భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ ఏదైనా రుణం కోసం బ్యాంకులను సంప్రదిస్తే తొలుత సిబిల్ రికార్డు చూస్తారన్న సంగతి తెలిసిందే కదా.. సిబిల్ స్కోరును బట్టే ఆ వ్యక్తి రుణ పరపతి డిసైడ్ చేస్తారు. గతంలో తీసుకున్న రుణాలు, వాటిని తీర్చిన తీరు.. చెక్ బౌన్సులు, సకాలంలో చెల్లింపులు వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. అయితే... ఇక నుంచి సిబిల్ స్కోరు ను సోషల్ మీడియా కూడా ప్రభావితం చేయబోతోంది. సోషల్ మీడియాకు దీనికి ఏం సంబంధం అనుకుంటున్నారా? ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగులు, ఆయనకున్న మిత్రులు వంటివన్నీ పరిశీలించి డిసైడ్ చేస్తారట. వీటితో పాటు సోషల్ మీడియా ద్వారా జరిపే డిజిటల్ లావాదేవీలు, ఆన్ లైన్ లావాదేవీలనూ చూడాలనుకుంటున్నారు. ఈ దిశగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(సిబిల్) సవరణలు తేవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు పాత చట్టాల ఆధారంగా సిబిల్ స్కోర్ ఇస్తున్నామని.. మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు తేవాలనుకుంటున్నామని సిబిల్ సీఈఓ హర్షాల్ చందార్కర్ చెబుతున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చించి కొత్తగా తేనున్న సంస్కరణల విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడిస్తున్నారు. రుణ గ్రహీతల ఆర్థిక రహస్యాలు, వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తమ విధానం మార్చుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల ఇంతవరకు రుణాలు తీసుకోని కొత్తవారికి అనుకూలమని చెబుతున్నారు. ప్రస్తుత విధానంలో అంతవరకు రుణాలు తీసుకోనివారు, క్రెడిట్ కార్డులు లేనివారికి సిబిల్ స్కోరు ఉండక రుణాలు దొరకడం కష్టమవుతోంది. కానీ, కొత్త విధానం అమల్లోకి వస్తే అలాంటివారికి రుణం త్వరగా మంజూరయ్యే అవకాశాలు పెరుగుతాయి. అయితే ఆర్థిక క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఉండేవి... ఆర్థిక నేరాలు వంటివాటికి మద్దతుగా ఉండేలా ఉన్న పోస్టింగులు సరదాకి కూడా ఇకపై సోషల్ మీడియాలో్ పోస్టు చేయకపోవడం బెటర్. ఇప్పటికవరకు కొత్త సవరణలపై క్లారిటీ రాకపోయినప్పటికీ ఇలాంటివన్నీ లెక్కలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. అదేసమయంలో ఆర్థిక నేరగాళ్లు, బ్యాంకులను మోసగించినవారు మన స్నేహితుల లిస్టులో ఉన్నా కూడా ఇబ్బందికరమే కావొచ్చు. కాబట్టి ఈ కొత్త విధానం వస్తే సోషల్ మీడియాలో ఎకనమిక్ ఇష్యూస్ లో జాగ్రత్తగా ఉండడం బెటర్. |