ఫేస్ బుక్ లో పాతికవేల లైకులు - ట్విట్టర్ లో పాతిక వేల మంది ఫాలోవర్లు ఉంటేనే టిక్కెట్లు - బీజేపీ షరతు సోషల్ మీడియా ఇప్పుడు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో బీజేపీ - ఇతర పార్టీలు కూడా సోషల్ మీడియాను ప్రచారంలో పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు ఈసారి అయిదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో బీజేపీ చీఫ్ అమిత్ షా మరో కొత్త విధానం తీసుకొచ్చారు. పార్టీ టిక్కెట్లకు సోషల్ మీడియాలో పాపులారిటీకి లింకు పెట్టారు. ఫేస్ బుక్ లో పాతికవేల లైకులు - ట్విట్టర్ లో పాతిక వేల మంది ఫాలోవర్లు ఉంటేనే టిక్కెటిస్తామని ఉత్తరప్రదేశ్ నేతలకు ఆయన చెబుతున్నారట. మోడీకి అత్యంత నమ్మకస్తుడైన ఈ సక్సెస్ ఫుల్ స్ట్రాటజిస్టు ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు గెలుపుగుర్రాల్ని సెలెక్టు చేసే పనిలో బిజీగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా యూపీ ఎన్నికల బాధ్యతని భుజాలమీదేసుకున్న అమిత్షా క్యాండేట్ల సెలక్షన్ లో సరికొత్త క్వాలిఫికేషన్ కావాలంటున్నారట. మామూలుగా అయితే ఏ ఎలక్షనొచ్చినా మన అనేవాడికి టికెట్లిచ్చుకోవడం ఆర్థికంగా కాస్త సౌండ్ ఉన్నవారికి పెద్దపీట వేయటం మామూలే. ఇక పార్టీకి భారీగా డొనేషన్లిస్తే అదో అదనపు అర్హత. ఇక కులం గోత్రం - పార్టీకి ఆయనగారు చేసిన సేవలు ఇవన్నీ కూడా మార్కులేయడానికున్న కొలమానాలు. కానీ వీటితో పాటు మరో క్వాలిఫికేషన్ కంపల్సరీ అంటున్నారు అమిత్ షా. ఓ టికెట్ ఇస్తే విశ్వాసంగా పడుంటామని వంగొంగి దండాలు పెడుతున్నవారంతా అమిత్షా కండిషన్ విని కళ్ళు తేలేస్తున్నారట. కోట్లు డిపాజిట్ చేయమనో గెలుస్తామనే గ్యారంటీని స్టాంప్ పేపర్ మీద రాసివ్వమనో అడగడంలేదాయన. టికెట్ కావాలంటే ఫేస్ బుక్ లో ఓ పాతికవేల లైకులు కొట్టించుకోవాలని సెలవిస్తున్నారట. పోనీ కిందామీదా పడి ఎలాగోలా మేనేజ్ చేద్దామనుకున్నా ఫేస్ బుక్ లైకులొక్కటే సరిపోవట. ట్విట్టర్ లో కూడా పాతికవేలమంది ఫాలోవర్లు ఉండాలనేసరికి వినేవాళ్ళకి దిమ్మతిరిగి మైండ్ బ్లాకవుతోంది. ఎందుకంటే యూపీ స్టేట్ కి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న పెద్దాయనకే తిప్పితిప్పి కొడితే పదివేలమంది ఫాలోవర్లు లేరు. అవసరమైతే ఓ పాతికకోట్లు ఖర్చుపెట్టేసి మందీమార్బలంతో బెదిరించయినా ఓట్లేయించుకునే కెపాసిటీ ఉన్నోళ్ళు బోలెడుమంది ఉన్నారుగానీ సోషల్ మీడియాలో ఎవరికీ అంత సీను లేదట. అందుకే అమిత్ షా కండిషన్ తో యూపీ నేతలు లబోదిబోమంటున్నారట. |