మనం ఏదైనా వీడియో చూడాలనుకున్నా లేదా డౌన్ లోడ్ చేయాలనుకున్నా ఏమి చేస్తాం? మనకు ఉన్న ఏకైక మార్గం యూ ట్యూబ్ నే కదా! పాపం పాకిస్తాన్ లో మాత్రం ఆ సౌకర్యం లేదు. అవును మీరు చదువుతున్నది నిజమే. 2012 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో యూ ట్యూబ్ యొక్క గ్లోబల్ మరియు స్థానిక సైట్ లపై పాకిస్తాన్ లో నిషేధం విధిస్తూ సుప్రీం కోర్ట్ తీర్పు నిచ్చింది. కానీ ఇప్పుడు ఆ నిషేధం ఎత్తివేసే సూచనలు కనిపిస్తున్నాయి. యూ ట్యూబ్ తన సరికొత్త పాకిస్తానీ వెర్షన్ youtube.com.pk ను ప్రారంభించనున్నట్లు తెలిసింది.కానీ ఇది పాకిస్తాన్ లోపల యాక్సేసిబుల్ అవదు అని సమాచారం. ఎందుకంటే యూ ట్యూబ్ పై సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని కనీసం పాక్షికం గా నైనా ఎత్తివేసే అవకాశం ఉన్నదని ప్రభుత్వం మరియు గూగుల్ భావిస్తున్నాయి. స్థానిక సైట్ లో ఉన్న కాంటెంట్ ఇంకా నియంత్రించవలసి ఉంది.అభ్యంతరకరమైన సమాచారాన్ని తొలగించ వలసిందిగా పాకిస్తాన్ టెలి కమ్యూనికేషన్ అథారిటీ ,గూగుల్ ను కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. గూగుల్ కనుక ప్రభుత్వ ఆదేశాలను పరిగణనలోనికి తీసుకుని అభ్యంతర కరమైన సమాచారాన్ని తొలగిస్తే సుప్రీo కోర్టు నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉంది.కాబట్టి అలాంటి అభ్యంతర కరమైన సమాచారాన్ని తొలగించే ప్రయత్నం లో గూగుల్ ఉన్నది. చట్టాలను అతిక్రమించే విధంగా ఉన్న వీడియో లను తప్పకుండా తొలగిస్తామని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. కానీ తొలగించే ముందు ఒకసారి పునః సమీక్షించుకుని తొలగిస్తామని గూగుల్ ప్రకటించింది. ఈ విషయం పై పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలనుండీ చర్చలు జరుపుతూనే ఉంది.కానీ యూ ట్యూబ్ పునః ప్రారంభానికి నిర్దిష్ట కాల పరిమితి ని ఇంతవరకూ ప్రభుత్వం విధించలేదు.కానీ ఈ సారి అతి త్వరలోనే యూ ట్యూబ్ పాకిస్తాన్ లో సందడి చేయబోతోంది. ఎందుకంటే ఈ నిషేధానికి సంబంధించి కోర్ట్ లో తదుపరి విచారణ మరో రెండు వారాల్లో జరగనున్న నేపథ్యం లో ఈ విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది . 2010 వ సంవత్సరం లో పాకిస్తాన్ ఫేస్ బుక్ ను కూడా రెండు వారాల వరకు నిషేధం విధించింది. చట్ట విరుద్దమైన సమాచారాన్ని కలిగి ఉన్నందుకు ఈ నిషేధాన్ని విధించింది. ఇప్పటికీ పాకిస్తాన్ లో కొన్ని వేల ఆన్ లైన్ లింక్ లను నిషేధిస్తూనే ఉంది.చూద్దాం మరి యూ ట్యూబ్ విషయం లో ఏం జరుగుతుందో. |