• తాజా వార్తలు

ఫేస్ బుక్, ట్విట్టర్ లలో వచ్చే వార్తలు ఎంతవరకు నమ్మదగినవి?

 

ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలు లాంచ్ అయిన మొదటి రోజుల్లో స్నేహితులను, బంధువులను మరియు ప్రపంచం లో తమ లాంటి  భావాలు కల మరికొంత వ్యక్తులతో  కనెక్ట్ అయి ఉండడానికే ఉపయోగించేవారు. మొదట్లో టెక్స్ట్, ఫోటో లు, మరియు హైపర్ లింక్ లను షేర్ చేయడానికి ఒక ఆప్షన్ ఉండేది. ఆ తర్వాత ఫేస్ బుక్ న్యూస్ ఫీడ్ ను లాంచ్ చేసింది. దీనిద్వారా పెద్ద పెద్ద పిక్చర్ లు కూడా మీ టైం లైన్ లో షేర్ చేయబడతాయి. ఆ తర్వాత ఫేస్ బుక్ లో వీడియో క్లిప్ లు, యానిమేటెడ్ GIF లు, హైపర్ లింక్స్, లాంటివి షేర్ చేయగల ఆప్షన్ లను కూడా కల్పించింది.

ఏది ఏమైనప్పటికీ ఈ న్యూస్ ఫీడ్ అనేది టీవీ లా ఉంటూ టీవీ లో ఉండే కాంటెంట్ తరహా సమాచారాన్ని ఇస్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో ప్రముఖమైనది గా ఫేస్ బుక్ ను నిలబెట్టింది. ట్విట్టర్ కూడా లైవ్ స్ట్రీమింగ్ హబ్ లా మారాలి అనే తాపత్రయం తో టీవీ తరహా సమాచారాన్ని మరియు స్పోర్ట్స్ ను కలిపి అందిస్తుంది. అయితే న్యూస్ విషయానికొచ్చే సరికి ఈ రెండు ఫ్లాట్ ఫాం లు ఏమంత నమ్మదగినవి గా ఉండడం లేదనేది వాస్తవం.

ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లు రెండూ సోషల్ మీడియా కు తక్కువ టీవీ లకు ఎక్కువ అన్నట్లుగా తయారు అయ్యాయి.వినియోగించడానికి సులువుగా ఉండే వీడియో లు మరియు క్లిప్పింగ్ లపైనే ఈ రెండూ ఎక్కువగా దృష్టి పెట్టాయి.

ఫేస్ బుక్ లాంచ్ అయిన 2004 వ సంవత్సరం నుండీ దీని పోకడలను నిశితంగా పరిశీలిస్తున్న ఇరాన్ కు చెందిన హోసీన్ దరేక్షన్ అనే ఒక టెక్ బ్లాగర్ ఫేస్ బుక్ యొక్క ప్రస్తానం మరియు పోకడలపై సునిశిత వ్యాఖ్య లు చేశారు. అవేంటో చూద్దాం.

“ ఫేస్ బుక్ క్రమంగా హైపర్ లింక్ ను క్షీణింపజేస్తూ వెబ్ ను ఓపెన్ చేస్తుంది. టెక్స్ట్ కు తక్కువ ప్రాధాన్యం ఇస్తూ టీవీ తరహా కాంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ను ఇస్తుంది. టీవీ తరహా కాంటెంట్ తో వచ్చే సమస్య ఏమిటంటే ఇందులో సమాచారం కంటే ఎమోషన్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వీక్షకుల ఫీలింగ్ లతో ఆడుకోవడం అనే ప్రక్రియ టీవీ లో నిరంతరo జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ లో వాస్తవాల కంటే అవాస్తవాలకూ మరియు తప్పుడు సమాచారానికే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కొంతమంది నిపుణుల ప్రకారం ఇలాంటి కాంటెంట్ వలన ఇన్ఫర్మేషన్ తప్పు దోవ పట్టే అవకాశం ఉంది, అదియునూ గాక మనకు ఏమీ తెలియక పోయినా ఏదో తెలుసు అనే భ్రమ ను ఇలాంటి సమాచారం మనకు కల్పిస్తుంది.”

సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లు కూడా ఈ తరహా సమాచారాన్ని ఇవ్వడం వలన ఇది సోషల్ మీడియా  నా లేక ఎమోషనల్ మీడియా నా అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ షేర్ లేదా పోస్ట్ అయ్యే విషయాలన్నీ ఒక దృఢమైన ఎమోషనల్ ఫీలింగ్ తో చేసేవే. ఆ ఫీలింగ్ అనేది ఇష్టం కావచ్చు, భయం కావచ్చు, లేదా అసహ్యం ఇలా ఏదైనా కావచ్చు. ఇలా ఎమోషనల్ గా అటాచ్ అయి మాత్రమే ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్న వారు ఇప్పుడు దాదాపు 90 శాతం మంది.

మరొక ప్రక్క సామాజిక వేత్తలు ఈ ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లను మరొక కోణం లో చూస్తున్నారు.ఇవి ప్రజలను తామొక కుటుంబం లోనో లేక సమాజం లోనో సభ్యులము కాకుండా ఒక ప్రత్యేక మైన గ్రూప్ లో సభ్యులము అనే భావనను కలిగిస్తున్నాయి.ఈ తరహా భావనలు సమాజం లో విపరీత పరిణామాలకు దారితీస్తాయి.

ఇదంతా ఆదాయం కోసమే ఇవి చేస్తున్నాయని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఈ రంగం లో ఇప్పటికే అనేక మీడియా సంస్థ లు వచ్చి వీక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ, వారి ఎమోషన్ లతో ఆడుకుంటూ తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అదే బాటలో నడుస్తుంది. ఈ పోకడలు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి.

జన రంజకమైన వార్తలు