• తాజా వార్తలు

సెల్ఫీ మరణాలలో మనదే వరల్ద్ రికార్డ్

వెర్రి వేయి విధాలు అని ఏ మహానుభావుడు అన్నాడో కానీ ఒక్కోసారి అది అక్షరాలా నిజం అనిపిస్తుంది.అసలు టెక్నాలజీ వెబ్ సైట్ కీ వెర్రి కీ సంబంధం ఏమిటి అని మీరు అనుకుంటున్నారా? ఆ వెర్రి మన టెక్నాలజీ దే  మరి. ఈ రోజుల్లో యువతను అలాగే అన్ని రకాల ప్రజలను ఉర్రూతలూగిస్తున్న ట్రెండ్ సెల్ఫీ ట్రెండ్. దీనిని ట్రెండ్ అనే కంటే పిచ్చి లేదా వెర్రి అని అనాలేమో!స్మార్ట్ ఫోన్ లో ఎవరి తోనైనా  కలిసి ఒక ఫోటో దిగితే దానినే సెల్ఫీ అంటారు అని మనకు తెలుసు. సినిమా హీరోలు,రాజకీయ నాయకులూ , సెలెబ్రేటీలు ఇలా ఎవరు కనిపించినా వారితో సెల్ఫీ తీసుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయింది. సాక్షాత్తూ మన ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ లకు ఫోజులిస్తున్నారంటే దీని యొక్క మోజు యువత లో ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమా పాటల సాహిత్యం లోనూ ఈ సెల్ఫీ అనే పదాన్ని వాడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే దేన్నైనే మంచి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగించడం మానవ నైజం. విజ్ఞాన శాస్త్రానికి చెందిన అనేక ఆవిష్కరణ ల విషయం లో ఇది రుజువయ్యింది. ఇదే ట్రెండ్ సెల్ఫీ ల విషయం లోనూ కొనసాగుతుంది. చనిపోతూ సెల్ఫీ తీసుకోవడం మన దేశం లో ఈ మధ్య ఎక్కువ అయ్యింది. ఆ విషయం లో ప్రపంచం లో మన దేశమే ముందు వరుసలో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా గత సంవత్సరం 27 సెల్ఫీ మరణాలు సంభవిస్తే అందులో సగానికి పైగా మన భారత దేశం లోనే జరిగాయి. మనం ఇంతకూ ముందు వెర్రి వేయి విధాలు అని చెప్పుకున్నాము కదా ! దానికి ఒక చక్కని ఉదాహరణే ఈ సెల్ఫీ మరణాలు. వెర్రి కాకపోతే చని పోతూ ఫోటో దిగడం ఏమిటి? ఒకడు వేగంగా వస్తున్న రైలు కు ఎదురుగా వెళ్తూ సెల్ఫీ తీస్తాడు, మరొకడు పడవలోనుండి నదిలోకి దూకేస్తూ సెల్ఫీ అంటాడు, ఇంకొకడు పిస్టల్ తో కాల్చుకుంటూ సెల్ఫీ అంటాడు, మరొకడు పెద్ద కొండ మీదనుండి దూకేస్తూ సెల్ఫీ దిగుతానంటాడు. వీరందరు మరణించి మన దేశాన్ని సేల్ఫీ మరణాలలో ప్రధమ స్థానంలో నిలిపారు. గత సెప్టెంబర్ లో ఒక జపాన్ పర్యాటకుడు తాజ్ మహల్ పై నుండి దూకేస్తూ సెల్ఫీ తీశాడు. అదృష్టమో,దురదృష్టమో గాయాలతో బ్రతికి బయట పడ్డాడు.

ఈ ట్రెండ్ మన దేశం లోని అతి పెద్ద నగరమైన ముంబై లో ఎక్కువగా ఉంది. ఈ ట్రెండ్ దెబ్బకు ముంబై పోలీసులు నగరంలో సుమారు 10 కి పైగా నో సెల్ఫీ జోన్ లను ప్రకటించారు. బాంద్రా ప్రాంతం లోని ఒక కొండ ప్రాంతం లో సెల్ఫీ తీసుకుంటూ ముగ్గురు యువతులు  అరేబియా సముద్రం లో దూకేయడం తో అప్రమత్తమైన పోలీసులు నో సెల్ఫీ జోన్ లను ప్రకటించారు. ఇలా దేశం లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు అన్నింటిలోను నో సెల్ఫీ జోన్ లు ప్రకటించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.

ఇప్పుడు చెప్పండి.దీనిని వెర్రి అనాలా?లేదా పిచ్చి అనాలా? ఇంకేదైనా కొత్త పేరు చెప్పాలా ఆలోచించండి.

 

జన రంజకమైన వార్తలు