సెల్లో సిగ్నల్ స్ట్రెంత్ మెరుగుపర్చుకోడానికి - కొన్ని టిప్స్ స్మార్ట్ ఫోన్ మయంగా మారిన నేటి ప్రపంచంలో ప్రతి విషయానికీ మనకు స్మార్ట్ ఫోన్ అవసరం అవుతుంది. అసలు ఏదైనా స్మార్ట్ ఫోన్ తర్వాతే అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. మరి అలాంటి ఏ ఏ పరిస్థితులలో మన ఫోన్లో నెట్వర్క్ సిగ్నల్ అనేది బాగాఉండేట్లు చూసుకోవలసిన అవసరం ఉంది. అది 2జి అయినా, 3జి అయినా, 4జి అయినా లేక వైఫై అయినా మన సిగ్నల్ స్ట్రెంత్ బాగా ఉన్నపుడు మాత్రమే స్మార్ట్ ఫోన్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్క స్మార్ట్ ఫోన్ అనే కాదు మామూలు ఫోన్ అయినా సరే కనెక్టివిటీ సరిగా లేకపోతే ఉపయోగం లేదు కదా! మరి మన ఫోన్లలో సిగ్నల్ బాగా ఉండాలి అంటే మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? సిగ్నల్ బార్ ను అర్థం చేసుకోవడం. ఈ సిగ్నల్ బార్ అనేది ఒక్కో ఫోన్కూ ఒక్కో రకంగా ఉంటుంది. అంటే ఫోన్ తయారీదారుని బట్టి ఈ సిగ్నల్ బార్ మారిపోతూ ఉంటుంది. దీనికి ఇలా ఉండాలి లేదా అలా ఉండాలి అనే ప్రమాణాలు ఏవీ లేవు. ఉదాహరణకు i ఫోన్ మరియు గాలక్సీలలో ఒకే ప్రదేశంలో ఒకే నెట్ వర్క్ యొక్క బలం ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే ఒక దానిలో నాలుగు బార్ లు కనిపిస్తాయి, మరొక దానిలో రెండు బార్లు మాత్రమే కనిపిస్తాయి. దీనికి కారణం ఇంతకుముందు మనం చెప్పుకున్నదే. సరైన సిగ్నల్ స్ట్రెంత్ కనుక్కోవడం i ఫోన్ లో సరైన సిగ్నల్ స్ట్రెంత్ కనుక్కోవాలంటే *3001#12345#* ను డయల్ చేయాలి. ఇది మీ ఫోన్ ను సీక్రెట్ టెస్టింగ్ మోడ్లో ఉంచి మీ నెట్ వర్క్ యొక్క సిగ్నల్ స్ట్రెంత్ dBm లలో చూపిస్తుంది. dBm అంటే డెసిబుల్ మిల్లి వాట్స్. అదే ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే సెట్టింగ్లలోకి వెళ్లి అబౌట్ ఫోన్ మెనూను ఓపెన్ చేయాలి. అక్కడ మనకు స్టేటస్ టాబ్ మరియు సిగ్నల్ ఇండికేటర్ కనిపిస్తుంది. సాధారణంగా 70 dBM ఉంటే సిగ్నల్ స్ట్రెంత్ బాగా ఉన్నట్లుగా పరిగణిస్తారు. అంతకంటే తక్కువ ఉంటే సిగ్నల్ స్ట్రెంత్ వీక్గా ఉన్నట్లు భావిస్తారు. మీ ఇంట్లో సిగ్నల్ ను పరిశీలించండి. అసలు ముందు మీ ఇల్లు లేదా ఆఫీస్ పరిసరాలలో సిగ్నల్ స్ట్రెంత్ ఏ మేరకు వుందో తెలుసుకోవడం ఆవశ్యకం. ప్రతి గదీ తిరిగి ఎక్కడ సిగ్నల్ బాగా వుందో తెలుసుకోవడం ఎందుకైనా మంచిది. ఎందుకంటే మీకు ఏదైనా అర్జెంటు మరియు ముఖ్యమైన కాల్ వచ్చినపుడు తక్కువ సిగ్నల్ వలన ఇబ్బంది పడకూడదు కదా! ఒక్కో సారి అది మీ ఇంటర్వ్యూ కాల్ కూడా అయ్యి ఉండవచ్చు. అలాంటపుడు సరైన సిగ్నల్ ఉన్న రూమ్లో కూర్చుని మాట్లాడడం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు. సరైన టవర్ ను కనుక్కోవడం ఓపెన్ సిగ్నల్ లాంటి యాప్ల వలన మీ దగ్గరలోని టవర్ల సమాచారం మరియు మీరు ఏ టవర్కు కనెక్ట్ అయిఉన్నారో కూడా తెలుస్తుంది. సాధారణంగా ఈ ఫోన్ లన్నీ సిగ్నల్ బాగా ఉన్న టవర్కు కనెక్ట్ అవకుండా బాగా తక్కువ సిగ్నల్ అందించే టవర్కు కనెక్ట్ అవుతూ ఉంటాయి. కాల్ డ్రాప్లకు ఇదొక ముఖ్యమైన కారణం. ఈ ఓపెన్ సిగ్నల్ లాంటి యాప్లను ఉపయోగించి మీ ఓరియంటేషన్ మార్చుకోవడం ద్వారా ఎక్కువ సిగ్నల్ ఉన్న టవర్ కు కనెక్ట్ అవ్వవచ్చు. సిగ్నల్ బలంగా ఉన్నటవర్కు స్విచ్ అవ్వండి. మనం పైన చెప్పుకున్నట్లు అన్ని ఫోన్లూ తక్కువ సిగ్నల్ ఉన్న టవర్కే కనెక్ట్ అవుతాయి. ఇక్కడ మనం చేయవలసింది ఏమిటంటే స్ట్రాంగ్ సిగ్నల్ ఉన్నటవర్కి మన ఫోన్ను కనెక్ట్ చేయడం. మరి అది ఎలా? మన ఫోన్ను ఎయిర్ ప్లేన్ మోడ్లో ఆన్ ఆఫ్ చేయడం ద్వారా అది ఆటోమాటిక్గా స్ట్రాంగ్ సిగ్నల్ ఉన్న టవర్కు కనెక్ట్ అయిపోతుంది. ఒకవేళ మీ ఫోన్ ఎయిర్ ప్లేన్ మోడ్కి సపోర్ట్ చేయకపోతే మీ ఫోన్ రీస్టార్ట్ చేయండి, అంతే అది ఇక స్ట్రాంగ్ సిగ్నల్ ను అందుకుంటుంది. |