ప్రపంచంలో ఫేస్‌బుక్‌ను ఉపయోగించే దేశాల్లో భారత్ ముందుంటుంది. ఇక్కడ తమకు కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ఇటీవలే భారత్ పర్యటనకు వచ్చిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో భారత్‌లోని వినియోగదారులను మరింత ఎక్కువగా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందీ ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్. సాధారణంగా ఫేస్‌బుక్‌లో చాట్ చేయాలంటే ఇంగ్లిష్ భాష తప్ప వేరే భాషలో చేయడం కష్టం. ఫేస్‌బుక్‌లో పోస్టుల్లో కామెంట్లను మన స్థానిక భాషలో చేయచ్చేమో కానీ... చాటింగ్ మాత్రం కచ్చితంగా ఇంగ్లిష్‌లోనే చేయాల్సి ఉంటుంది. ఒక వేళ కామెంట్లు, చాటింగ్ చేయాల్సి వచ్చినా అందరికి స్థానిక భాషలను ఫేస్‌బుక్‌లో ఎలా ఉపయోగించాలో తెలియదు. ఈ నేపథ్యంలో ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ భారత్‌లో ప్రధాన భాష అయిన హిందీలో ఇకపై సందేశాలు పంపుకునేలా ఫేస్‌బుక్ కొత్త యాప్‌ను రూపొందించింది. ఫేస్‌బుక్ తయారు చేసిన ఈ కొత్త టూల్‌తో ఇక సులభంగా హిందీలో సందేశాలు పంపుకోవడం, చాటింగ్ చేయడం చేయచ్చట. ఐతే ప్రస్తుతానికి ఈ ఆప్షన్ కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే లభ్యం అవుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫేస్‌బుక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడే లైట్ వెయిట్ హిందీ ఎడిటర్ కూడా డౌన్‌లోడ్ అయిపోతుంది. ఫేస్‌బుక్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మెసేజింగ్ బార్ దగ్గర హిందీ ఆప్షన్ బటన్ కూడా కనబడుతుంది. దీంతో సులభంగా హిందీలో టైప్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన ఇంగ్లిష్‌లో టైప్ చేసినా ఈ ఆప్షన్ వెంటనే దాన్ని దేవనగరి లిపిలోకి మారుస్తుంది. ప్రయోగాత్మకంగా ఈ హిందీ బటన్‌ను ఫేస్‌బుక్‌కు యాడ్ చేసినట్లు.. త్వరలో మరిన్ని భాషల్లో బటన్‌లు యాడ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. రోమన్ క్యారెక్టర్లను దేవనగరి లిపిలో మార్చడానికి హిందీ ఆప్షన్ బటన్ బాగా ఉపయోగపడుతుందని, వినియోగదారుల నుంచి మరిన్ని సలహాలు తీసుకుని ఈ బటన్‌ను మరింత మెరుగ్గా రూపొందిస్తామని ఎఫ్‌బీ తెలిపింది. లేటెస్ట్ వెర్షన్ ఫేస్‌బుక్ యాప్‌లో ఈ హిందీ టూల్ లభ్యం అవుతుందని... ఆండ్రాయిడ్ వాడుతున్న వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించొచ్చని ఫేస్‌బుక్ తెలిపింది. |