• తాజా వార్తలు

వాట్సాప్ మెసేజ్.. మూడో మనిషికి తెలీకుండా ఫుల్లీ ప్రొటెక్టెడ్...

సుమారు 100 కోట్ల మందికి పైగా యూజర్ల బలగంతో ఇన్ స్టంట్ మెసేజింగ్ సేవలందిస్తున్న వాట్సాప్ ఇప్పుడు పూర్తిగా సురక్షితమైపోయింది. ఆండ్రాయిడ్, ఐఫోన్, బ్లాక్ బెర్రీ ప్లాట్ ఫాంలపై వాట్సాప్ ను పూర్తి ఎన్ క్రిప్టు చేశామని... ఇక ఎవరు ఏం మెసేజ్ లు పంపుకున్నా మరొకరికి తెలిసే అవకాశాలు లేవని వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ వెల్లడించారు.  తాజాగా ఆ యాప్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఇవ్వడంతో అది శత్రు దుర్భేద్యంగా మారిందని చెప్పొచ్చు. అంటే వాట్సాప్ ద్వారా వెళ్లే మెసేజ్‌లు, కాల్సు, వీడియోలు, ఫోటోలను ఎవ్వరూ ఛేదించలేరు. సెండర్ నుంచి వెళ్లిన మెసేజ్‌ను కేవలం రిసీవర్ మాత్రం చూడగలరు. నేరస్థులు కానీ, ప్రభుత్వాధికారులు కానీ, హ్యాకర్లు కానీ ఎవ్వరూ ఆ మెసేజ్‌లను అక్రమంగా చూసే ప్రసక్తే లేదు. ప్రస్తుతం వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే తాజా ఎన్‌స్క్రిప్షన్ అన్ని ఫోన్లకు వర్తిస్తుందన్నారు. ఐఫోన్, ఆండ్రాయిడ్, విండోస్, బ్లాక్‌బెర్రీ, నోకియా ఫోన్ ఏదైనా మెసేజ్‌లను అక్రమంగా చూడడం సాధ్యం కాదు. తాజాగా అప్‌లోడ్ చేసుకున్న వాట్సాప్ యాప్‌లకే ఇది వర్తిస్తుంది.

వాట్సాప్‌ను ప్రస్తుతం ఫేస్‌బుక్ సంస్థ నడుపుతోంది. కానీ దాని అసలు వ్యవస్థాపకులు జాన్ కౌమ్, బ్రియాన్ అక్టన్‌లు ఎన్‌స్క్రిప్షన్ కోసం తీవ్ర కసరత్తులు చేశారు. వాట్సాప్ ఎన్‌స్క్రిప్షన్ కోసం మరో వ్యక్తి ఆ ఇద్దరికీ సహకరించాడు. మాక్సీ మార్లిన్ స్పైక్ అనే క్రిప్టోగ్రాఫర్ ఎన్‌స్క్రిప్షన్ టెక్నాలజీని డెవలప్ చేశారు. ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ వల్ల శత్రువులెవరూ మెసేజ్‌లను అక్రమంగా చదవలేరు. ఒకవేళ ఆ మెసేజ్‌లను చూడాలనుకున్నా ఆ అక్షరాలు చదవలేని భాషలో కనిపిస్తాయి. మీ వాట్సాప్ మెసేజ్‌లను మూడో వ్యక్తి ఎవరైనా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాదు. అంతే కాదు మూడో వ్యక్తి చేస్తున్న చొరబాటు ప్రయత్నాలు మీకు తెలిసిపోతాయి. సెండర్, రిసీవర్ మధ్య మూడో వ్యక్తి హ్యాకింగ్‌కు ప్రయత్నిస్తే దాన్ని యూజర్‌కు కూడా పసిగట్టవచ్చు. ఈ రకంగా సకల జాగ్రత్తలతో దాన్ని డెవలప్ చేశారు.

ఇటీవల యాపిల్ సంస్థకు, ఎఫ్‌బీఐకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఓ నేరస్థుడి ఐఫోన్‌ను తెరిచేందుకు యాపిల్ సహాయాన్ని ఎఫ్‌బీఐ కోరింది. కానీ యూజర్ల డేటాకు భంగం కల్పించరాదన్న ఉద్దేశంతోనే యాపిల్ సంస్థ ఎఫ్‌బీఐ అభ్యర్థనను తోసిపుచ్చింది. అంతే కాదు, యాపిల్ ఫోన్లకు ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ కూడా కల్పించింది. దీని వల్ల ఆ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని మరెవ్వరూ చూడలేరు. అలాగే వాట్సాప్ ద్వారా వెల్లే మెసేజ్, ఫోన్ కాల్సు, ఫోటోలు, వీడియోలను ఎవరూ చేధించలేరు. వాట్సాప్ ఉద్యోగులకు కూడా అది సాధ్యంకాదట. ప్రభుత్వ నిఘా వ్యవస్థులు కూడా ఆ ఎన్‌స్క్రిప్షన్‌ను ఏమీ చేయలేవు. ఆ రకంగా కంప్లీట్ ప్రొటెక్షన్లోకి తీసుకొచ్చారు.  వివిధ కేసులను పరిష్కరించే క్రమంలో పలు దేశాల విచారణ సంఘాలు, సామాజిక మాధ్యమాల్లో పంచుకునే మెసేజ్ లకు యాక్సెస్ ఇవ్వాలని టెక్ దిగ్గజాలను కోరుతున్న సంగతి తెలిసిందే. కంపెనీలు మాత్రం కస్టమర్ల ప్రైవసీనే తమకు ముఖ్యమంటున్నాయి.  తాజా పరిణామం దాన్ని మరోసారి నిరూపించింది.

 

జన రంజకమైన వార్తలు