాత చాటింగ్ యాప్. మీ భావాలనూ, మీ ఆలోచనలనూ, మీ రహస్యాలనూ  మీరెవరో వ్యక్త పరచకుండానే ఇక్కడ పోస్ట్ చేయవచ్చు. మీరు చేసే ఈ పోస్ట్లను ఒక చిత్రం మాదిరిగా ఉండేలా ఈ యాప్ అవకాశం కల్పిస్తుంది. కొన్ని పోస్ట్లను లొకేషన్  మరియు టాపిక్ ను బట్టి కూడా మీరు చూడవచ్చు. ఈ యాప్ నుండి వేరే వారికీ మీరు మెసేజ్ కూడా చేయవచ్చు. ఒకే భావాలూ, ఆలోచనలు కలిగిన వారితో స్నేహం కూడా చేయవచ్చు. ఇదంతా మీ ఐడెంటిటీని వ్యక్తపరచకుండానే చేయవచ్చు.

ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు iOS లలో లభిస్తుంది.

2. Candid

ఈ అజ్ఞాత చాట్ లలో Candid ఒక లేటెస్ట్ చాటింగ్ యాప్. గత వారంలో వచ్చిన టాప్ యాప్లలో ఇది ఒకటిగా నిలిచింది, దాని గురించి మన కంప్యూటర్ విజ్ఞానం వెబ్ సైట్లో ప్రచురించడం కూడా జరిగింది. ఇందులో అంతా బాగానే ఉంటుంది కానీ హేట్ స్పీచ్కు ఎక్కువ అవకాశం ఉంటుంది. మామూలు అజ్ఞాత చాటింగ్ యాప్లలో మీ ఎకౌంటుకు ఒక అజ్ఞాత (మారు పేరు) పేరు ఇవ్వబడుతుంది. అదే ఈ యాప్లో అయితే ప్రతీ పోస్ట్కూ ఒక మారు పేరు పెట్టుకునే సౌలభ్యం ఈ యాప్ లో ఉంటుంది. దీనిలో మరొక ముఖ్యమైన అంశం పర్సనలైజ్డ్ కమ్యూనిటీస్. హేట్ స్పీచ్ను అరికట్టడం లో ఇవి ఉపయోగపడతాయి.

3. Dark Chat

పాత ఆన్లైన్ చాట్ రూమ్లలో ఉండే ఒక మోడరన్ అజ్ఞాత చాట్ యాప్ ఈ డార్క్ చాట్. ఈ డార్క్ చాట్ లో మీ గోప్యత అనేది 100 శాతం సురక్షం గా ఉండకపోవచ్చు. దీని డెవలపర్స్ దీనిని controlled anonymity అని అంటారు. అంటే మీ గోప్యత నియంత్రణలో ఉంటుంది అన్నమాట. ఈ డార్క్ చాట్లో మీతో చాట్ చేసే వారి గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికి వారి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. మీరు ఒక వ్యక్తీతో గానీ లేదా ఒక గ్రూప్తో కానీ ఒకేసారి చాట్ చేయవచ్చు. కొన్ని రహస్య పోస్ట్లను చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది.

4. Posyt

సరైన వ్యక్తులను సరైన సమయంలో కలుసుకునే వీలు కల్పించే యాప్గా ఇది డిజైన్ చేయబడింది. మీ ఆలోచనలనూ, అభిప్రాయాలనూ మీరు పోస్ట్ చేయవచ్చు. మీ ఆలోచనలకూ అభిప్రాయాలకూ తగిన వ్యక్తులకు మీ పోస్ట్లు చేరేవిధంగా ఈ యాప్ డిజైన్ చేయబడింది. దీని గురించి దీని డెవలపర్స్ యొక్క మాటల్లో చెప్పాలంటే “ఎవరు ఆలోచిస్తున్నారు, ఏమి ఆలోచిస్తున్నారు, ఎప్పుడు ఆలోచిస్తున్నారు" అనే ప్రామాణికతలపై ఆధారపడి ఇది పని చేస్తుంది. మీరు కానీ వేరే వాళ్ళుకానీ గతంలో చేసిన పోస్ట్లను పునరావలోకనం చేసుకుని మీ అభిప్రాయాలకు దగ్గరగా ఉండే వారితో మీరు స్నేహం చేయవచ్చు.

5. Truth

ఇదొక ఫన్నీ యాప్. ఇప్పటివరకూ మనం చర్చించిన అన్నింటి మాదిరి గానే ఇది కూడా ఒక అజ్ఞాత చాటింగ్ యాప్. మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్న అందరికీ మీరు మెసేజ్ చేయవచ్చు, చాటింగ్ చేయవచ్చు. మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది కానీ మీరు మీరేనని మాత్రం వారికి తెలియదు.

ఇది ప్రస్తుతం iOS లో మాత్రమే లభిస్తుంది, అతి త్వరలోనే ఆండ్రాయిడ్ లో కూడా దీనిని తెచ్చే యోచనలో డెవలపర్స్ ఉన్నారు.

 

 

జన రంజకమైన వార్తలు