ఫేస్ బుక్, వాట్స్ యాప్, ట్విట్టర్ అంటూ సామాజిక మాధ్యమాలు జీవితాల్లోకి చొచ్చుకొచ్చేశాయి. నిద్రాదేవికి నిత్య ఆటంకాలు సృష్టిస్తున్నాయి. రాత్రి 8 గంటలకు భోజనం ముగించి గంటో గంటన్నర టీవీ చూసి రాత్రి 10 గంటలకల్లా పడుకుని మళ్లీ పొద్దున్నే 6 గంటలకు నిద్రలేచే అలవాటున్న బుద్ధిమంతులను కూడా దారిత ప్పేలా చేస్తున్నాయి. రాత్రి 12.. ఒంటిగంట.. రెండు..మూడు వరకు నిద్రపోకుండా చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్నవారిలో యువతే కాదు అన్ని వయసుల వారూ ఉంటున్నారు. వారు నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్నా, బాత్రూంకి వెళ్లినా, బోర్డు మీటింగుకు వెళ్లినా క్షణం కూడా ఫోన్ వదలకుండా సోషల్ మీడియా అప్ డేట్స్ చెక్ చేస్తూనే ఉంటున్నారట. అక్కడితో ఆగకుండా రాత్రి పడుకోవాల్సిన సమయంలోనూ స్మార్ట్ ఫోన్లకే కళ్లప్పగించేసి నిద్రపోవడం మానేస్తున్నారట. దీన్నే డిలేడ్ స్లీప్ ఫేజ్ సిండ్రోమ్ అంటున్నారు బెంగుళూరులో నిమ్ హాన్స్ కు చెందిన నిపుణులు. ఇప్పుడిది చాలామందిలో ఉందని.. దీనివల్ల అనేక సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని చెబుతున్నారు.
బెంగుళూరు నిమ్ హాన్స్ కు చెందిన సర్వీసెస్ ఆఫ్ హెల్దీ టెక్నాలజీ యూసేజ్ సంస్థ 250 మందితో ఒక అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో ప్రస్తుతం సమాజంలో సామాజిక మాధ్యమాలు ఎంతటి అలజడి రేపుతున్నాయన్నది తేలింది.
సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారినవారు సగటున గంటన్నర ఆలస్యంగా నిద్రపోతున్నారట. దానివల్ల స్లీప్ ప్యాటర్న్స్, స్లీప్ సైకిల్ అస్తవ్యస్తమవుతున్నట్లు గుర్తించారు. పడుకునేందుకు బెడ్ పై చేరిన తరువాత కూడా కనీసం నాలుగు సార్లు స్మార్ట్ ఫోన్ కానీ ట్యాబ్లెట్ కానీ తీసి చూస్తున్నారని.. ఫేస్ బుక్ లో కొత్త అప్ డేట్స్ ఏమైనా వచ్చాయా.. తాము పెట్టే పోస్లింగులకు ఎవరైనా లైక్ కొట్టారా.. ఏమైనా కామెంట్ పెట్టారా అని చెక్ చేసుకుంటున్నారట. వాట్స్ యాప్ లో వచ్చే సందేశాలను ఒక్కటి కూడా మిస్సవ్వకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ చాలా ఆలస్యంగా నిద్రపోతున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది.
ఇలా సోషల్ మీడియాకు అడిక్టయినవారిలో వాట్స్ యాప్ ను ఉపయోగిస్తున్నవారు 58 శాతం ఉండగా, ఫేస్ బుక్ వాడుతున్నవారు 32 శాతం ఉంటున్నారని నిమ్ హాన్స్ రీసెర్చి బయటపెట్టింది. అంతేకాదు.. 42 శాతం మంది సోషల్ మీడియా, ఇంటర్నెట్ కోసం తాము చేయాల్సిన పనులను కూడా వాయిదా వేసుకుంటున్నారని సర్వేలో గుర్తించారు.
ఈ డిలేడ్ స్లీప్ ఫేజ్ సిండ్రోమ్ కారణంగా మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని, విపరీతమైన ప్రెజర్, టెన్షన్ కు లోనవ్వడానికి ఇది కారణమవుతుంది. అంతేకాదు.. సరైన సమయానికి నిద్రపోకపోవడం.. తగినంత నిద్రలేకపోవడం వల్ల నిద్రలేమి కారణంగా వచ్చే అన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటికి తోడు అదనంగా మరిన్ని కొత్త సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. నిత్యం డిజిటల్ పరికరాలను చూస్తుండడం వల్ల కళ్లు విపరీతంగా స్ర్టెయిన్ అవుతాయి. అది కంటి సమస్యలకు, చివరకు దృష్టి లోపానికి కూడా దారి తీయొచ్చు.