ఫేస్‌బుక్ గురించి తెలియని వారు ఉండరు. తక్కువ కాలంలో దీనంత వేగంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయిన ప్రచార మాధ్యమం మరొకటి ఉండదేమో! ముఖ్యంగా భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగదారులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఫేస్‌బుక్ డెవలెప్‌మెంట్‌కు భారత్ ఎంతో అనుకూలంగా ఉందని, ఇక్కడ వినియోగదారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల భారత పర్యటనలో వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఫేస్‌బుక్ అంటే సమాచారాన్ని షేర్ చేయడం లేక ఫొటోలు పోస్ట్ చేయడం లాంటివే ఎక్కువగా ఉండేవి. లేకపోతే చాటింగ్ మీద యువత ఎక్కువగా దృష్టి పెట్టేవాళ్లు. కానీ నెమ్మదిగా ట్రెండ్ మారుతో్ంది. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వీడియోల ట్రెండ్ నడుస్తోంది. టన్నుల కొద్దీ మేటర్‌ను పోస్ట్ చేయడం కంటే ఒకే ఒక్క వీడియోతో ఎక్కువమందిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీడియోల ద్వారా చైతన్యం తేవడానికి కూడా యువత ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఉద్యమాల సమయంలో ఈ వీడియో ప్రచారం ఎంతో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా మొబైల్ వీడియోలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. వీటిలో యూత్‌ను ఆకట్టుకునే సరదా వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. జోకులు, షార్ట్ ఫిలిమ్స్, సందేశాత్మక చిత్రాలు ఈ వీడియోల్లో ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఉదాహరణకు అత్తా-కోడళ్ల మధ్య సంఘర్షణ గురించి తెలిపే యోధ అనే వీడియో ఒకటి ఈ మధ్య ఫేస్‌బుక్‌లో వైరల్ అయింది. ఇది శాంపిల్ మాత్రమే ఇలాంటి వీడియోలు రోజుకొకటి విపరీతంగా షేర్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్ల వీడియోలు రోజూ ఫేస్‌బుక్‌లో షేర్ అవుతన్నాయని అంచనా. ప్రతిరోజూ 500 మిలియన్ యూజర్లు ఫేస్‌బుక్‌లో వీడియోలు తిలకిస్తున్నారు. తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి కూడా వీడియోలను ఒక వేదికగా చేసుకుంటున్నారు కొంతమంది యూజర్లు. కొన్ని కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎఫ్‌బీలో వీడియోలను ఉంచుతోంది. టెవిలిజన్లలో వచ్చే యాడ్‌ల కంటే ఫేస్‌బుక్‌లో ఉంచుతున్న ఇలాంటి వీడియోల ద్వారానే కంపెనీలకు ఎక్కువ ప్రచారం వస్తుందట. భారత్‌లో వీడియో ప్రచారానికి ఉన్న ఆసక్తిని గుర్తించి ఫేస్‌బుక్ కూడా అలాంటి వారిని ప్రోత్సహించడానికి ముందడుగు వేస్తోంది. అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి ఎఫ్‌బీ స్టార్ట్స్ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. దీని ద్వారా వీలైనంత ఎక్కువమంది వివిధ రంగాల్లో కావాల్సిన సకారం అందిస్తామని ఫేస్‌బుక్ ఇండియా ఎండీ కృతిగరెడ్డి చెప్పారు. |