ఫలానా కులం వాళ్లకు సంబంధాలు చూస్తాం.. ఫలానా మతం వాళ్లకు సంబంధాలు చూస్తామని మ్యారేజ్ వెబ్‌సైట్లు ప్రచారం చూశాం. ఫలానా ప్రాంతం వాళ్లకు పెళ్లిళ్లు కుదుర్చుతాం అని కూడా ఆ మధ్య కొన్ని సంస్థలు హడావుడి చేశాయి. వీటన్నింటినీ దాటేసి మరో అడుగు ముందుకేసింది ఢిల్లీలోని ఓ మాట్రిమోనీ సంస్థ. ఐఐటీ, ఐఐఎంల వంటి అత్యున్నత విద్యాసంస్థల్లో చదువుకున్నవారికి మ్యాచెస్ చూస్తామని పబ్లిసిటీ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. దానికి పేరు కూడా ఐఐటీఐఐఎంషాదీ. కామ్ అని వెరైటీగానే పెట్టింది. అంటే అక్కడ జాతకాల కంటే ముందు మీరు ఎంత గొప్ప సంస్థలో చదువుకున్నారు. మీ మార్కులు, డిగ్రీలు ముందు చూస్తారన్నమాట.
ఆయుషీ ఆగర్వాల్ ఇండియాలో టాప్ మోస్ట్ న్యాయ విద్యా సంస్థ నుంచి డిగ్రీ సాధించింది. సాధారణ మాట్రిమోనీ సైట్లలో వెతికినా తగిన వరుడు కనపడలేదు. పేరెంట్స్‌కు చెప్పకుండానే ఐఐటీఐఐఎంషాదీ. కామ్ లో పేరు రిజిస్టర్ చేసుకుంది. నెల తిరక్కుండానే మరో పేరు మోసిన సంస్థలో చదువుకున్న కుమార్ అంకిత్ అనే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ సంబంధం దొరికింది. ఓకే అయ్యింది. 2015లో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ముందు మా మైండ్‌సెట్స్ మ్యాచ్ అవుతాయో లేదో చూసుకున్నాం.. ఆ తర్వాతే మనసులు కలవడం గురించి ఆలోచించాం అని ఆయుషీ చెప్పంది. ఐఐటీఐఐఎంషాదీ. కామ్ మాట్రిమోనీ ద్వారా పెళ్లి చేసుకున్న తొలి వ్యక్తి ఆమే.
ఎప్పుడు మొదలైంది?
తక్ష్‌గుప్తా 2014లో ఐఐటీఐఐఎంషాదీ. కామ్ ను ప్రారంభించారు. కులం, మతం వంటివాటి కంటే వారిద్దరూ ఒకరితో ఒకరు మానసికంగా సర్దుకుపోగలరా లేదా అనేది కూడా చూడాలి. ఒకరి అభిప్రాయాలు, ఒకరి బిహేవియర్ మరొకరికి సరిపోకపోవడం వల్లే చాలా మంది వివాహ జీవితం దెబ్బతింటోంది. ఒకే తరహా చదువులు చదువుకున్నవారు ఒకరి పనిని, లైఫ్ స్టైల్‌ను మరొకరు అర్ధం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఐఐటీల వంటి బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ లో చదువుకున్నవారికి పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాలిస్తాయి. వాటిలో వారుండే పొజిషన్ సాధారణ ఉద్యోగాల్లా టెన్ టు సిక్స్ వర్కింగ్ అవర్స్‌తో ఉండకపోవచ్చు. టార్గెట్ ఓరియంటెడ్‌గా, ప్రాజెక్టు బేస్డ్‌గా ఉండొచ్చు. వాటికోసం డే అండ్ నైట్ పని చేయాల్సి రావడం, తరచూ క్యాంప్‌లు ఇలాంటివన్నీ ఉంటాయి. లైఫ్ పార్ట్‌నర్ కూడా ఆ స్థాయిలో చదువుకున్న వారైతే ఇలాంటివన్నీ అర్ధం చేసుకోగలుగుతారు. . అనే భావన బలపడుతోందని తక్ష్‌గుప్తా చెబుతున్నారు. ఈ మెంటల్ కంపాటిబులిటీ ఉండే ఈక్వల్ లేదా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న మ్యాచెస్ చూసేందుకే తమ ఐఐటీఐఐఎంషాదీ. కామ్ ప్రారంభించామన్నారు.
10 వేల రిజిస్ట్రేషన్లు
మ్యారేజెస్ అంటే మైండ్స్ కమ్ ఫస్ట్ అంటున్న తక్ష్.. తమ మ్యాట్రిమోనీలో సభ్యుల సంఖ్య త్వరలోనే 10 వేల మార్కును చేరుకుంటుందని చెప్పారు. ఐఐటీ, ఐఐఎంలే కాదు.. అన్ని ఫీల్డ్‌లోని టాప్ మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ లో చదువుకున్నవారికి తమ మ్యాట్రిమోనీ ఉపయోగపడుతుందని చెప్పారు. అకడమిక్ క్వాలిఫికేషన్స్ చూడడం తమ దగ్గర తప్పనిసరని, నకిలీ డిగ్రీలతో వచ్చేవారిని అరికట్టడం ఇక్కడ అత్యవసరమని అంటున్నారు. మ్యాట్రిమోనియల్ మార్కెట్‌కు వచ్చే ఉన్నత విద్యావంతుల దృష్టిని ఆకర్షించేందుకే తమ వెబ్‌సైట్‌కు ఆ పేరు పెట్టామని తక్ష్ వివరించారు. రేడియోలు, సినిమా హాళ్లతోపాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్‌లోనూ ఐఐటీఐఐఎంషాదీ. కామ్ కు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.
ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఒక కొత్త క్యాస్ట్‌గా మారిపోయింది అని బ్రాండ్ స్ట్రాటజిస్ట్ హరీష్ బిజూర్ చెప్పారు. అందుకే ఎలైట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్‌లో చదువుకుని వచ్చేవారి కోసం ఎలైట్ మాట్రిమోనియల్ సైట్స్ వస్తున్నాయన్నారు. ప్లేస్‌మెంట్ సీజన్ వస్తే ఇక ఈ విద్యాసంస్థల్లో చదువు పూర్తి చేసుకున్నవాళ్లకు రెండు రకాల మార్కెట్లు అందుబాటులో ఉంటాయని, ఒకటి కార్పొరేట్ బిజినెస్ మార్కెట్.. రెండోది మ్యారేజ్ మార్కెట్ హరీష్ చమత్కరించారు.