• తాజా వార్తలు

సెల్ఫీలు అద్భుతంగా రావాలంటే 7 ట్రిక్స్ మీకోసం...

సెల్ఫీలు అద్భుతంగా రావాలంటే 7 ట్రిక్స్ మీకోసం...

ఒక దశాబ్దం క్రితం ఫోటో దిగాలంటే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు పరిస్థితి ఏమిటి? స్మార్ట్ ఫోన్ ల దెబ్బకి చిన్న చిన్నపట్టణాలు మరియు గ్రామాలలో ఉండే చిన్న సైజు ఫోటో స్టూడియోలు కొన్ని వేల సంఖ్యలో మూత పడ్డాయి.అంటే ఈ స్మార్ట్ ఫోన్ లు మానవ జీవన విధానాలను ఏరకంగా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవచ్చు. అది సరే ఇప్పుడు నడుస్తున్న లేటెస్ట్ ట్రెండ్ సెల్ఫీ. అంటే ఎవడి ఫోటో వాడే తీసుకోవడం అన్నమాట.

సెల్ఫీ తీసుకుంటూ ప్రమాద వశాత్తూ ప్రాణాలు కోల్పోవడం లాంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం, మన వెబ్ సైట్ లో కూడా వీటిపై ఇంతకు ముందే ఒక ఆర్టికల్ కూడా ప్రచురించడం జరిగింది. ఆ మధ్య సెల్ఫీ రాజా పేరుతో తెలుగు లో ఒక సినిమా కూడా వచ్చింది. మనం ఎక్కడైనా ట్రాఫిక్ లో ఆగిపోతే మన వాహనం దగ్గరకు వచ్చి మరీ సెల్ఫీ స్టిక్ లను అమ్ముతున్న వారినీ చూస్తున్నాం.

ఇవన్నీ సెల్ఫీ యొక్క క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి అన్నట్లు ఈ సెల్ఫీలు తీయడం లో కూడా కొంచెం కళాపోషణ ఉండాలి. అంటే మీరేమీ కళాకారులు అవ్వవలసిన అవసరం లేదు కానీ సెల్ఫీల ద్వారా వచ్చే ఫోటోలు నాణ్యంగా ఉండడానికి మేము కొన్ని చిట్కాలను అందిస్తున్నాం, మీరు సెల్ఫీ ప్రియులైతే అందుకోండి మరి. సెల్ఫీ లకు మాత్రమే గాక మామూలు ఫోటోలకు కూడా ఈ చిట్కాలు వర్తిస్తాయి.

1. గ్రిడ్ లైన్స్ కు స్విచ్ ఆన్ అవ్వండి

మీ ఫోన్ కెమెరా ద్వారా తీసే ఫోటోలు నాణ్యంగా ఉండాలంటే మీ ఫోన్ కెమెరా లో ఉన్న గ్రిడ్ లైన్స్ ఆప్షన్ ను ఆన్ చేయండి. ఇది మంచి ఫోటో షాట్ కి సెట్ అప్ ను ఏర్పరుస్తుంది. సంప్రదాయక ఫోటోగ్రఫి లో ఉండే రూల్ అఫ్ థర్డ్ అనే నియమం పై ఆధారపడి పనిచేస్తుంది. మనం తీయబోయే షాట్ ను ఫ్రేం చేసుకుని మంచి ఫోటోని తీయడం లో ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనివలన ఫోటో ను చూస్తునపుడు చాలా సహజం గా కనిపిస్తుంది.

మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ముందు మెనూ బటన్ ను టాప్ చేయాలి.అక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుంటే వ్యూ ఫైండర్ కనిపిస్తుంది. దానిలో షో గ్రిడ్ అనే ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవడం ద్వారా ఈ ఆప్షన్ కు స్విచ్ ఆన్ అవ్వవచ్చు.

మీది ఐ ఫోన్ అయితే ఫన్ సెట్టింగ్ లలో ఫోటోస్ ని క్లిక్ చేయాలి. అక్కడ ఉండే కెమెరా ఆప్షన్ లో గ్రిడ్ ను ఆన్ చేసుకోవచ్చు.

2. సెల్ఫీ స్టిక్ ను కానీ స్టడీ సపోర్ట్ ను కానీ ఉపయోగించడం

ఫోటో లు తీసేటపుడు గుర్తు ఉంచుకోవలసిన విషయం అవి నీట్ గా ఉండాలి, మసకమసక గా ఉండకూడదు. మన చేతులతో తీసేటపుడు చేతులు వణకడం లేదా ఫోన్ వణకడం ద్వారా ఫోటో లు మసక గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫోటో లు తీసేటపుడు సెల్ఫీ స్టిక్ లాంటి స్టడీ గా ఉండే పరికరాలను వాడడం మంచిది. మొబైల్ ట్రై పోడ్, లేదా ఒక కార్డు బోర్డు, టేబుల్, లేదా సెల్ఫీ స్టిక్ ఇలా ఏదైనా మీ ఫోన్ ను స్టడీ గా ఉంచే వస్తువును ఎంచుకోవడం ద్వారా మీ సెల్ఫీ లను మరింత నాణ్యంగా తీయవచ్చు. వీటి వల్ల మీ ఫోన్ ఫోకస్ ను కోల్పోకుండా ఉండడమే గాక కెమెరా యొక్క లెన్స్ సరైన కాంతిని పొందుతాయి. మరింత క్వాలిటీ కావాలంటే సెల్ఫ్ టైమర్ ను ఆన్ చేసుకోవచ్చు.

