ఫేస్‌బుక్.. ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎన్నో రకాల విషయాలకు నెలవు. దీనిలో రోజూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల పోస్టులు షేర్ అవుతుంటాయి. అందులో మంచివి ఉంటాయి... చెడ్డవి ఉంటాయి. మంచి పోస్టులు షేర్ అయితే ఫర్వాలేదు కానీ.. చెడ్డ పోస్టులు షేర్ అయితే అవి సమాజంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా యువతపై ఈ పోస్టుల ప్రభావం ఎంతో ఉంటుంది. రెచ్చగొట్టేలా ఉండే పోస్టులు, మనోభావాలను దెబ్బతీసేలా ఉండే పోస్టులు, వైరల్‌లా వస్తూ అందరిని ఇబ్బందిపెట్టే పోస్టులు ఫేస్‌బుక్ వినియోగదారులకు చాలా చికాకు తెప్పిస్తాయి. ముఖ్యంగా ఉగ్రవాద దాడులు లాంటి సంఘటనలు జరిగిప్పుడు ఫేస్‌బుక్‌లో షేర్లు వెల్లువెత్తుతాయి. రక్తపాతంతో కూడిన ఫొటోలు విపరీతంగా సర్క్యూలేట్ అవుతాయి. ఈ నేపథ్యంలో అలాంటి పోస్ట్‌లు తమ దేశ పరిథిలోకి రాకుండా చూడటానికి భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీని కోసం ఫేస్‌బుక్ సంస్థకు పదే పదే అప్పీల్ చేస్తోంది. ఇలా చెత్త కంటెంట్ రాకుండా రిస్ర్టిక్షన్ రిక్వస్ట్‌లు చేస్తున్న దేశాల్లో భారత్ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. 2015 ఏడాదిలో భారత్ ఈ ఫేస్‌బుక్ సంస్థకు ఇలా చాలా సందర్భాల్లో రిక్వస్ట్‌లు చేసింది. 2015 ఒక్క ఏడాదిలోనే భారత్ 15155 రిక్వస్టులు చేసింది. ఫేస్‌బుక్‌కు ఇలా కంటెంట్‌ను ఆపేయడానికి రిక్వస్ట్ చేసిన దేశాల్లో ఫ్రాన్స్ ముందంజలో ఉంది. అభ్యంతర కంటెంట్ తొలగించమని రిక్వస్ట్ చేసిన దేశాల్లో భారత్ త్వరలోనే ముందంజ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఫేస్‌బుక్ వాడుతున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్‌ది రెండో స్థానం. కానీ అభ్యంతర కంటెంట్ షేర్ అవుతున్న దేశాల్లోనూ మనదే ముందు ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి అందిన రిక్వస్టుల మేరకు భారత్‌లో చాలా రకాల కంటెంట్‌లను అనుమతించట్లేదని ఫేస్‌బుక్ పేర్కొంది. ఇంటర్నెట్ నియమ నిబంధనలను ఉల్లఘించిన అన్ని రకాల కంటెంట్‌ను నిషేధిస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. అంతేకాదు ఇక్కడ యూజర్ డేటాను తమ అనుమతులు లేకుండా ఎవరికి ఇవ్వకూడదని కూడా భారత్ షరతులు విధించింది. ప్రజలకు సంబంధించిన డేటాను వారికి తెలియకుండా వేరే వారికి ఇచ్చే అర్హత ఎఫ్‌బీకి లేదని కూడా భారత్ వాదిస్తోంది. |