3. జూమింగ్ బదులు క్రాపింగ్ వాడండి.

మీకు ఒక అందమైన దృశ్యం కనపడింది. వెంటనే మీ ఫోన్ లో బందించాలి అనుకున్నారు కానీ అది చాలా దూరం లో ఉంది. అప్పుడు ఏమి చేస్తారు? మీ కెమెరా లో జూమ్ ను ఆన్ చేసి ఆ దృశ్యాన్ని కెమెరా లో బందిస్తారు. కానీ ఇది చాలా తప్పు అని విశ్లేషకులు చెబుతున్నారు. జూమ్ చేసి ఫోటో లు తీసే బదులు మామూలు గా తీసి దానిని మీ ఫోన్ లో ఉండే ఎడిట్ సెట్టింగ్ లలో క్రాప్ చేసుకోవడమే ఉత్తమం. జూమ్ చేసినపుడు ఫోటో మసక గా కనిపించడం తో పాటు మనం కోరుకున్న నాణ్యత లభించదు.

4. షటర్ బటన్ లకు బదులు వాల్యూం బటన్ లను వాడండి.

సాధారణంగా ఫోన్ లతో ఫోటోలు తీసేటపుడు మధ్యలో ఉండే షటర్ బటన్ నే వాడుతాము. దీనివలన ఫోన్ వణకడం తద్వారా నాసిరకమైన ఫోటో లు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా షటర్ బటన్ కు బదులుగా వాల్యూం బటన్ లను ఉపయోగించినట్లయితే ఈ సమస్య ఉత్పన్నం కాదు. ఎందుకంటే అవి ఒక పక్కకు ఉంటాయి కాబట్టి ఫోటో తీయడానికి అనువుగా ఉంటాయి. ఈ మధ్య లభిస్తున్న దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్ లలోనూ ఈ  బటన్ లను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది.

5. ఫోటో తీసేటపుడు లెన్స్ క్లీన్ చేయండి.

వినడానికి వింతగా ఉన్నా ఇది ఒక మంచి సలహా. చాలా మంది ఫోటో లు తీసేటపుడు లెన్స్ క్లీన్ చేయడం మరచిపోతూ ఉంటారు. దీనివలన ఫోటో లు అంత నాణ్యం గా ఉండవు. మన ఫోన్ లను జేబులో కానీ, బాగ్ లో కానీ, పౌచ్ లో కానే ఉంచేటపుడు అక్కడ ఉన్న దుమ్ము ధూళి లాంటివి కెమెరా లెన్స్ కి అంటుకునే అవకాశం ఉంది కాబట్టి ఫోటో తీసేముందు లెన్స్ క్లీన్ చేయడం ఎందుకైనా మంచిది.

6. HDR మోడ్ ను డిఫాల్ట్  గా ఉంచుకోండి.

స్మార్ట్ ఫోన్ లలో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ HDR మోడ్. హై డైనమిక్ రేంజ్ ఫిల్టర్  అని దీనిని పిలుస్తారు. డార్క్ మరియు లైట్ వస్తువుల మధ్య సమతుల్యాన్ని పాటించడానికి తద్వారా అద్భుతమైన  క్వాలిటీ ని ఇవ్వడానికీ ఈ HDR మోడ్ ను మీ కెమెరా లో ఆటోమాటిక్ గా ఉంచడం మంచిది. దానివలన మీకు కావలసిన ఇమేజ్ యొక్క కాంతి ఆటోమాటిక్ గా సెట్ చేయబడుతుంది. కాబట్టి ఇక ఎక్కువ వెలుతురు, చీకటి మీ ఫోటో లను ఏమీ చేయలేవు.

7. ఫోటో లను బరస్ట్ మోడ్ లో క్లిక్ చేయండి.

ఈ మధ్య వస్తున్న ప్రతీ స్మార్ట్ ఫోన్ ఇన్ బిల్ట్ బరస్ట్ మోడ్ లో లభిస్తున్నాయి. తక్కువ క్వ్లైతి ఇమేజ్ లను ఈ బరస్ట్ మోడ్ లో క్లిక్ చేయడం ద్వారా అద్భుతమైన నాణ్యతను పొందవచ్చు. ఈ మోడ్ లో మీరు ఒక్కసారి క్లిక్ చేయడం ద్వారా  వరుసగా అనేక ఇమేజ్ లను పొందుతారు. వాటిలో మంచి క్వాలిటీ తో ఉండే ఇమేజ్ ను చూసి దానిని సెలెక్ట్ చేసుకోవచ్చు.  

 

జన రంజకమైన వార్తలు